
మండలిలో ప్రతిపక్ష నేతగా షబ్బీర్
శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా మహ్మద్ అలీ షబ్బీర్ నియమితులయ్యారు. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండలి చైర్మన్ స్వామి గౌడ్‌కు మంగళవారం లేఖ రాశారు. ఇప్పటిదాకా ప్రతిపక్షనేతగా వ్యవహరిస్తున్న డి.శ్రీనివాస్ మార్చి 29న రిటైర్ కావడంతో ఖాళీ అయిన ప్రతిపక్ష నేత స్థానాన్ని షబ్బీర్ భర్తీ చేస్తారని లేఖలో పేర్కొన్నారు.
శాసనమండలిలో ఉన్న ఖాళీలు భర్తీ అయ్యే దాకా ప్రతిపక్ష నేతగా షబ్బీర్ వ్యవహరిస్తారన్నారు. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తమ్ మీడియాకు వెల్లడించారు. అయితే షబ్బీర్ నియామకంపై పలువురు ఎమ్మెల్సీలు అసంతృప్తితో ఉన్నారు. ఈ వ్యవహారంపై బుధ, గురువారాల్లో రాష్ట్ర పర్యటనకు రానున్న దిగ్విజయ్‌సింగ్‌కు ఫిర్యాదు చేయాలని వారు భావిస్తున్నారు. శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా డి.శ్రీనివాస్ ఎన్నికయ్యేనాటికి కాంగ్రెస్‌కు 17 మంది ఎమ్మెల్సీలు ఉండగా ఆ తరువాత కాలం లో 9 మంది ఎమ్మెల్సీలు పార్టీని వదలి టీఆర్‌ఎస్‌లో చేరారు. మిగిలిన వారిలో డి.శ్రీనివాస్, పీర్ షబ్బీర్ అహ్మద్ మార్చి 29న రిటైర్ అయ్యారు.
ప్రస్తుతం ఆ పార్టీకి ఆరుగురు ఎమ్మెల్సీలు ఉన్నారు. శాసనమండలిలో ఎమ్మెల్యే కోటాలో కాంగ్రెస్‌కు ఒక స్థానం రానుంది. దీని ప్రకారం ఈ ఎన్నిక పూర్తయ్యేదాకా ప్రతిపక్షనేత ఎన్నికను వాయిదా వేయాలంటూ మార్చి 20న దిగ్విజయ్‌కు షబ్బీర్ మినహా మిగిలిన నలుగురు ఎమ్మెల్సీలు (పొంగులేటి సుధాకర్‌రెడ్డి, రంగారెడ్డి, ఎం.ఎస్.ప్రభాకర్, ఫారూఖ్ హుస్సేన్) లేఖ రాశారు.
అమెరికాలో ఉన్న ఎమ్మెల్సీ పి.సంతోష్‌కుమార్ కూడా ఇదే అభిప్రాయంతో దిగ్విజయ్‌కు ఎస్‌ఎంఎస్ పంపినట్టు సమాచారం. అయినా ఇవేవీ పట్టించుకోకుండా షబ్బీర్‌ను ఎలా నియమిస్తారంటూ పలువురు ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏఐసీసీ పరిశీలకులు లేకుండా, పార్టీ ఎమ్మెల్సీల అభిప్రాయం తీసుకోకుండా ఏకపక్షంగా షబ్బీర్ అలీని ఎలా నియమిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. దీనిపై దిగ్విజయ్‌కు ఫిర్యాదు చేయనున్నట్టుగా ఒక ఎమ్మెల్సీ వెల్లడించారు.