సీఎం హామీలపై షబ్బీర్ అలీ ఫర్మానా
101 ఎన్నికల హామీల్లో మూడు అమలు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలకు ముందు 101 హామీలు ఇచ్చి, ఇప్పటిదాకా కేవలం మూడింటినే నెరవేర్చారని పీసీసీ ఉపాధ్యక్షుడు షబ్బీర్ అలీ విమర్శించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన 101 ముఖ్యహామీలతో 10 అడుగుల ఫర్మానా(రాజుల కాలంలో ఉత్తర ప్రత్యుత్తరాలు)ను సీఎం కె.చంద్రశేఖర్‌రావుకు షబ్బీర్ అలీ బుధవారం పంపించారు. కేసీఆర్ పాలన వ్యవహారశైలి రాజరిక, నియంతల ధోరణిలో ఉందని, అందుకే రాజుల కాలంలో వాడిన షాహి ఫర్మా నారూపంలో లేఖను తయారు చేయించి పంపుతున్నట్టుగా వివరించారు.
ఏరోజుకారోజు కొత్త హామీలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణకోసం 2 వేల మంది ఆత్మబలిదానాలు చేసుకోగా ఇప్పటిదాకా కేవలం 459 కుటుంబాలకే సహాయం అందించారని వివరించారు. రైతులకు కేవలం 25 శాతమే రుణం మాఫీ చేశారని చెప్పారు. గిరిజనులకు, మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ఎన్నికల్లో హామీనిచ్చి, ఇప్పుడు చట్టబద్ధత లేని విచారణ కమిషన్లను ఏర్పాటు చేయడం మోసం కాదా అని షబ్బీర్ అలీ ప్రశ్నించారు.