
అంతర్జాతీయ పురస్కారం పొందిన క్యారికేచర్‌తో ‘సాక్షి’ కార్టూనిస్టు శంకర్
సాక్షి, హైదరాబాద్: ‘సాక్షి’ ప్రధాన కార్టూనిస్టు పామర్తి శంకర్‌కు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. పోర్చుగల్‌కు చెందిన వరల్డ్ ప్రెస్ కార్టూన్ సంస్థ ఏటా ప్రపంచ స్థాయిలో ఉత్తమ ఎడిటోరియల్ కార్టూన్లు, క్యారికేచర్లకు ప్రకటించే గ్రాండ్ ప్రి అవార్డు ఈ ఏడాది ఆయన్ను వరించింది. 2014 సంవత్సరానికి దాదాపు 64 దేశాల నుంచి పోటీకి వచ్చిన ఎంట్రీల్లో శంకర్ గీసిన హక్కుల పోరాటయోధుడు నెల్సన్ మండేలా క్యారికేచర్ ఉత్తమ ఎంట్రీగా ఎంపికైంది.
దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా మరణించినప్పుడు శంకర్ గీసిన ఈ క్యారికేచర్ 2013 డిసెంబర్ 6న ప్రచురితమైంది. గ్రాండ్ ప్రి అవార్డు ఆసియాకు చెందిన వారికి దక్కడం ఇదే తొలిసారి కావడం విశేషం. కార్టూనిస్టులోకం దీన్ని ఆస్కార్, నోబెల్ ప్రైజుగా పరిగణిస్తుంటుంది. ఈ అవార్డు కింద 10 వేల యూరోల నగదు లభిస్తుంది. పోర్చుగల్‌లో ఏటా నవంబర్‌లో నిర్వహించే అంతర్జాతీయ ఎగ్జిబిషన్ సందర్భంగా ఈ అవార్డును బహూకరిస్తారు.
నల్గొండ జిల్లా నాగిరెడ్డిపల్లికి చెందిన శంకర్ ఎనిమిదేళ్లుగా ‘సాక్షి’ దినపత్రికలో కార్టూనిస్టుగా పనిచేస్తున్నారు. ఫోరం ఫర్ పొలిటికల్ కార్టూనిస్ట్స్ సంస్థకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న శంకర్‌కు గతంలో నాలుగుసార్లు అంతర్జాతీయ స్థాయిలో బహుమతులు వచ్చాయి. బ్రెజిల్, ఇరాన్, చైనా దేశాల్లో నిర్వహించిన పోటీల్లో ఈ అవార్డులను కైవసం చేసుకున్నారు. ఆయన వేసిన వాటిలో దలైలామా, బ్రూస్‌లీ, మదర్ థెరిసా, ఆంగ్‌సాన్ సూకీ, ఒబామా తదితర ప్రముఖుల క్యారికేచర్లకు అంతర్జాతీయస్థాయిలో ప్రశంసలు దక్కాయి.
నాకు నచ్చిన నేత మండేలా: పామర్తి శంకర్
‘‘నాకు నచ్చిన నేత నెల్సన్ మండేలా. ఆయనపై గీసిన క్యారికేచర్‌కే ఈ అవార్డు దక్కడం ఆనందంగా ఉంది. ఈ క్యారికేచర్‌లో మూడు విశేషాలున్నాయి. నల్ల సూరీడుకు సూచికగా ఆయన మొహాన్ని నలుపు రంగు... ఆ దేశ సంస్కృతిని ప్రతిబింబించేలా ఆయన షర్టును విభిన్నరంగులు.. ఆయన పోరాటానికి సంకేతంగా పిడికిలిని ఎరుపురంగు వేశాను. విభిన్నమైన పెన్సిల్ వర్క్ కూడా దీనికి తోడైంది. ఈ ప్రయోగమే అవార్డు జ్యూరీకి నచ్చిందని నా భావన.
ఈ ప్రతిష్టాత్మక అవార్డు, గుర్తింపు కోసం ఏడేళ్లుగా పోటీలో పాల్గొంటున్నాను. నిజానికి 2005లో చార్‌కోల్‌తో మండేలా బొమ్మను గీశాను. ఆయన మరణం నేపథ్యంలో క్యూబిక్ ఫామ్‌లో విభిన్నమైన పెన్సిల్ వర్క్‌తో గీయాలని సంకల్పించాను. దీనికి అంతర్జాతీయస్థాయి గుర్తింపు లభించడం సంతోషకరం. అడుగడుగునా నా వెన్నుతట్టి ప్రోత్సహించే ‘సాక్షి’ యాజమాన్యం, ఎడిటోరియల్ విభాగానికి కృతజ్ఙతలు’’