వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గట్టు శ్రీకాంత్‌రెడ్డి
హుజూర్‌నగర్ : ఈ నెల 9 నుంచి 12 వరకు జిల్లాలోని 6 నియోజకవర్గాలలో వైఎస్.జగన్ సోదరి షర్మిల చేపట్టిన పరామర్శ యాత్రను విజయవంతం చేయాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గట్టు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి అకాల మరణాన్ని జీర్ణించుకోలేక మృతి చెందిన వైఎస్ అభిమానుల కుటుంబాలను పరామర్శిస్తామని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ఆయన సోదరి షర్మిల ఈ యాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు.
జిల్లాలోని భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, నకిరేకల్, నల్లగొండ, మునుగోడు నియోజకవర్గాలలో చేపట్టనున్న ఈ పరామర్శ యాత్ర ద్వారా 17 కుటుంబాలను ఆమె కలుసుకుంటారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రవేశపెట్టి అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిపొందిన ప్రజలు నేటికీ ఆయన పాలనను మరువలేకపోతున్నారన్నారు. ప్రాంతాలకతీతంగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగించి స్వర్ణయుగాన్ని అందించిన ఘనత వైఎస్సార్‌కే దక్కిందని కొనియాడారు. వైఎస్సార్ ఆశయ సాధన కోసం ఆయన కుమారుడు వైఎస్.జగన్ స్థాపించిన వైఎస్సార్‌సీపీని ప్రజలు ఆదరిస్తున్నారన్నారు.
తెలంగాణలో పార్టీ బలోపేతానికి కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని కోరారు. అదేవిధంగా పరామర్శ యాత్ర నిర్వహించేందుకు జిల్లాకు వస్తున్న షర్మిలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు, అనుబంధ సంఘాలు, వైఎస్సార్ అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చి అపూర్వ స్వాగతం పలకాలని కోరారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అయిల వెంకన్నగౌడ్, రాష్ట్ర కార్యదర్శులు వేముల శేఖర్‌రెడ్డి, ఇరుగు సునీల్‌కుమార్, జిల్లా కార్యదర్శి కోడి మల్లయ్యయాదవ్, జిల్లా కోశాధికారి పిల్లి మరియదాసు, పట్టణ అధ్యక్షుడు గుర్రం వెంకటరెడ్డి, నాయకులు పి.సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
షర్మిల పరామర్శ యాత్రను విజయవంతం చేయాలి
Published Thu, Jun 4 2015 11:49 PM | Last Updated on Tue, May 29 2018 4:18 PM
Advertisement