సర్ఫరాజ్ అహ్మద్
సాక్షి, కరీంనగర్: ఊహించిందే జరిగింది. ‘సాక్షి’ కథనం నిజమైంది. మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్‌కు ముందే కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను రాష్ట్ర ఎక్సైజ్æ శాఖ డైరెక్టర్‌గా నియమిస్తూ కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా ప్రస్తుతం జోగులాంబ–గద్వాల జిల్లాలో బాధ్యతలు నిర్వహిస్తున్న 2013 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన కొండూరు శశాంకకు పోస్టింగ్ ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి ఉత్తర్వులు(జీవో నెంబర్ 3320) జారీ చేశారు. కాగా ఐఏఎస్‌గా జగిత్యాల సబ్ కలెక్టర్‌గా తొలుత బాధ్యతలు నిర్వర్తించిన శశాంక ఆ తరువాత సుమారు రెండేళ్లపాటు కరీంనగర్ మునిసిపల్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించి సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. మంత్రి గంగుల తన పంతం నెగ్గించుకోవడంలో సఫలమయ్యారు.
వివాదాల మధ్య సర్ఫరాజ్ అహ్మద్ బదిలీ
జిల్లాల పునర్విభజన అనంతరం కరీంనగర్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన 2009 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి సర్ఫరాజ్ అహ్మద్ మూడేళ్లకు పైగా ఒకే చోట కొనసాగారు. మునిసిపల్ ఎన్నికలు ముగిసేంత వరకు ఇతర అధికారుల తరహాలోనే కలెక్టర్ కూడా కొనసాగుతారని భావించారు. గత అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచే కరీంనగర్‌కు చెందిన మంత్రి గంగుల కమలాకర్‌తో కలెక్టర్‌కు సత్సంబంధాలు కొరవడ్డాయి. అసెంబ్లీ ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన
కలెక్టర్ ప్రత్యర్థి పార్టీలకు అనుకూలంగా వ్యవహరించారని గంగుల ఆరోపణ. దీనికి సంబంధించి ప్రభుత్వ పెద్దలకు పలుమార్లు ఫిర్యాదులు కూడా చేశారు. అయినా వరుస ఎన్నికల నేపథ్యంలో బదిలీల ప్రక్రియ ఆగుతూ వచ్చింది. కాగా ఇటీవల వెలుగులోకి వచ్చిన ఓ మొబైల్ ఆడియో టేప్ రాష్ట్ర వ్యాప్తంగా వివాదాస్పదమైంది. 2018 ఎన్నికల ఫలితాల అనంతరం అప్పటి బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్‌తో జరిపిన సంభాషణపై మంత్రి గంగుల సీరియస్ గా తీసుకున్నారు. తనను ఓడించేందుకు చేసిన కుట్రలు ఫలించకపోవడంతో గెలిచిన ఎమ్మెల్యేను అనర్హుడిగా చేసేందుకు గల అవకాశాలపై బీజేపీ అభ్యర్థితో కలెక్టర్ చర్చించడం ఏంటని మంత్రి సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో సర్ఫరాజ్ అహ్మద్ బదిలీ అనివార్యమైంది.
ప్రొటోకాల్ ఉల్లంఘనలపై సైతం ఫిర్యాదు
క్రిస్‌మస్ పండుగను పురస్కరించుకొని క్రైస్తవ కుటుంబాలకు దుస్తుల పంపిణీ, వేడులకు నగదు సహాయం అందించే కార్యక్రమంపై సంఘం పెద్దలతో ఇటీవల కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో సమావేశం జరిగింది. దీనికి మంత్రి గంగుల కమలాకర్ హాజరు కాగా, అధికారులు ఎవరూ సమావేశానికి రాలేదు. అదే సమయంలో గవర్నర్ కార్యక్రమంపై కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ తన చాంబర్‌లో వివిధ శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. తన చాంబర్ పక్కనే కాన్ఫరెన్స్ హాల్‌లో తాను పాల్గొన్న సమావేశానికి కలెక్టర్, ఇతర అధికారులు రాకుండా తహసీల్దార్లను పంపించడాన్ని మంత్రి గంగుల తీవ్రంగా పరిగణించారు. దీనిపై ప్రభుత్వానికి సమాచారం అందించడమే గాకుండా, మునిసిపల్ ఎన్నికలకు ముందే కలెక్టర్‌ను మార్చాలని కోరినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఒకటి రెండు రోజుల్లో షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్న తరుణంలో కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌ను బదిలీ చేసి, కరీంనగర్‌కు సుపరిచితుడైన శశాంకకు తీసుకురావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment