స్థిరాస్తి రంగం కుదేలు
పెద్ద నోట్ల రద్దుతో ఆగిన లావాదేవీలు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేయడంతో రాష్ట్రంలో స్థిరాస్తి రంగం అకస్మాత్తుగా కుప్పకూలింది. రాష్ట్రవ్యాప్తంగా స్థిరాస్తి లావాదేవీలు స్తంభించిపోయాయి. కొత్త లే అవుట్ల కోసం భూముల కొనుగోళ్లు నిలిచిపోయాయి. రాష్ట్రంలో రోజువారీ స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు 10 శాతానికి పడిపోయారుు. రూ.వేల కోట్ల పెట్టుబడితో రియల్టర్లు చేపట్టిన లే అవుట్లు, భవన నిర్మాణ పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. బ్యాంకుల నుంచి నగదు ఉపసంహరణలపై ఆంక్షలు ఉండడంతో బిల్డర్లు, నిర్మాణరంగ కాంట్రాక్టర్లు, సబ్ కాంట్రాక్టర్లు కూలీలకు వేతనాలు చెల్లించలేని పరిస్థితులు నెల కొన్నారుు.
రోజువారీ కూలీలుగా పనిచేస్తున్న వేలాది మంది నిర్మాణరంగ కార్మికులు ఉపాధి కోల్పోయారు. స్థిరాస్తి రంగం తేరుకుని మళ్లీ పుంజుకోవడానికి కనీసం 9 నెలల నుంచి ఏడాది సమయం పట్టవచ్చని నిర్మాణరంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుబాటు ధర (అఫర్డబుల్)కు లభించే 1000 చదరపు అడుగులు, 1500 చదరపు అడుగుల చిన్న గృహాలకు సైతం ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ పడిపోరుుంది. తాజా పరిణామాల నేపథ్యంలో ధరలు పతనమవుతాయని కొనుగోలుదారులు సైతం వేచి చూస్తున్నారు.
ఫీజులపై మారటోరియం విధించండి...
హెచ్‌ఎండీఏకు లే అవుట్ ఫీజుల వారుుదాల చెల్లింపులపై కనీసం మూడు నెలల మారటోరియం విధించాలని తెలంగాణ డెవలప్‌మెంట్ అసోసియేషన్ (టీడీఏ) తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అదే విధంగా జీహెచ్‌ఎంసీకి చెల్లించాల్సిన భవన నిర్మాణ ఫీజులను మూడు వారుుదాల రూపేణా 9 నెలల్లో చెల్లించేందుకు వెసులు బాటు కల్పించాలని కోరింది. టీడీఏ అధ్యక్షు డు జీవీ రావు శనివారం సచివాలయంలో రాష్ట్ర పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంజీ గోపాల్‌ను కలసి ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దు వల్ల స్థిరాస్తి రంగం భారీ ఒడిదుడుకులకు లోనైందన్నారు. దీంతో ఫీజుల చెల్లింపులపై మూడు నెలల మారటోరియం కోరామన్నారు.