మా దారి...అడ్డదారి | Shortcut our way ... | Sakshi
Sakshi News home page

మా దారి...అడ్డదారి

Published Fri, Sep 5 2014 3:48 AM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM

మా దారి...అడ్డదారి - Sakshi

మా దారి...అడ్డదారి

  • నడి రోడ్డుపైనే బస్సులు
  •  అడుగడుగునా స్తంభిస్తున్న ట్రాఫిక్
  •  బస్‌స్టాపులలో ఆటోల తిష్ట
  • సాక్షి, సిటీబ్యూరో: ఆర్టీసీ బస్సుల పుణ్యమా అని నగరంలోని అనేక రహదారుల్లో తరచూ ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. ఒక్కోసారి కిలోమీటర్ల కొద్దీ వాహనాలు బారులు తీరుతున్న సంఘటనలూ ఉంటున్నాయి. స్టాప్‌లలో ఆపాల్సిన బస్సులను డ్రైవర్లు ఇష్టారాజ్యంగా రహదారుల మధ్యలోనే నిలుపుతుండడంతో ఈ సమస్య ఉత్పన్నమవుతోంది.బస్ స్టాపులు, బస్‌బేలు, షెల్టర్ల వద్ద నిలవాల్సిన బస్సులు...రోడ్డుకు అడ్డంగా నిలుస్తుంటాయి. వాటి వెనకనే వచ్చే ఇతర వాహనాలు ముందుకెళ్లలేక...నిలిచిపోయే పరిస్థితులు తలెత్తుతున్నాయి.

    ఓవైపు మెట్రో పనుల కారణంగా రోడ్లు ఇరుకుగా మారుతుండగా...అదే రోడ్లపై ఆపుతున్న బస్సుల వల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. దీనికి తోడు ఆటోలు ఉండనే ఉంటున్నాయి. బస్సుల పక్కనే వీటిని ఆపుతూ ప్రయాణికులు బస్సుల్లోకి ఎక్కకుండా ఆటోవాలాలు అడ్డు పడుతుంటారు. బస్సులకు ముందూ వెనుక వీటిని నిలుపుతుండడంతో మోటార్ సైకిల్ వెళ్లేందుకు కూడా రోడ్డుపై అవకాశం ఉండడం లేదు. నగరమంతటా నిత్యం ఇదే పరిస్థితి ఉంటున్నా... ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీసీ అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు.
     
    ఇదీ పరిస్థితి...

    ఉప్పల్ డిపోలోంచి బయలుదేరిన బస్సులు ఎలాంటి ఆటంకాలు లేకుండా శాంతినగర్ బస్‌స్టాప్ వరకు వస్తాయి. అక్కడ బస్సులను ఎడమ వైపున నిలిపి, ప్రయాణికులను ఎక్కించుకునేందుకు కావలసినంత స్థలం ఉంటుంది. అయినాసరే రోడ్డుపైనే నిలుపుతారు. బస్సులతో పాటే అన్ని వాహనాలూ ఆగిపోతాయి. ఉప్పల్ గాంధీ బొమ్మ బస్‌స్టాప్ దగ్గరా అదే పరిస్థితి. ఉప్పల్ రింగు రోడ్డు దగ్గర ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసిన ‘వాహనాలు నిలిపితే రూ.వెయ్యి చలానా విధిస్తా’మనే హెచ్చరికల బ్యానర్ కనిపిస్తుంది. అయినా సరే వాహనాలు అక్కడే ఆగిపోతాయి.

    మెట్రో పనుల దృష్ట్యా రోడ్డు పూర్తిగా ఇరుకైపోవడంతో హబ్సీగూడ స్ట్రీట్ నెంబర్ 8 చౌరస్తాలో ఉన్న బస్‌స్టాప్‌ను తొలగించారు. అయినా ఆర్టీసీ డ్రైవర్లు అక్కడ రోడ్డు మధ్యలోనే బస్సులు ఆపేస్తారు. దాంతో కిలోమీటర్‌కు పైగా  వాహనాలు నిలిచిపోతుంటాయి. హబ్సీగూడ స్వాగత్ హోటల్ దాటగానే రోడ్డు విశాలంగా ఉంటుంది. బస్‌షెల్టర్ కూడా ఉంది. కానీ అక్కడ ఒక్క బస్సూ ఆగదు. రోడ్డు పైనే నిలిపేస్తారు. రామంతాపూర్ టీవీ స్టూడియో బస్‌స్టాప్, హోమియోపతి కళాశాల బస్‌స్టాప్, అంబర్‌పేట్ చౌరస్తా, వీఎస్‌టీ, ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని బస్‌భవన్‌కు ఎదురుగా ఉన్న బస్‌స్టాప్, మెట్టుగూడ, సికింద్రాబాద్, బేగంపేట్ ..అన్నిచోట్లా ఇదే పరిస్థితి.

    పంజగుట్ట నిమ్స్ ఆస్పత్రిని ఆనుకొని ఉన్న స్టాప్, దానికి ఎదురుగా ఉన్న స్టాప్ వద్ద రోడ్డు మధ్యలోనే బస్సులు నిలిచిపోతాయి. ఎర్రమంజిల్, ఖైరతాబాద్ ఆర్టీఏ బస్ స్టాప్‌లలో విశాలమైన బస్ బేలు ఉన్నాయి. కానీ చాలా మంది డ్రైవర్లు రోడ్డుపైనే ఆపేస్తారు. మెహదీపట్నంలో ఇష్టారాజ్యంగా ఆపే బస్సుల కారణంగా ట్రాఫిక్ నరకప్రాయంగా మారింది. అబిడ్స్, కోఠి వంటి నిత్యం రద్దీ ఉండే ప్రాంతాలు, దిల్‌సుఖ్‌నగర్, ఎల్‌బీనగర్, హయత్‌నగర్, కూకట్‌పల్లి, మియాపూర్ వంటి విశాలమైన రోడ్డు సదుపాయం ఉన్న మార్గాల్లోనూ స్టాప్‌లలో బస్సులు నిలపకపోవడం వల్ల ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
     
    కనిపించని ట్రాఫిక్ గైడ్లు

    నగరంలోని అన్ని ప్రధాన బస్‌స్టాప్‌లలో గతంలో ఆర్టీసీ ట్రాఫిక్ గైడ్లను నియమించింది. ప్రతి బస్సు స్టాప్‌లోనే ఆగేవిధంగా ట్రాఫిక్ గైడ్లు నియంత్రించేవాళ్లు. కానీ ఆర్టీసీ ఈ వ్యవస్థను రద్దు చేసింది. దీంతో బస్సుల నియంత్రణలో ట్రాఫిక్ పోలీసులు సైతం దారుణంగా  విఫలమవుతున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement