సంగారెడ్డి క్రైం: ప్రజలపై కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే ఈ నెల 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరిపించి, జాతీయ జెండాను ఎగురవేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. గోల్కొండ కోటపై ఆ రోజు జెండాను ఎగురవేయాలన్నారు. ఈ విషయం ప్రకటించిన తర్వాతే మెదక్ ఉప ఎన్నికలో ఓట్ల కోసం ప్రజల వద్దకు రావాలని హితవు పలికారు.
సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లిలో బుధవారం బీజేపీ, టీడీపీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపకుంటే పాలనలో కొనసాగే నైతిక హక్కు కేసీఆర్‌కు లేదన్నారు. డబ్బు పంచి ఇతర పార్టీల నేతలను కొనుగోలు చేసి రాష్ట్రాన్ని భ్ర ష్టు పట్టిస్తున్నారని విమర్శించారు. వంద రోజుల తెలంగాణ లో అన్నీ కష్టాలే తప్ప బంగారు తెలంగాణ ఎక్కడా కనిపించడం లేదన్నారు.
తెలంగాణా వచ్చింది టీఆర్‌ఎస్‌తో కాదని జేఏసీ నేతల పోరాటం, కేంద్రంలో బీజేపీ బలపర్చడం వల్ల వచ్చిందన్నారు. రుణమాఫీపై ఇప్పటికీ స్పష్టత లేదన్నారు. కేంద్రం నుంచి అధిక నిధులు రావడానికి, మెతుకుసీమ అభివృద్ధికోసం జగ్గారెడ్డిని గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. టీడీపీ శాసన సభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ సింగపూర్‌లా వద్దని, రైతులకు 8 గంటల కరెంట్ ఇస్తే సరిపోతుందన్నారు. జిల్లా ప్రజల్ని మోసం చేసిన టీఆర్‌ఎస్‌ను మట్టికరిపించాలని పిలుపునిచ్చారు. నాగం జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌కు పట్టిన దయ్యాన్ని వదిలించేందుకు తాము ఊరూరా ప్రచారం చేస్తామని వెల్లడించారు.
ఎంపీ మల్లారెడ్డి మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబం ఆర్థికంగా లేదన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ మాట్లాడుతూ కేసీఆర్ వంద రోజుల పాలనలో రైతుల ఆత్మహత్యలే తప్ప చేసిన అభివృద్ధి ఏమాత్రం లేదని విమర్శించారు. మెదక్ లోక్‌సభ అభ్యర్థి జగ్గారెడ్డి మాట్లాడుతూ తాను ఎంపీగా గెలిపిన తర్వాత టీఆర్‌ఎస్‌తో బంతాట ఆడుకుంటానన్నారు. సమావేశంలో బీజేపీ నేతలు ఆచారి, చింతల సాంబమూర్తి, సత్యనారాయణ, కాసాల బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్.. చిత్తశుద్ధి చాటుకో
Published Wed, Sep 3 2014 11:37 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement