Kisanreddy
-
కేంద్ర బడ్జెట్-2021: కిషన్‌రెడ్డి స్పందన
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్-2021పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆలోచనలకు అనుగుణంగా 5 ట్రిలియన్ డాలర్ల భారీ ఆర్థిక వ్యవస్థను, ఆత్మనిర్భర్ భారత్‌ను నిర్మించే దిశగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ఆత్మనిర్భర భారత్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. సృజనాత్మకత, సామర్ధ్యం, నాయకత్వం, మానవ వనరులు, సమాచార సాంకేతిక పరిజ్ఞానం, ఆర్థిక వనరులు వంటి 6 అంశాల ఆధారంగా ఆరోగ్యం, సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ కొత్త బడ్జెట్‌ను ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నాను. ( బడ్జెట్ 2021: ధరలు పెరిగేవి.. తగ్గేవి!) కోవిడ్-19 మహమ్మారి నుంచి ప్రతి భారతీయుడిని కాపాడే లక్ష్యంతో, ఈ బడ్జెట్లో కోవిడ్ వాక్సిన్ కోసం 35,400 కోట్ల రూపాయలు కేటాయించి ప్రధాని మోదీ నాయకత్వంలోని తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యం ప్రజల ఆరోగ్యమేనని స్పష్టం చేశారు. ఈ బడ్జెట్లో కొత్తగా ప్రతిపాదించిన మెగా టెక్స్ టైల్ పార్క్ పథకం వల్ల ఉపాధి అవకాశాలు మెరుగుపడి, భారత్ వస్త్ర ఎగుమతుల కేంద్రంగా మారుతుంది. దీని కింద మూడు సంవత్సరాల కాలంలో 7 పార్కులు ఏర్పాటు చేయటం సంతోషకరం’’ అని అన్నారు. -
గోల్కొండపై జెండా ఎగరేద్దాం: బండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం ద్వారా బీజేపీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇక మాటలతో ప్రయోజనం లేదని, పోరాట కార్యాచరణను అమలు చేయాలని సూచించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటడం ఖాయమని, పార్టీ నేతల్లో ఒకరు ముఖ్యమంత్రి అవుతారన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కావాలన్న సంకల్పంతో ప్రతి ఒక్కరూ పని చేయాలని పిలుపునిచ్చారు. సికింద్రాబాద్‌లో అదివారం జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. అవినీతి సర్కారు నుంచి తెలంగాణకు విముక్తి కల్పించే సంకల్పంతో పని చేయాలని సూచించారు. ప్రజల్లో తమపట్ల ఆగ్రహం ఉందని, కేసీఆర్‌కు, టీఆర్ఎస్కూ తెలుసునని, మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తామని, అవినీతి పాలన తొలగిస్తామంటూ సంకల్పం తీసుకుని ప్రజల్లోకి వెళ్లాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రాక్షస పాలనను అంతం చేసి, గోల్కొండ కోటపై బీజేపీ జెండాను ఎగురవేద్దామని, అదే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ముందుకెళ్లాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ పిలుపునిచ్చారు. కార్యవర్గ సమావేశం సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన అధ్యక్షోపన్యాసం చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని, పోలీసులను అడ్డం పెట్టుకొని తమ పోరాటాన్ని ఆపాలని సీఎం ప్రయత్నం చేస్తున్నారని, అక్రమ కేసులతో బీజేపీని అడ్డుకోలేరని పేర్కొన్నారు. ఎన్ని నిర్బంధాలు ఎదురైనా కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని, కలిసికట్టుగా పనిచేయాలని, హిందువులను ఓటు బ్యాంకుగా మార్చాలని, తెలంగాణ తల్లిని కేసీఆర్ కబంధ హస్తాల నుంచి విముక్తి చేయాలని అన్నారు. 13,500 కంపెనీల్లో 3 లక్షల ఉద్యోగాలు వచ్చాయని ప్రభుత్వం చెబుతోందని, వాటిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అవి ఇచ్చినట్లయితే ముఖ్యమంత్రికి పూజ చేస్తానని, ఇవ్వకపోతే బడితే పూజ చేస్తామన్నారు. శాండ్, ల్యాండ్, గ్రానైట్.. తదితర అన్ని మాఫియాలకు ప్రగతిభవన్ అడ్డాగా మారిందని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటన 10 ప్రజా సమస్యలపై తీర్మానాలు 2023లో అధికారమే లక్ష్యం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 2023లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు సాగాలని రాష్ట్ర బీజేపీ నిర్ణయించింది. సికింద్రాబాద్‌లోని రాజరాజేశ్వరి గార్డెన్స్‌లో పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించింది. వివిధ అంశాలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై రాజకీయ తీర్మానంతోపాటు 10 ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహించాలని ఏకవాక్య తీర్మానం చేసింది. వాటిపై వారం రోజుల తరువాత తేదీల వారీగా కార్యాచరణను సిద్ధం చేసుకొని పోరాట కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. గొల్ల కుర్మల సమస్యలు, గిరిజనుల సమస్యలు, ఉద్యోగుల, ఉపాధ్యాయ, పెన్షనర్ల పీఆర్సీ కోసం వారి తరఫున పోరాటాలు చేపట్టాలని నిర్ణయించింది. నిరుద్యోగులు, నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు, నియామకాలపై ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కార్యాచరణ అమలు చేయాలని, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుకు పోరాటం చేయాలని నిర్ణయించింది. మరోవైపు ఈనెల 18న జిల్లా కార్యవర్గ సమావేశాలు, 19న మండల కార్యవర్గ సమావేశాలు నిర్వహించాలని, జనవరి 20 నుంచి ఫిబ్రవరి 10 వరకు అయోధ్య రామాలయ నిర్మాణ నిధి సేకరణలో పోలింగ్ బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొనాలని పిలుపునిచ్చింది. -
అభివృద్ధి కోసం అన్నదమ్ముల్లా..
సాక్షి, హైదరాబాద్/సుందరయ్య విజ్ఞాన కేంద్రం: ‘గెలుపు కోసం ఎన్నికల ముందు కొట్లాడుదాం.. తర్వాత అభివృద్ధి కోసం అన్నదమ్ముల్లా కలిసి పనిచేద్దాం’అని మున్సిపల్, ఐటీ మంత్రి కె.తారకరామారావు అన్నారు. ప్రతిపక్షాలను.. ముఖ్యంగా బీజేపీని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. సమన్వయంతో పనిచేద్దామని పిలుపునిచ్చారు. కొత్తగా ఎన్నికైన స్థానిక బీజేపీ కార్పొరేటర్‌కు ఆహ్వానం అందలేదని, ప్రొటోకాల్ పాటించడం లేదని ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో బీజేపీ–టీఆర్ఎస్ వర్గాల మధ్య జరిగిన గొడవను దృష్టిలో ఉంచుకొని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. శనివారం హైదరాబాద్‌లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కేటీఆర్.. బాగ్‌లింగంపల్లి లంబాడితండాలో 126 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో కలసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. దేశంలోని ఏ రాష్ట్రంలో జరగనంత గొప్పగా రూ.18వేల కోట్లతో 2.72 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు శ్రీకారం చుట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో నిర్మిస్తున్న లక్ష ఇళ్లకు రూ.9,714 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. పేదవాడు ఆత్మగౌరవంతో బతికేందుకు సకల సౌకర్యాలతో ఫ్లాట్లు కట్టి అప్పజెప్పుతున్నామన్నారు. అమ్ముకున్నా, కిరాయికిచ్చినా చర్యలు.. మార్కెట్లో దాదాపు రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల డిమాండ్ ఉన్న ఈ ఇళ్లను అమ్మినా, అద్దెకిచ్చినా పట్టా రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని హెచ్చరించారు. ఒక్కో ఇంటికి రూ.9 లక్షలు ఖర్చుచేసి ఇస్తున్నది మీ పిల్లలతో బాగా బతికేందుకేనని అన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో చాలా మంది పేదలున్నారని, వారందరికీ ఇళ్లు ఇవ్వాలన్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విజ్ఞప్తికి స్పందిస్తూ.. ఆ మేరకు చర్యలు చేపడతామన్నారు. కంటోన్మెంట్ డిఫెన్స్ భూముల్లో గుడిసెలు వేసుకున్న పేదలకు పట్టాలిప్పించేందుకు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టేందుకు స్థలం ఇప్పించాలని కేంద్రమంత్రిని కోరారు. కలసి పనిచేస్తేనే హర్షిస్తారు.. కేంద్రం, రాష్ట్రం కలసిమెలసి ఉంటేనే ఓట్లేసిన ప్రజలు హర్షిస్తారని కేటీఆర్ అన్నారు. పరస్పరం గౌరవించుకుందామని.. హుందాగా రాజకీయాల్లో కొనసాగుదామని చెప్పారు. ప్రస్తుతం కొనసాగుతున్న కార్పొరేటర్ శ్రీనివాసరెడ్డి (టీఆర్ఎస్) ఫిబ్రవరి 10 దాకా ఉంటారు. తర్వాత రవిచారి(బీజేపీ) ఐదేళ్లు ఉంటారని చెప్పారు. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ అనేక రంగాల్లో ఇంకా ఎంతో అభివృద్ధి చెందాల్సి ఉందన్నారు. ప్రారంభోత్సవాలు.. శంకుస్థాపనలు.. ముషీరాబాద్ నియోజకవర్గంలోని బాగ్‌లింగంపల్లి లంబాడి తండాలో రూ.10.90 కోట్ల వ్యయంతో నిర్మించిన 126 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు.. రూ. 3.50 కోట్లతో అడిక్‌మెట్‌లో నిర్మించిన మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లకు ప్రారంభోత్సవాలు.. దోమల్‌గూడలో రూ.9.90 కోట్లతో నిర్మించనున్న జోనల్, డిప్యూటి కమిషనర్ కార్యాలయాలు.. నారాయణగూడ క్రాస్‌రోడ్స్‌లో రూ.4 కోట్లతో నిర్మించనున్న మోడల్ మార్కెట్ నిర్మాణానికి కేటీఆర్ శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియొద్దీన్ తదితరులు పాల్గొన్నారు. నన్ను ఆహ్వానించరా?... జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్పై కిషన్‌రెడ్డి ఫైర్ హిమాయత్‌నగర్: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.. జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్పై మండిపడ్డారు. మంత్రి కేటీఆర్ సర్ధిచెబుతున్నా.. అభివృద్ధి కార్యక్రమాలకు నన్ను పిలవరా అంటూ అసహనం వ్యక్తం చేశారు. శనివారం నారాయణగూడ వెజిటేబుల్ మార్కెట్ శంకుస్థాపన కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కిషన్‌రెడ్డి: ‘ఏం కేటీఆర్‌గారూ.. అభివృద్ధి కార్యక్రమాలకు ప్రొటోకాల్ పాటించరా? కేటీఆర్: ఏమైందన్నా? కిషన్‌రెడ్డి: ఏ కార్యక్రమానికి నన్ను పిలవట్లేదు. ప్రోటోకాల్ పాటించాలి కదా. కేటీఆర్: కచ్చితంగా పిలవాలన్నా. ఇంటిమేషన్ ఇవ్వలేదా? కిషన్‌రెడ్డి: ఎవరిచ్చారు? అడగండి.. కేటీఆర్: (దూరంగా నిలబడ్డ కమిషనర్ లోకేశ్కుమార్ని పిలిచి) కిషన్‌రెడ్డి గారికి ఇంటిమేషన్ ఇవ్వలేదా? లోకేశ్‌కుమార్: ఇచ్చాం సార్, ముందురోజే చెప్పాం. కిషన్‌రెడ్డి: తమాషాలు చేస్తున్నారా? చెప్పకుండా చెప్పామంటున్నారు? కేటీఆర్: అన్నా.. పోనీ.. ఇప్పుడొద్దు. నేను మాట్లాడతా. కిషన్‌రెడ్డి: అదికాదు.. చెప్పాలి కదా? నాకు అధికారం లేదా? కాగా, దీనిపై లోకేశ్‌కుమార్ డీఎంసీలను అడగ్గా.. ‘సార్, మేం కిషన్‌రెడ్డి గారికి ముందే చెప్పాం. నాకు కమిషనర్ చెబితేనే వస్తా, మీరు చెబితే నేనెందుకు వస్తానని ఆయన అన్నారు. ఏం చేయమంటారు’అని బదులిచ్చారు. -
గ్రేటర్ ఎన్నికలు: స్టార్ క్యాంపెయినర్లు రంగంలోకి..
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ పీఠాన్ని దక్కించుకునేందుకు అధికార, ప్రధాన ప్రతిపక్ష పాలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. అభ్యర్థుల ప్రకటన, నామినేషన్ల ఘట్టం ఇప్పటికే ముగిసింది. ఎన్నికల గడువు కూడా దగ్గరపడుతోంది. ప్రచారానికి పెద్దగా సమయం కూడా లేదు. దీంతో అధికార టీఆర్ఎస్ సహా బీజేపీ, కాంగ్రెస్ ఇతర పార్టీల అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. స్టార్ క్యాంపెయిర్లను రంగంలోకి దింపి హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. రోడ్‌షోలు, సభలు, సమావేశాలతో హోరెత్తిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఒకవైపు ప్రత్యక్షంగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహిస్తూనే స్మార్ట్ఫోన్లు వాడే యువత, ఉద్యోగులు, వ్యాపారులను ఆకర్షించేందుకు సోషల్ మీడియా వేదికగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పోటాపోటీగా ప్రెస్మీట్లు ఏర్పాటు చేస్తూ నేతలు ఇచ్చే హామీలు, మాటల తూటాలను పోస్టులు చేస్తున్నారు. టీఆర్ఎస్లో కేటీఆర్ ప్రచారం ముమ్మరం అధికార టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే డివిజన్ల వారీగా రోడ్ షోలు నిర్వహిస్తోంది. మంత్రి కేటీఆర్ ప్రచారంలో ప్రధాన స్టార్‌గా దూసుకుపోతున్నారు. మూడు రోజుల నుంచి రోజుకు కనీసం పది పదిహేను డివిజన్లకు తగ్గకుండా రోడ్‌షోలతో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు ఒక్కో డివిజన్‌కు మంత్రులు ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలు ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ ఇలా.. గ్రేటర్లో పట్టు నిలుపుకొనేందుకు కాంగ్రెస్ శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది. అభ్యర్థుల గెలుపు కోసం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపీ రేవంత్‌రెడ్డి సహా పలువురు నేతలు రంగంలోకి దిగారు. అభ్యర్థులతో కలిసి ప్రచారం నిర్వహిస్తున్నారు. అధికార టీఆర్ఎస్, బీజేపీలను ఎండగడుతున్నారు. అసమ్మతి నేతలను బుజ్జగించడం, కార్యకర్తలు చేజారకుండా కాపాడుకోవడం వీరికి తలకుమించిన భారంగా మారింది. ఎంఐఎం అలా.. ఇక ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆ పార్టీ అభ్యర్థుల తరపున పాతబస్తీలో ప్రచారం చేస్తున్నారు. ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా డోర్ టు డోర్ వెళ్లి ఓటర్లను పలకరిస్తున్నారు. ఆ మాస్కులకు డిమాండ్ కరోనా నేపథ్యంలో అభ్యర్థులు తమ పార్టీ గుర్తులతో ఉన్న మాస్క్‌లను తయారు చేయిస్తున్నారు. మాస్క్‌లపై పార్టీ గుర్తు, అభ్యర్థి ఫొటో ఉండేలా చూసుకుంటున్నారు. ఈ తరహా ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోంది. వీటితో పాటు టోపీలు, కండువాలు, బ్యానర్లు, ప్లకార్డులు, తోరణాలు ఏర్పాటు చేస్తున్నారు. డిజిటల్ జెండాలపై అభ్యర్థి ఫొటో, పార్టీ గుర్తు ఉండేలా చూస్తున్నారు. జాతీయ, రాష్ట్రస్థాయి నేతలతో బీజేపీ.. అధికార పార్టీ దూకుడుకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రతిపక్ష బీజేపీ కూడా ప్రచారం నిర్వహిస్తోంది. జాతీయ, రాష్ట్రస్థాయి నాయకులతో సభలు, సమావేశాలు ఏర్పాటు చేస్తోంది. నగరంలోని ఉత్తరాది రాష్ట్రాల ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆయా రాష్ట్రాల నుంచి ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్, ఐటీ విభాగం కార్యకర్తలను నగరానికి రప్పించింది. డివిజన్‌కు కనీసం పది మంది సభ్యులకు తగ్గకుండా ప్రచారం నిర్వహిస్తోంది. ఎన్నికల ఇన్చార్జి భూపేందర్ యాదవ్ సహా బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్య, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అర్వింద్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ సహా పలువురు నేతలు పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు. ఒకవైపు అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తూనే మరో వైపు సంస్థాగతంగా పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నారు. మైకుల మోత జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో మైకుల మోత మోగుతోంది. సోమవారం నుంచి ఇది పతాక స్థాయికి చేరింది. వివిధ పారీ్టల బ్యానర్లు, జెండాల రెపరెపలతో సిటీలో ఎటుచూసినా ఎన్నికల జోష్ నెలకొంది. ప్రచార సామగ్రి తయారీ జోరందుకుంది. పర్యావరణ క్లాత్‌తో.. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణను బాధ్యతగా భావించి రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ప్రచారంలో ప్లాస్టిక్, పాలిథిన్‌తో తయారైన పోస్టర్లు, బ్యానర్లను వాడుతున్నారు. ఆయా సంస్థల నిర్వాహకులు ప్రచార సామగ్రిని అభ్యర్థుల డిమాండ్ మేరకు ప్రింటింగ్ చేసి అందిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు డోర్ టు డోర్ తిరిగి ఓటర్లను కలిసి తమకే ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ప్రచార రథాలు, డప్పు దరువులు, తెలంగాణ ఆటాపాటలతో ప్రచారం చేస్తున్నారు. సాయంత్రం కుల సంఘాలు, కాలనీ, అపార్ట్మెంట్, గేటేడ్ కమ్యూనిటీల అసోసియేషన్ సభ్యులతో సమావేశమవుతున్నారు. తాజాగా యువనేత కేటీఆర్ నగరంలోని క్రిస్టియన్స్ అసోసియేషన్లను కలుస్తున్నారు. -
‘హైదరాబాద్ నగరాన్ని గాలికొదిలేశారు’
సాక్షి, రంగారెడ్డి: కరోనా విషయంలో హైదరాబాద్ ప్రజలను టీఆర్ఎస్ ప్రభుత్వం గాలికొదిలేసిందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి గంగాపురం కిషన్‌రెడ్డి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వంపై నిందలు మోపుతూ చేతులు దులుపుకుంటోందని మండిపడ్డారు. బీజేపీ ఆధ్వర్యంలో శనివారం పూర్వ రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ జిల్లాల జన్‌సంవాద్ (వర్చువల్ ర్యాలీ) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ర్యాలీని ఉద్దేశించి మంత్రి కిషన్‌రెడ్డి ప్రసంగించారు. కరోనా టెస్టుల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోందని ప్రశ్నించారు. ఇప్పటికైనా యుద్ధప్రాతిపదికన అందరికీ పరీక్షలు నిర్వహించి ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ఒవైసీ, కల్వకుంట్ల కుటుంబాల చేతిలో తెలంగాణ బందీ అయిందని విమర్శించారు. ఈ రెండు కుటుంబాల నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే ప్రజలకు ఇబ్బంది రాకుండా నరేంద్ర మోదీ పాలన సాగుతోందన్నారు. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాల నిర్మూలన కోసం చట్టాన్ని తీసుకొచ్చిన ఘనత మోదీకే దక్కుతోందన్నారు. మోదీ నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, విజయాలను వివరించేందుకే వర్చువల్ ర్యాలీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఫార్మా కంపెనీలతో మోసం రంగారెడ్డి జిల్లాలో ఫార్మాసిటీ ఏర్పాటు పేరుతో రైతుల భూములను రాష్ట్ర ప్రభుత్వం లాక్కుంటోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. కేసీఆర్ కుటుంబం భూముల విలువ పెంచుకునేందుకే ఫార్మాకంపెనీలు అంటూ మోసం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుతో తెలంగాణలో 7,200 ఫ్యాక్టరీలు మూతపడ్డాయని, వీటిపై ఆధారపడిన లక్షల మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారని అన్నారు. రాష్ట్రంలోరూ. 13వేల కోట్ల విలువైన భూములను సీఎం కేసీఆర్ కుటుంబం స్వాహా చేసిందని దుయ్యబట్టారు. హెచ్ఎండీఏలో పర్మిషన్ల పంచాయతీ నడుస్తోందని, చేతులు తడిపిన వారికే అనుమతులు జారీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎంఐఎంకు టీఆర్ఎస్ పార్టీ కొమ్ముకాస్తోందన్నారు. ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్న తెలంగాణను కేసీఆర్ అప్పులపాలు చేశారని విమర్శలు చేశారు. సరైన వైద్యం అందకపోవడం వల్లే జర్నలిస్టు మనోజ్, శ్రీకాంత్ మృతిచెందారని చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, నాయకులు నల్లు ఇంద్రసేనారెడ్డి, మాజీ ఎంపీ చాడా సురేష్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తీగ సాయంతో టమాట సాగు
తీగల సాయంతో టమాట సాగు చేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని జలాల్పూర్ గ్రామానికి చెందిన రైతు కిషన్‌రెడ్డి పేర్కొంటున్నారు. ఈ పద్ధతిలో సాగు చేయడం వల్ల చీడపీడల బాధ తగ్గుతుందని, పంట వృథా కాదని చెబుతున్నారు. టమాట సాగు గురించి ఆయన మాటల్లోనే.. బాల్కొండ : ‘‘జూన్ మొదటి వారంలో టమాట నా రు పోశాను. తర్వాత అర ఎకరం భూమిలో బో యలు ఏర్పాటు చేశాను. బోయలపై అక్కడక్క డ ఐదు ఫీట్ల ఎత్తు ఉండేలా వెదురు కర్రలను పాతాను. నెల రోజుల తర్వాత బోయలలో మొ క్కలను నాటాను. వెదురు కర్రలకు ఒక కర్ర నుంచి మరో కర్రకు ఫీటు ఎత్తులో స్టీల్ వైరును చుట్టాను. టమాట మొక్క ఫీటు ఎత్తు పెరిగిన తర్వాత దారాలతో తీగకు కట్టాను. మళ్లీ వెదు రు కర్రకు రెండు ఫీట్ల ఎత్తులో వైరు చుట్టాను. మొక్క రెండు ఫీట్ల ఎత్తు పెరగ్గానే దానిని దారాలతో మళ్లీ తీగకు కట్టాను. ఇలా మొక్క నేలపై పడిపోకుంగా జాగ్రత్తలు తీసుకున్నాను. మూ డు, నాలుగు ఫీట్ల ఎత్తులోనూ ఇలాగే చేశాను. దీంతో టమాట తీగలపైనే పారుతోంది. ఈ పం ట మూడో నెలనుంచి చేతి కి వస్తుంది. ప్రస్తు తం కాత దశలో ఉంది. ఆరు నెలల వరకు ట మాట కాస్తూనే ఉంటుంది’’ అని కిషన్‌రెడ్డి వివరించారు. టమాట సైజు కూడా పెద్దగా ఉందని, మంచి లాభాలు వస్తాయని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. ఖర్చు ఎక్కువే అయినా.. ఈ విధానంలో పెట్టుబడి ఖర్చు ఎక్కువ అవుతుందని రైతు తెలిపారు. వెదురు కర్రలు, స్టీల్ వైరు, దారాలకు సుమారు రూ. 15 వేల వరకు ఖర్చయ్యాయని పేర్కొన్నారు. అయితే సాధార ణ పద్ధతుల్లో సాగు చేసిన టమాట కంటే తీగ ప ద్ధతిలో సాగు చేసిన పంటకు చీడపీడల బాధ తక్కువన్నారు. దిగుబడి కూడా ఎక్కువ వస్తుందని వ్యవసాయ అధికారులు తెలిపారని పేర్కొన్నారు. సాధారణ పద్ధతుల్లో పంట సాగు చేస్తే వర్షాలు కురిసినప్పుడు టమాటలు కుళ్లిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయని, ఈ పద్ధతిలో ఆ బాధ ఉండదని వివరించారు. సాధారణ పద్ధతిలో టమాట నేలకు ఆనుతుందని, దీంతో కాయలపై మచ్చలు ఏర్పడతాయని, కాయల సైజు కూడా తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. తీగ పద్ధతిలో ఆ సమస్యలు లేవన్నారు. ఈ పద్ధతిలో మదనపల్లెకు చెందిన రైతులు టమాట సాగు చేస్తారని, వారిని స్ఫూర్తిగా తీసుకున్నానని రైతు తెలిపారు. ప్రస్తుతం 25 కిలోల టమాట పెట్టె రూ. 350 పలుకుతోందని, ధర ఇలాగే ఉంటే లక్ష రూపాయల వరకు రాబడి వస్తుందని ఆశిస్తున్నానని వివరించారు. -
కేసీఆర్.. చిత్తశుద్ధి చాటుకో
సంగారెడ్డి క్రైం: ప్రజలపై కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే ఈ నెల 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరిపించి, జాతీయ జెండాను ఎగురవేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. గోల్కొండ కోటపై ఆ రోజు జెండాను ఎగురవేయాలన్నారు. ఈ విషయం ప్రకటించిన తర్వాతే మెదక్ ఉప ఎన్నికలో ఓట్ల కోసం ప్రజల వద్దకు రావాలని హితవు పలికారు. సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లిలో బుధవారం బీజేపీ, టీడీపీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపకుంటే పాలనలో కొనసాగే నైతిక హక్కు కేసీఆర్‌కు లేదన్నారు. డబ్బు పంచి ఇతర పార్టీల నేతలను కొనుగోలు చేసి రాష్ట్రాన్ని భ్ర ష్టు పట్టిస్తున్నారని విమర్శించారు. వంద రోజుల తెలంగాణ లో అన్నీ కష్టాలే తప్ప బంగారు తెలంగాణ ఎక్కడా కనిపించడం లేదన్నారు. తెలంగాణా వచ్చింది టీఆర్ఎస్తో కాదని జేఏసీ నేతల పోరాటం, కేంద్రంలో బీజేపీ బలపర్చడం వల్ల వచ్చిందన్నారు. రుణమాఫీపై ఇప్పటికీ స్పష్టత లేదన్నారు. కేంద్రం నుంచి అధిక నిధులు రావడానికి, మెతుకుసీమ అభివృద్ధికోసం జగ్గారెడ్డిని గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. టీడీపీ శాసన సభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ సింగపూర్‌లా వద్దని, రైతులకు 8 గంటల కరెంట్ ఇస్తే సరిపోతుందన్నారు. జిల్లా ప్రజల్ని మోసం చేసిన టీఆర్ఎస్ను మట్టికరిపించాలని పిలుపునిచ్చారు. నాగం జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్కు పట్టిన దయ్యాన్ని వదిలించేందుకు తాము ఊరూరా ప్రచారం చేస్తామని వెల్లడించారు. ఎంపీ మల్లారెడ్డి మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబం ఆర్థికంగా లేదన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ మాట్లాడుతూ కేసీఆర్ వంద రోజుల పాలనలో రైతుల ఆత్మహత్యలే తప్ప చేసిన అభివృద్ధి ఏమాత్రం లేదని విమర్శించారు. మెదక్ లోక్‌సభ అభ్యర్థి జగ్గారెడ్డి మాట్లాడుతూ తాను ఎంపీగా గెలిపిన తర్వాత టీఆర్ఎస్తో బంతాట ఆడుకుంటానన్నారు. సమావేశంలో బీజేపీ నేతలు ఆచారి, చింతల సాంబమూర్తి, సత్యనారాయణ, కాసాల బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.