సాక్షి, రంగారెడ్డి: కరోనా విషయంలో హైదరాబాద్ ప్రజలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం గాలికొదిలేసిందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి గంగాపురం కిషన్‌రెడ్డి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వంపై నిందలు మోపుతూ చేతులు దులుపుకుంటోందని మండిపడ్డారు. బీజేపీ ఆధ్వర్యంలో శనివారం పూర్వ రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ జిల్లాల జన్‌సంవాద్ (వర్చువల్ ర్యాలీ) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ర్యాలీని ఉద్దేశించి మంత్రి కిషన్‌రెడ్డి ప్రసంగించారు. కరోనా టెస్టుల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోందని ప్రశ్నించారు. ఇప్పటికైనా యుద్ధప్రాతిపదికన అందరికీ పరీక్షలు నిర్వహించి ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు.
ఒవైసీ, కల్వకుంట్ల కుటుంబాల చేతిలో తెలంగాణ బందీ అయిందని విమర్శించారు. ఈ రెండు కుటుంబాల నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే ప్రజలకు ఇబ్బంది రాకుండా నరేంద్ర మోదీ పాలన సాగుతోందన్నారు. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాల నిర్మూలన కోసం చట్టాన్ని తీసుకొచ్చిన ఘనత మోదీకే దక్కుతోందన్నారు. మోదీ నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, విజయాలను వివరించేందుకే వర్చువల్ ర్యాలీలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఫార్మా కంపెనీలతో మోసం
రంగారెడ్డి జిల్లాలో ఫార్మాసిటీ ఏర్పాటు పేరుతో రైతుల భూములను రాష్ట్ర ప్రభుత్వం లాక్కుంటోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. కేసీఆర్ కుటుంబం భూముల విలువ పెంచుకునేందుకే ఫార్మాకంపెనీలు అంటూ మోసం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుతో తెలంగాణలో 7,200 ఫ్యాక్టరీలు మూతపడ్డాయని, వీటిపై ఆధారపడిన లక్షల మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారని అన్నారు. రాష్ట్రంలోరూ. 13వేల కోట్ల విలువైన భూములను సీఎం కేసీఆర్ కుటుంబం స్వాహా చేసిందని దుయ్యబట్టారు.
హెచ్‌ఎండీఏలో పర్మిషన్ల పంచాయతీ నడుస్తోందని, చేతులు తడిపిన వారికే అనుమతులు జారీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎంఐఎంకు టీఆర్‌ఎస్ పార్టీ కొమ్ముకాస్తోందన్నారు. ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్న తెలంగాణను కేసీఆర్ అప్పులపాలు చేశారని విమర్శలు చేశారు. సరైన వైద్యం అందకపోవడం వల్లే జర్నలిస్టు మనోజ్, శ్రీకాంత్ మృతిచెందారని చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, నాయకులు నల్లు ఇంద్రసేనారెడ్డి, మాజీ ఎంపీ చాడా సురేష్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment