ఆదివారం సికింద్రాబాద్‌లో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతున్న బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం ద్వారా బీజేపీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ చుగ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇక మాటలతో ప్రయోజనం లేదని, పోరాట కార్యాచరణను అమలు చేయాలని సూచించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటడం ఖాయమని, పార్టీ నేతల్లో ఒకరు ముఖ్యమంత్రి అవుతారన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కావాలన్న సంకల్పంతో ప్రతి ఒక్కరూ పని చేయాలని పిలుపునిచ్చారు. సికింద్రాబాద్‌లో అదివారం జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. అవినీతి సర్కారు నుంచి తెలంగాణకు విముక్తి కల్పించే సంకల్పంతో పని చేయాలని సూచించారు. ప్రజల్లో తమపట్ల ఆగ్రహం ఉందని, కేసీఆర్‌కు, టీఆర్‌ఎస్‌కూ తెలుసునని, మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తామని, అవినీతి పాలన తొలగిస్తామంటూ సంకల్పం తీసుకుని ప్రజల్లోకి వెళ్లాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో రాక్షస పాలనను అంతం చేసి, గోల్కొండ కోటపై బీజేపీ జెండాను ఎగురవేద్దామని, అదే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ముందుకెళ్లాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ పిలుపునిచ్చారు. కార్యవర్గ సమావేశం సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన అధ్యక్షోపన్యాసం చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని, పోలీసులను అడ్డం పెట్టుకొని తమ పోరాటాన్ని ఆపాలని సీఎం ప్రయత్నం చేస్తున్నారని, అక్రమ కేసులతో బీజేపీని అడ్డుకోలేరని పేర్కొన్నారు. ఎన్ని నిర్బంధాలు ఎదురైనా కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని, కలిసికట్టుగా పనిచేయాలని, హిందువులను ఓటు బ్యాంకుగా మార్చాలని, తెలంగాణ తల్లిని కేసీఆర్ కబంధ హస్తాల నుంచి విముక్తి చేయాలని అన్నారు. 13,500 కంపెనీల్లో 3 లక్షల ఉద్యోగాలు వచ్చాయని ప్రభుత్వం చెబుతోందని, వాటిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అవి ఇచ్చినట్లయితే ముఖ్యమంత్రికి పూజ చేస్తానని, ఇవ్వకపోతే బడితే పూజ చేస్తామన్నారు. శాండ్, ల్యాండ్, గ్రానైట్.. తదితర అన్ని మాఫియాలకు ప్రగతిభవన్ అడ్డాగా మారిందని విమర్శించారు.
- బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటన
- 10 ప్రజా సమస్యలపై తీర్మానాలు
- 2023లో అధికారమే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 2023లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు సాగాలని రాష్ట్ర బీజేపీ నిర్ణయించింది. సికింద్రాబాద్‌లోని రాజరాజేశ్వరి గార్డెన్స్‌లో పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించింది. వివిధ అంశాలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై రాజకీయ తీర్మానంతోపాటు 10 ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహించాలని ఏకవాక్య తీర్మానం చేసింది. వాటిపై వారం రోజుల తరువాత తేదీల వారీగా కార్యాచరణను సిద్ధం చేసుకొని పోరాట కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. గొల్ల కుర్మల సమస్యలు, గిరిజనుల సమస్యలు, ఉద్యోగుల, ఉపాధ్యాయ, పెన్షనర్ల పీఆర్‌సీ కోసం వారి తరఫున పోరాటాలు చేపట్టాలని నిర్ణయించింది. నిరుద్యోగులు, నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు, నియామకాలపై ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కార్యాచరణ అమలు చేయాలని, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుకు పోరాటం చేయాలని నిర్ణయించింది. మరోవైపు ఈనెల 18న జిల్లా కార్యవర్గ సమావేశాలు, 19న మండల కార్యవర్గ సమావేశాలు నిర్వహించాలని, జనవరి 20 నుంచి ఫిబ్రవరి 10 వరకు అయోధ్య రామాలయ నిర్మాణ నిధి సేకరణలో పోలింగ్ బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొనాలని పిలుపునిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment