కడసారి చూపు కోసం తల్లిదండ్రుల నిరీక్షణ | Show i hope for the parents | Sakshi
Sakshi News home page

కడసారి చూపు కోసం తల్లిదండ్రుల నిరీక్షణ

Published Thu, Oct 29 2015 1:28 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

కడసారి చూపు కోసం తల్లిదండ్రుల నిరీక్షణ - Sakshi

కడసారి చూపు కోసం తల్లిదండ్రుల నిరీక్షణ

ఆస్ట్రేలియాలో మృతిచెందిన శ్రీవాత్సంక
నేడు సిడ్నీ నుంచి మృతదేహం రాక
30న హన్మకొండలో అంత్యక్రియలు

 
కేయూక్యాంపస్ : ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఈనెల 23వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన హన్మకొండకు చెందిన నల్లాని చక్రవర్తుల శ్రీవాత్సంక మృతదేహం గురువారం సిడ్నీ నుంచి విమానంలో హైదరాబాద్‌కు తీసుకవచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ డిగ్రీ కళాశాలల లెక్చరర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, హన్మకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కామర్స్ లెక్చరర్ డాక్టర్ ఎన్‌వీఎన్ చారీ కుమారుడైన శ్రీవాత్సంక రెండేళ్ల క్రితం ఆస్ట్రేలియా దేశంలోని సిడ్నీకి వెళ్లాడు. అక్కడ యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ సిడ్నీలో ఎంఎస్(ఎంటెక్) మెకానికల్ ఇంజినీరింగ్‌లో ప్రవేశంపొంది రెండు నెలల క్రితమే ఆ కోర్సును పూర్తి చేశాడు.

పార్ట్ టైం జాబ్ చేస్తున్న ఆయన ఈనెల 23న సిడ్నీ నుంచి పూజ కోసం ఓ గ్రామానికి స్నేహితుడితో కారులో వెళ్తూ చెట్టుకు డీకొన్న సంఘటనలో మృతిచెందిన విషయం విధితమే. ఉన్నత విద్య కోసం వెళ్లిన తన కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం తల్లిదండ్రులకు కడపుకోత మిగిల్చింది. కడసారి చూపు కోసం తల్లిదండ్రులు ప్రస్తుతం హైదరాబాద్‌లో నిరీక్షిస్తున్నారు. సిడ్నీలో శ్రీవాత్సంక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి ఇక్కడికి తరలించేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని సమాచారం. ఈనెల 29న ఉదయం 10 గంటలకు సిడ్నీ నుంచి విమానంలో శ్రీవాత్సంక మృతదేహం హైదరాబాద్‌కు రానుంది. అదేరోజు అర్ధరాత్రి వరకు హైదరాబాద్‌కు చేరుకుంటుంది. అక్కడి నుంచి ఈనెల 30వ తేదీ ఉదయం ఆరు గంటలకు హన్మకొండలోని తమ స్వగృహానికి మృతదేహాన్ని తీసుకరానున్నారు. ఉదయం 11 గంటలకు అంత్యక్రియలు జరుపుతామని డాక్టర్ ఎన్‌వీఎన్ చారీ బుధవారం వెల్లడించారు.
 
ఎంఎస్ కోసం ఆస్ట్రేలియా వెళ్లిన శ్రీవాత్సంక
హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీ రెండోగేట్ సమీపంలో నివాసం ఉండే డాక్టర్ ఎన్‌వీఎన్ చారీ కుమారుడు ఎన్‌సీహెచ్ శ్రీవాత్సంక విద్యార్థి దశ నుంచి చదువులో ప్రతిభ కనపర్చేవాడు. హన్మకొండలోని వరంగల్ పబ్లిక్ స్కూల్‌లో ఒకటి నుంచి ఏడో తరగతి వరకు, 8, 9 తరగతులు రామన్ స్కూల్‌లో, పదో తరగతి  తేజస్వినీ హైస్కూల్ విద్యను పూరి ్తచేశాడు. హైదరాబాద్‌లో శ్రీ చైతన్యలో ఇంటర్ ఎంపీసీ, కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కిట్స్ కళాశాలలో 2013లో బీటెక్ మెకానికల్ ఇంజినీరింగ్ కోర్సు పూర్తి చేశాడు. ఆ తరువాత రెండేళ్ల క్రితం ఆస్ట్రేలియాలో ఇంజినీరింగ్‌లో ఎంఎస్ కోర్సు చదివేందుకు వెళ్లి ఆ కోర్సును కూడా రెండు నెలల క్రితం పూర్తిచేశాడు. మరో వైపు పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. ఎంబీఏ డిప్లోమా కోర్సును కూడా చేసేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. శ్రీవాత్సంక ఒకటి రెండు షార్ట్ ఫిలిమ్స్ కూడా తీశాడు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement