ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి భార్య సంచలన వ్యాఖ్యలు
యాదాద్రి: తన భర్త మృతి కేసును సరిగా దర్యాప్తు చేయడం లేదని ఎస్‌ఐ పిన్నింటి ప్రభాకర్‌రెడ్డి భార్య రచన సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. శిరీష మృతికి సంబంధించిన విషయాలు ఎలా రాబడుతున్నారో అదేవిధంగా తన భర్త మృతికి సంబంధించిన అంశాలు కూడా రాబట్టాలని డిమాండ్ చేశారు. ఒక సాధారణ వ్యక్తికి ఇచ్చే ప్రాధాన్యత కూడా సబ్ ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారి చనిపోతే ఇవ్వడం లేదని వాపోయారు. తన భర్తది ఆత్మహత్య అని, సర్వీసు తక్కువగా ఉంది కాబట్టి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనాలు అందవని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై డీఐజీని కలుస్తానని రచన చెప్పారు.
కాగా, బ్యుటీషియన్ శిరీషపై అత్యాచారయత్నం బెడిసికొట్టడంతో ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారని తమ దర్యాప్తులో తేలినట్టు పోలీసులు చెబుతున్నారు. అయితే ఇదంతా కట్టుకథ అని రచన అంతకుముందు కొట్టిపారేశారు. మామూళ్లు ఇవ్వనందుకే తన భర్తను టార్గెట్ చేసి, హత్య చేసి, ఇప్పుడు వివాహేతర సంబంధం అంటగట్టి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు.