డ్రైవింగ్‌ నేర్చుకునేవారికి సిమ్యులేటర్‌ శిక్షణ | Simulation Training In Khairatabad RTA Office | Sakshi
Sakshi News home page

ముందస్తు శిక్షణ..

Published Tue, Sep 25 2018 8:26 AM | Last Updated on Mon, Oct 1 2018 1:58 PM

Simulation Training In Khairatabad RTA Office - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: డ్రైవింగ్‌ నేర్చుకోవాలనుకుంటున్నారా... అయితే  మొదట  సిమ్యులేటర్స్‌పైన తప్పనిసరిగా శిక్షణ పొందాల్సిందే. రోడ్డుపై వాహనాన్ని నడిపేందుకు ముందు సిమ్యులేటర్‌ ద్వారా డ్రైవింగ్‌ మెళకువలను తెలుసుకోవాల్సిందే. ఇందుకోసం రవాణాశాఖ స్వయంగా సిమ్యులేటర్‌ శిక్షణకు శ్రీకారం చుట్టింది. లెర్నింగ్‌ లైసె న్సు పరీక్షలకు హాజరయ్యే  అభ్యర్థులను సిమ్యులేటర్‌  శిక్షణకు ప్రోత్సహించేందుకు  ఖైరతాబాద్‌లోని రవాణా శాఖ ప్రధాన కార్యాలయంలో    సిమ్యులేటర్‌లను ఏర్పాటు చేశారు. మరో వారం  రోజుల్లో దీనిని  వినియోగదారులకు అందుబాటులోకి తేనున్నట్లు సంయుక్త  రవాణా కమిషనర్‌ రమేష్‌  తెలిపారు. అనంతరం దశల వారీగా అన్ని ఆర్టీఏ  కార్యాలయాలకు విస్తరించాలని భావిస్తున్నామన్నారు. మరోవైపు నామమాత్రపు శిక్షణ ఇస్తూ  వినియోగదారుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తున్న డ్రైవింగ్‌ స్కూళ్లకు అడ్డుకట్టవేయడంపై రవాణాశాఖ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ప్రతి డ్రైవింగ్‌ స్కూల్లో సిమ్యులేటర్‌ శిక్షణ తప్పనిసరి చేయనున్నారు. తద్వారా ప్రాథమిక దశలోనే  వాహనదారులకు రహదారి భద్రత, ట్రాఫిక్‌ నిబంధనలపైన  అవగాహన ఏర్పడుతుందని అధికారులు  పేర్కొంటున్నారు. రోడ్డుపైన వాహనాన్ని నడపడం కంటే ముందే డ్రైవింగ్‌ లో మెళకువలను నేర్పించడం వల్ల  రెట్టింపు ప్రయోజనం ఉంటుందని తెలిపారు. ఇందుకోసం ప్రతి డ్రైవింగ్‌ స్కూల్‌ సిమ్యులేటర్‌ను ఏర్పాటు చేసుకునేలా చర్యలు చేపట్టనున్నట్లు  జేటీసీ రమేష్‌  పేర్కొన్నారు.  

డొల్ల శిక్షణకు చెల్లు... 
ప్రస్తుతం నగరంలో వందలకొద్దీ డ్రైవింగ్‌ స్కూళ్లు ఉన్నాయి. ఇందులో 80 శాతానికి పైగా మొక్కుబడి అవగాహన కల్పిస్తూ వినియోగదారుల నుంచి రూ.వేలల్లో దండుకుంటున్నాయి. ఆయా స్కూళ్లలో శిక్షణ పొందిన వారు రోడ్డుపైకి వచ్చిన తరువాత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్‌ రద్దీలో  గందరగోళానికి గురవుతుండటంతో  తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని స్కూళ్లు  ఎలాంటి శిక్షణ ఇవ్వకుండా కేవలం డ్రైవింగ్‌ లైసెన్సులు ఇప్పించేందుకే పరిమితమయ్యాయి. ఈ  మేరకు ఆర్టీఏ అధికారులతో ఒప్పందం చేసుకొని దళారీ పాత్రను పోషిస్తున్నాయి. మొత్తంగా  ఎలాంటి శాస్త్రీయత లేకుండా, నాణ్యమైన పద్ధతులు లేకుండా  లభిస్తోన్న  శిక్షణ స్థానంలో సిమ్యులేటర్‌లు శాస్త్రీయమైన పద్ధతులకు దోహదం చేస్తుందని అధికారులు భావిస్తున్నారు. 

సిమ్యులేటర్లతో ప్రయోజనాలు... 
  డ్రైవింగ్‌ పట్ల  భయం తొలగిపోతుంది. ట్రాఫిక్‌ రద్దీ, వాహనాల రొద వంటి పరిస్థితుల్లో గందరగోళం లేకుండా వాహనం నడిపే అవగాహన ఏర్పడుతుంది. 
 క్లచ్, గేర్,ఎస్కలేటర్, స్టీరింగ్, ఇండికేటర్, హెడ్‌లైట్, వైపర్‌లను  ఎలా వినియోగించాలో, ఏ సమయంలో  ఏం చేయాలనేది  నేర్చుకోవచ్చు. 
ట్రాఫిక్‌ రద్దీ దృష్ట్యా రోడ్డుపైన  ఏ ట్రాక్‌లో వాహనం  నడపాలనే అంశం తెలుస్తుంది. ట్రాఫిక్‌ రద్దీ తీవ్రతకు అనుగుణంగా ట్రాక్‌లలో మార్పులు చోటు చేసుకుంటాయి.  
కుడి, ఎడమ ఇండికేటర్స్‌  ఎలా విని యోగించాలో తెలుసుకోవచ్చు. ‘యు’ టర్న్‌  తీసుకొనేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు తెలుస్తాయి. 
ఘాట్‌రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లో  వాహనం నడిపేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలపైన  సిమ్యులేటర్‌లు అవగాహన కల్పిస్తాయి.  
వర్షాకాలం, మంచుకురిసే సమయాల్లో హెడ్‌లైట్లను తప్పనిసరిగా వేయాలి. వైపర్‌ల కండీషన్‌ ముఖ్యం. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలను పాటించకపోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. సిమ్యులేటర్‌ శిక్షణ  డ్రైవింగ్‌తో ముడిపడిన ప్రతి అంశంపైన అవగాహన కల్పిస్తుంది. 
 సిగ్నల్‌ పడిన సమయంలో ఎంత దూరంలో వాహనం నిలపాలి. పార్కింగ్‌ సమయంలో ఎలాంటి మెళకువలు పాటించాలి వంటి అన్ని అంశాలపైన యానిమేషన్‌  చిత్రాల ద్వారా అవగాహన కల్పిస్తారు.  
వివిధ రకాల రోడ్లు, సైన్‌బోర్డులు, జాగ్రత్తలు, హెచ్చరికల సూచీకలపైన అవగాహన కలుగుతుంది. 
ప్రమాదాలు జరిగినప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు తెలుస్తాయి. 

మూడు గంటలు – ఆరు క్లాసులు 
సిమ్యులేటర్‌లో మొత్తం 6 క్లాసులు ఉంటాయి. దశలవారీగా 3 గంటల సమయంలో ఈ శిక్షణ ఇస్తాం. ఈ శిక్షణ తరువాత వినియోగదారుడికి  డ్రైవింగ్‌ పైన భయం పూర్తిగా తొలగిపోతుంది. అన్ని విషయాలపైన స్పష్టమైన అవగాహన కలుగుతుంది. ఆ తరువాత రోడ్డుపైన ఎలాంటి గందరగోళం లేకుండా  తాపీగా నేర్చుకోగలుగుతాడు. ఖైరతాబాద్‌   ఆర్టీఏలో మరో వారం లో  ఈ శిక్షణ ప్రారంభం కానుంది.  
 – మగ్బుల్‌ ఫలక్, సిమ్యులేటర్‌ శిక్షకులు

రోడ్డు భద్రతపై అవగాహన పెరుగుతుంది
సిమ్యులేటర్‌ ద్వారా శిక్షణ పొందేవారికి అనేక అంశాలపైన కచ్చితమైన అవగాహన కలుగుతుంది. ముఖ్యంగా రోడ్డు భద్రతా నిబంధనలు తెలుస్తాయి. వాతావరణం, ట్రాఫిక్‌ రద్దీలో వచ్చే మార్పులకు అనుగుణంగా  వాహనం నడిపే తీరు, వేగనియంత్రణ, వివిధ రకాల విడిభాగాలను వినియోగించే పద్ధతిని ముందుగానే తెలుసుకొని  ఆ తరువాత వాహనం స్టీరింగ్‌ పట్టుకోవడం వల్ల  డ్రైవింగ్‌  పైన  అపోహలు, ఆందోళన తొలగిపోతాయి. అన్ని డ్రైవింగ్‌ స్కూళ్లు సిమ్యులేటర్‌లను ఏర్పాటు చేయాలి.  – రమేష్, జేటీసీ  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement