శ్రీరాంపూర్(ఆదిలాబాద్ జిల్లా): ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలం శ్రీరాంపూర్ సింగరేణి సీహెచ్‌పీలో బుధవారం జరిగిన ప్రమాదంలో కాంట్రాక్ట్ కార్మికుడు మేరుగు శ్రీకాంత్(26) మృతి చెందాడు. మరో ఏడుగురికి త్రుటితో ప్రాణాపాయం తప్పింది. బుధవారం సీహెచ్‌పీలోని బంకర్‌పై మల్మ (బొగ్గు చూర) క్లీన్ చేస్తున్నారు. మొత్తం ఎనిమిది మంది కాంట్రాక్ట్ కార్మికులు ఈ పనుల్లో ఉండగా.. శిథిలావస్థలో ఉన్న బంకర్ బాటం(గాండ్రీ) ఒక్కసారిగా కూలింది. దీంతో 30 మీటర్ల ఎత్తు నుంచి శ్రీకాంత్ కిందపడ్డాడు. అతనిపై మల్మ, బాటం శిథిలాలు వచ్చి పడడంతో శ్రీకాంత్ అక్కడికక్కడే మృతి చెందాడు.
మిగిలిన ఏడుగురు బాటం విరిగే శబ్దాలు విని క్షణాల్లో తప్పుకున్నారు. కంపెనీ ఎస్‌ఓటు జీఎం పీపీ సత్యనారాయణ, డీజీఎం రామలింగం సంఘటన స్థలానికి చేరుకుని రెస్క్యూ సిబ్బందిని పిలిపించి శిథిలాల కింద ఉన్న శ్రీకాంత్ మృతదేహాన్ని వెలికితీశారు. కాగా.. మృతుని కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు, కార్మిక సంఘాలు మృతదేహంతో బైఠాయించాయి. కంపెనీ నుంచి వచ్చే డబ్బులను సకాలంలో చెల్లిస్తామని, అదనపు ఎక్స్‌గ్రేషియా, ఇతర నష్టపరిహారాలపై కారొరేట్ స్థాయిలో చర్చిస్తామని అధికారులు చెప్పడంతో ఆందోళన విరమించారు.
సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుడి మృతి
Published Wed, Jun 24 2015 11:22 PM | Last Updated on Sun, Sep 2 2018 4:23 PM
Advertisement