Srirampur singareni
-
కార్మిక క్షేత్రంలో విషాదం: ‘బావ.. ఒక్కసారి లే.. నీ కొడుకును ఎత్తుకో..’
శ్రీరాంపూర్/నస్పూర్/జన్నారం/మంచిర్యాలరూరల్(హాజీపూర్): శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్ఆర్పీ 3 బొగ్గు గనిలో జరిగిన ప్రమాదం కార్మిక క్షేత్రంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. బుధవారం మొదటి షిఫ్టులో జరిగిన గని ప్రమాదంలో పట్టణంలో నివాసం ఉంటున్న నలుగురు కార్మికులు మృతిచెందారు. విషయం తెలుసుకున్న వారి కుటుంబ సభ్యులు గని వద్ద విలపించిన తీరు పలువురు కార్మికులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. గని ప్రమాదంలో మృతిచెందిన కార్మికులది ఒక్కొక్కరిది ఒక్కో విషాదగాథ.. సైకిల్‌పైనే డ్యూటీకి... ఒంటెల క్రిష్ణారెడ్డి ఆర్కే 8 కాలనీ నివాసి. ఇతను అనారోగ్య కారణాలతో కారుణ్య ఉద్యోగాల కోసం మెడికల్ బోర్డుకు వెళ్లాడు. ఐతే బోర్డు ఆయన్ను తిరిగి ఫిట్ ఫర్ సేమ్ జాబ్ ఇవ్వడంతో వచ్చి డ్యూటీ చేస్తున్నారు. మంచి సౌమ్యుడిగా పేరు. ఎప్పుడు సైకిల్‌పైనే తిరిగే వాడని, డ్యూటీకి కూడా సైకిల్ మీదనే వచ్చే వాడని పేరుంది. ఇతనికి భార్య సత్యవతి, కొడుకులు రాజేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు. అన్‌ఫిట్ అయితే కొడుకు ఉద్యోగం వస్తుందని ఆశ పడితే బోర్డు ఫిట్ ఇవ్వడంతో అటు కొడుకు ఉద్యోగం ఆశ నెరవేరక, ఇటూ ఇంటి పెద్దప్రాణాలు నిలువక ఆ కుటుంబంలో తీవ్ర విషాదం మిగిలింది. శాశ్వత విశ్రాంతి మిగిలింది బేర లక్ష్మయ్య ఈ సంవత్సరం జూలైలో రిటైర్డ్ అయ్యారు. విశ్రాంతి తీసుకుందామనుకుంటే కంపెనీ తిరిగి ఒక సంవత్సరం సర్వీసు పెంచడంతో తిరిగి ఆగస్టులో ఉద్యోగంలో చేరారు. నస్పూర్ షిర్కేలో కుటుంబం నివాసం ఉంటుంది. తన జీవిత కాలంలో ఏ ప్రమాదం జరగకుండా బయటపడి.. మళ్లీ డ్యూటీలో చేరాక ప్రమాదంలో మృతి చెందడం అందర్నీ కలచివేసింది. ఇతనికి భార్య, కొడుకులు శ్రీధర్, శ్రీకాంత్, కూతురు సుమలత ఉన్నారు. స్నేహితుడి రూంలో ఉంటూ.. గడ్డం సత్యనర్సింహారాజు స్వస్థలం ఇల్లెందు. ఉద్యోగం చేరి సంవత్సరం దాటింది. పెళ్లి చేసుకుని ఓ ఇంటి వాడు అయితడనే మురిపం తీరకుండానే బాయి ప్రమాదం పొట్టనపెట్టుకోవడం వారికుటుంబాల్లో విషాదం నింపింది. తల్లిదంద్రులు రాజు, రమాదేవి ఇల్లందులోనే ఉంటారు. నర్సింహారాజు మంచిర్యాల సున్నంబట్టి వాడలో స్నేహితుడి రూంలో ఉంటూ డ్యూటీకి వస్తుంటాడు. చంద్రశేఖర్ మృతదేహం వద్ద రోదిస్తున్న చెల్లెలు.. ఇన్సెట్లో చంద్రశేఖర్ (ఫైల్ ఫొటో) అరిన ఆశాదీపం.. రెండ చంద్రశేఖర్ తండ్రి పోశం సింగరేణిలో పని చేసి మెడికల్ అన్‌ఫిట్ కావడంతో ఆయన స్థానంలో కారుణ్య ఉద్యోగం వచ్చింది. రెండేళ్లుగా సింగరేణిలో చేస్తున్నారు. ఇతనికి భార్య నవ్య, ఐదు నెలల ముద్దుల కొడుకు ఉన్నాడు. కొడుకుతో మురిపం తీరలేదు. కారుణ్య ఉద్యోగంతో ఆ ఇంటికి ఆశాదీపంగా ఉంటానుకున్న తన కొడుకు బాయి ప్రమాదం విగతజీవున్ని చేసిందని చంద్రశేఖర్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. బావా.. నీ కొడుకును ఎత్తుకోవా..? ఆ పసి మనసుకు ఏం తెలుసు? నాన్న చనిపోయాడని..? అమ్మ ఎందుకు ఏడుస్తుందోనని...? అమ్మ ఎన్ని సార్లు పిలిచిన నాన్న రావడం లేదని.. మృతుల్లో ఒకరైన యువ కార్మికుడు రెంక చంద్రశేఖర్ ఐదు నెలల కుమారుడి చూపులు ఆ పరిసరాల్లో వర్ణణాతీత విషాదాన్ని నింపింది. ఊహ తెలియని వయస్సులో తండ్రిని కోల్పోయిన ఆ చిన్నారిని చూసిన వారందరికీ దుఃఖం కడుపులోంచి తన్నుకొచ్చి కన్నీటి పర్యంతమయ్యారు. మృతుడి భార్య నవ్య ‘‘ఓ బావ, నీ కొడుకును ఎత్తుకోవా.. నీ కోసం చూస్తున్నాడు... బావ.. ఒక్కసారి లే.. బావ ఒక్కసారి లే..’’ అంటూ తల్లడిల్లిన తీరు అందరినీ కలచి వేసింది. (గని పైకప్పు కూలి... నలుగురు కార్మికులు మృతి) -
శ్రీరాంపూర్ భూగర్భగనిలో ప్రమాదం
-
గని పైకప్పు కూలి..... నలుగురు కార్మికులు మృతి
శ్రీరాంపూర్ (మంచిర్యాల): మంచిర్యాల జిల్లాలోని సింగరేణి శ్రీరాంపూర్ డివిజన్ ఎస్సార్పీ 3 భూగర్భ గనిలో బుధవారం పెద్ద ప్రమాదం జరిగింది. పై కప్పు కూలి పడటంతో నలుగురు కార్మికులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పై కప్పులో పగుళ్లు ముందుగానే గమనించిన అధికారులు రక్షణ చర్యలకు ఆదేశించారు. ఈ మేరకు పనులు చేస్తున్న కార్మికులే ఈ దుర్ఘటనలో మృత్యువాత పడ్డారు. సింగరేణిలో చాలాకాలం తర్వాత జరిగిన అతిపెద్ద ప్రమాదం ఇదే. అధికారులు, కార్మికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ప్రమాదం గమనించి రక్షణ పనులు చేస్తుండగా.. గని భూగర్భంలోని 24 ఎల్ఎస్, 21 క్రాస్ కట్, 3 ఎస్పీ–2, త్రీ సీమ్‌లో కొద్దిరోజులుగా డీపిల్లరింగ్ చేయడం కోసం డెవలప్మెంట్ పనులు చేస్తున్నారు. అయితే అక్కడి పై కప్పులో ఉన్న బండ పగిలి ఉందని కొద్ది రోజుల క్రితమే అధికారులు గమనించారు. అది కూలిపడకుండా నలుగురు కార్మికులతో రక్షణ పనులకు ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఉదయం సపోర్టుమెన్లు ఒంటెల క్రిష్ణారెడ్డి (58), బేర లక్ష్మయ్య (60), బదిలీ వర్కర్లు గడ్డం సత్య నర్సింహరాజు (32), రెంక చంద్రశేఖర్ (32) పనిలోకి దిగారు. నలుగురు రూఫ్సైడ్లకు రూఫ్ బోల్టర్లతో డ్రిల్లింగ్ వేసి ఐరన్ తాడుతో స్ట్రిచ్చింగ్ (వలలాగా) చేసి పైకప్పు కూలకుండా రక్షణ చర్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా 2 మీటర్ల వెడల్పు, 6 మీటర్ల పొడవు, 2 మీటర్ల మందం ఉన్న పెద్ద బండ వారిపై కూలి పడింది. టన్నుల కొద్దీ బరువైన బండ మీదపడడంతో వారికి ప్రాణాలు దక్కించుకొనే అవకాశం లేకుండా పోయింది. నలుగురు కార్మికులూ శిథిలాల కింద నుజ్జునుజ్జు అయ్యి అక్కడికక్కడే మరణించారు. పెద్ద శబ్దంతో కూలిన పై కప్పు జంక్షన్‌కు 15 మీటర్ల దూరంలో ఉదయం 10:40 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. బండ కూలేటప్పుడు వచ్చిన పెద్ద శబ్దం విని సమీపంలో పని చేస్తున్న కార్మికులు హుటాహుటిన అక్కడికి వచ్చి చూసే సరికి బండ కింద నుంచి ఓ కార్మికుడు ధరించిన క్యాప్‌ల్యాంప్ వెలుతురు కనిపించడంతో వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. బెల్లంపల్లి రీజియన్ సేఫ్టీ జీఎం బళ్లారి శ్రీనివాస్, ఇన్చార్జి ఏజెంట్ ఏవీఎన్ రెడ్డి, గని మేనేజర్ జి.రవికుమార్, ఏరియా సేఫ్టీ అధికారి గోషిక మల్లేశ్, గని సేఫ్టీ అధికారి వెంకటేశ్వర్‌రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. రెస్క్యూ సిబ్బంది ఆరు గంటలపాటు శ్రమించి మృతదేహాలను బయటకు తీశారు. ముందుగా చంద్రశేఖర్ మృతదేహాన్ని, ఆ తర్వాత రెండు గంటలకు మిగతావారి మృతదేహాలను బయటకు తెచ్చారు. ఏరియా జీఎం ఎం.సురేశ్ ప్రమాద వివరాలతో ఉన్నతాధికారులకు నివేదిక పంపించారు. ఐదుగురికి తృటిలో తప్పిన ప్రమాదం ఘటనా స్థలానికి అతి సమీపంలోనే ఐదుగురు కార్మికులు పని చేసి, అటువైపు నుంచి వచ్చిన కొద్ది సేపటికే ప్రమాదం జరగడంతో వారు ప్రాణాలు దక్కించుకున్నారు. కాగా ప్రమాదం ఉందని తెలిసి రక్షణ చర్యలు చేపట్టిన అధికారులు.. అక్కడ మరింత ప్రత్యేక పర్యవేక్షణతో పనులు చేయించాల్సి ఉండగా నిర్లక్ష్యంగా వ్యవహరించారని కార్మికులు ఆరోపిస్తున్నారు. రూఫ్ క్రాక్ వచ్చిందని తెలిసిన తరువాత చెక్క దిమ్మెలను çసపోర్టుగా పెట్టి మిగతా రక్షణ చర్యలు చేపడితే ప్రమాదం జరిగినా కార్మికుల ప్రాణాలకు కొంత రక్షణ ఉండేదని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. స్టాటా మానిటరింగ్ చేయకపోవడం, రూఫ్ నుంచి ఎంత ఒత్తిడి ఉంటుందని గమనించకపోవడం వైఫల్యమేనని విమర్శిస్తున్నారు. మృతదేహాలతో బైఠాయింపు కార్మికుల మృతదేహాలు బయటికి వచ్చిన తరువాత పోస్టుమార్టానికి పంపించకుండా కార్మికులు, కార్మిక సంఘాల నేతలు అడ్డుకున్నారు. మృతదేహాలను గనిపై ఉంచి నిరసన తెలిపారు. ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వి.సీతారామయ్య, బీఎంఎస్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య, సీఐటీయూ కార్యదర్శి మంద నర్సింహం, ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షుడు జె.శంకర్రావు, హెచ్ఎమ్మెస్ ఉపాధ్యక్షుడు జీవన్‌జోయల్ కార్మికుల ఆందోళనలకు మద్దతు తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి నష్టపరిహారం చెల్లించాలని, వారి పిల్లలను ఉన్నత చదువుల వరకు కంòపెనీయే చదివించాలని, కార్పొరేట్ వైద్య చికిత్సలు అందించాలని, కంపెనీ నుంచి రావాల్సిన మిగిలిన అన్ని పరిహారాలు సత్వరమే అందించాలని డిమాండ్ చేశారు. సంఘటన స్థలానికి సీఎం లేదా మంత్రులు వచ్చి హామీ ఇచ్చేవరకు మృతదేహాలను కదిలించబోమని భీష్మించుకుని కూర్చున్నారు. వీరితో పాటు గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, మాజీ అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య ఘటనను తీవ్రంగా ఖండించారు. ప్రమాదానికి కారకులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బలవంతంగా తరలింపు ఎక్స్‌గ్రేషియా ఇతర డిమాండ్లపై కార్మికులు, కార్మిక సంఘాల నేతలు ఆందోళన చేస్తుండగానే మంచిర్యాల ఏసీపీ అఖిల్ మహాజన్, జైపూర్ ఏసీపీ నరేందర్ ఆధ్వర్యంలో మృతదేహాలను పోస్టుమార్టం కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి బలవంతంగా తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు, నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఎస్సార్పీ 3 గని ప్రమాదంపై ఎమ్మెల్సీ, టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. కార్మికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. -
సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుడి మృతి
శ్రీరాంపూర్(ఆదిలాబాద్ జిల్లా): ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలం శ్రీరాంపూర్ సింగరేణి సీహెచ్‌పీలో బుధవారం జరిగిన ప్రమాదంలో కాంట్రాక్ట్ కార్మికుడు మేరుగు శ్రీకాంత్(26) మృతి చెందాడు. మరో ఏడుగురికి త్రుటితో ప్రాణాపాయం తప్పింది. బుధవారం సీహెచ్‌పీలోని బంకర్‌పై మల్మ (బొగ్గు చూర) క్లీన్ చేస్తున్నారు. మొత్తం ఎనిమిది మంది కాంట్రాక్ట్ కార్మికులు ఈ పనుల్లో ఉండగా.. శిథిలావస్థలో ఉన్న బంకర్ బాటం(గాండ్రీ) ఒక్కసారిగా కూలింది. దీంతో 30 మీటర్ల ఎత్తు నుంచి శ్రీకాంత్ కిందపడ్డాడు. అతనిపై మల్మ, బాటం శిథిలాలు వచ్చి పడడంతో శ్రీకాంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలిన ఏడుగురు బాటం విరిగే శబ్దాలు విని క్షణాల్లో తప్పుకున్నారు. కంపెనీ ఎస్ఓటు జీఎం పీపీ సత్యనారాయణ, డీజీఎం రామలింగం సంఘటన స్థలానికి చేరుకుని రెస్క్యూ సిబ్బందిని పిలిపించి శిథిలాల కింద ఉన్న శ్రీకాంత్ మృతదేహాన్ని వెలికితీశారు. కాగా.. మృతుని కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు, కార్మిక సంఘాలు మృతదేహంతో బైఠాయించాయి. కంపెనీ నుంచి వచ్చే డబ్బులను సకాలంలో చెల్లిస్తామని, అదనపు ఎక్స్‌గ్రేషియా, ఇతర నష్టపరిహారాలపై కారొరేట్ స్థాయిలో చర్చిస్తామని అధికారులు చెప్పడంతో ఆందోళన విరమించారు.