బావ లే అంటూ గుండెలు పగిలేలా రోదిస్తున్న చంద్రశేఖర్ భార్య నవ్య
శ్రీరాంపూర్/నస్పూర్/జన్నారం/మంచిర్యాలరూరల్(హాజీపూర్): శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్‌ఆర్‌పీ 3 బొగ్గు గనిలో జరిగిన ప్రమాదం కార్మిక క్షేత్రంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. బుధవారం మొదటి షిఫ్టులో జరిగిన గని ప్రమాదంలో పట్టణంలో నివాసం ఉంటున్న నలుగురు కార్మికులు మృతిచెందారు. విషయం తెలుసుకున్న వారి కుటుంబ సభ్యులు గని వద్ద విలపించిన తీరు పలువురు కార్మికులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. గని ప్రమాదంలో మృతిచెందిన కార్మికులది ఒక్కొక్కరిది ఒక్కో విషాదగాథ..
సైకిల్‌పైనే డ్యూటీకి...
ఒంటెల క్రిష్ణారెడ్డి ఆర్కే 8 కాలనీ నివాసి. ఇతను అనారోగ్య కారణాలతో కారుణ్య ఉద్యోగాల కోసం మెడికల్ బోర్డుకు వెళ్లాడు. ఐతే బోర్డు ఆయన్ను తిరిగి ఫిట్ ఫర్ సేమ్ జాబ్ ఇవ్వడంతో వచ్చి డ్యూటీ చేస్తున్నారు. మంచి సౌమ్యుడిగా పేరు. ఎప్పుడు సైకిల్‌పైనే తిరిగే వాడని, డ్యూటీకి కూడా సైకిల్ మీదనే వచ్చే వాడని పేరుంది. ఇతనికి భార్య సత్యవతి, కొడుకులు రాజేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు. అన్‌ఫిట్ అయితే కొడుకు ఉద్యోగం వస్తుందని ఆశ పడితే బోర్డు ఫిట్ ఇవ్వడంతో అటు కొడుకు ఉద్యోగం ఆశ నెరవేరక, ఇటూ ఇంటి పెద్దప్రాణాలు నిలువక ఆ కుటుంబంలో తీవ్ర విషాదం మిగిలింది.
శాశ్వత విశ్రాంతి మిగిలింది
బేర లక్ష్మయ్య ఈ సంవత్సరం జూలైలో రిటైర్డ్ అయ్యారు. విశ్రాంతి తీసుకుందామనుకుంటే కంపెనీ తిరిగి ఒక సంవత్సరం సర్వీసు పెంచడంతో తిరిగి ఆగస్టులో ఉద్యోగంలో చేరారు. నస్పూర్ షిర్కేలో కుటుంబం నివాసం ఉంటుంది. తన జీవిత కాలంలో ఏ ప్రమాదం జరగకుండా బయటపడి.. మళ్లీ డ్యూటీలో చేరాక ప్రమాదంలో మృతి చెందడం అందర్నీ కలచివేసింది. ఇతనికి భార్య, కొడుకులు శ్రీధర్, శ్రీకాంత్, కూతురు సుమలత ఉన్నారు.
స్నేహితుడి రూంలో ఉంటూ..
గడ్డం సత్యనర్సింహారాజు స్వస్థలం ఇల్లెందు. ఉద్యోగం చేరి సంవత్సరం దాటింది. పెళ్లి చేసుకుని ఓ ఇంటి వాడు అయితడనే మురిపం తీరకుండానే బాయి ప్రమాదం పొట్టనపెట్టుకోవడం వారికుటుంబాల్లో విషాదం నింపింది. తల్లిదంద్రులు రాజు, రమాదేవి ఇల్లందులోనే ఉంటారు. నర్సింహారాజు మంచిర్యాల సున్నంబట్టి వాడలో స్నేహితుడి రూంలో ఉంటూ డ్యూటీకి వస్తుంటాడు.
చంద్రశేఖర్ మృతదేహం వద్ద రోదిస్తున్న చెల్లెలు.. ఇన్‌సెట్‌లో చంద్రశేఖర్ (ఫైల్ ఫొటో)
అరిన ఆశాదీపం..
రెండ చంద్రశేఖర్ తండ్రి పోశం సింగరేణిలో పని చేసి మెడికల్ అన్‌ఫిట్ కావడంతో ఆయన స్థానంలో కారుణ్య ఉద్యోగం వచ్చింది. రెండేళ్లుగా సింగరేణిలో చేస్తున్నారు. ఇతనికి భార్య నవ్య, ఐదు నెలల ముద్దుల కొడుకు ఉన్నాడు. కొడుకుతో మురిపం తీరలేదు. కారుణ్య ఉద్యోగంతో ఆ ఇంటికి ఆశాదీపంగా ఉంటానుకున్న తన కొడుకు బాయి ప్రమాదం విగతజీవున్ని చేసిందని చంద్రశేఖర్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.
బావా.. నీ కొడుకును ఎత్తుకోవా..?
ఆ పసి మనసుకు ఏం తెలుసు? నాన్న చనిపోయాడని..? అమ్మ ఎందుకు ఏడుస్తుందోనని...? అమ్మ ఎన్ని సార్లు పిలిచిన నాన్న రావడం లేదని.. మృతుల్లో ఒకరైన యువ కార్మికుడు రెంక చంద్రశేఖర్ ఐదు నెలల కుమారుడి చూపులు ఆ పరిసరాల్లో వర్ణణాతీత విషాదాన్ని నింపింది. ఊహ తెలియని వయస్సులో తండ్రిని కోల్పోయిన ఆ చిన్నారిని చూసిన వారందరికీ దుఃఖం కడుపులోంచి తన్నుకొచ్చి కన్నీటి పర్యంతమయ్యారు. మృతుడి భార్య నవ్య ‘‘ఓ బావ, నీ కొడుకును ఎత్తుకోవా.. నీ కోసం చూస్తున్నాడు... బావ.. ఒక్కసారి లే.. బావ ఒక్కసారి లే..’’ అంటూ తల్లడిల్లిన తీరు అందరినీ కలచి వేసింది. (గని పైకప్పు కూలి... నలుగురు కార్మికులు మృతి)
Comments
Please login to add a commentAdd a comment