గని పైకప్పు కూలి..... నలుగురు కార్మికులు మృతి | 4 Workers Died After Roof Collapses At Srirampur Singareni Mine | Sakshi
Sakshi News home page

గని పైకప్పు కూలి..... నలుగురు కార్మికులు మృతి

Published Wed, Nov 10 2021 3:30 PM | Last Updated on Thu, Nov 11 2021 4:12 PM

4 Workers Died After Roof Collapses At Srirampur Singareni Mine - Sakshi

మృతదేహాలను బయటకు తీసుకువస్తున్న రెస్క్యూ సిబ్బంది

శ్రీరాంపూర్‌ (మంచిర్యాల): మంచిర్యాల జిల్లాలోని సింగరేణి శ్రీరాంపూర్‌ డివిజన్‌ ఎస్సార్పీ 3 భూగర్భ గనిలో బుధవారం పెద్ద ప్రమాదం జరిగింది. పై కప్పు కూలి పడటంతో నలుగురు కార్మికులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పై కప్పులో పగుళ్లు ముందుగానే గమనించిన అధికారులు రక్షణ చర్యలకు ఆదేశించారు. ఈ మేరకు పనులు చేస్తున్న కార్మికులే ఈ దుర్ఘటనలో మృత్యువాత పడ్డారు. సింగరేణిలో చాలాకాలం తర్వాత జరిగిన అతిపెద్ద ప్రమాదం ఇదే. అధికారులు, కార్మికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. 

ప్రమాదం గమనించి రక్షణ పనులు చేస్తుండగా..  
గని భూగర్భంలోని 24 ఎల్‌ఎస్, 21 క్రాస్‌ కట్, 3 ఎస్‌పీ–2, త్రీ సీమ్‌లో కొద్దిరోజులుగా డీపిల్లరింగ్‌ చేయడం కోసం డెవలప్‌మెంట్‌ పనులు చేస్తున్నారు. అయితే అక్కడి పై కప్పులో ఉన్న బండ పగిలి ఉందని కొద్ది రోజుల క్రితమే అధికారులు గమనించారు. అది కూలిపడకుండా నలుగురు కార్మికులతో రక్షణ పనులకు ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఉదయం సపోర్టుమెన్‌లు ఒంటెల క్రిష్ణారెడ్డి (58), బేర లక్ష్మయ్య (60), బదిలీ వర్కర్లు గడ్డం సత్య నర్సింహరాజు (32), రెంక చంద్రశేఖర్‌ (32) పనిలోకి దిగారు. నలుగురు రూఫ్‌సైడ్‌లకు రూఫ్‌ బోల్టర్‌లతో డ్రిల్లింగ్‌ వేసి ఐరన్‌ తాడుతో స్ట్రిచ్చింగ్‌ (వలలాగా) చేసి పైకప్పు కూలకుండా రక్షణ చర్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా 2 మీటర్ల వెడల్పు, 6 మీటర్ల పొడవు, 2 మీటర్ల మందం ఉన్న పెద్ద బండ వారిపై కూలి పడింది. టన్నుల కొద్దీ బరువైన బండ మీదపడడంతో వారికి ప్రాణాలు దక్కించుకొనే అవకాశం లేకుండా పోయింది. నలుగురు కార్మికులూ శిథిలాల కింద నుజ్జునుజ్జు అయ్యి అక్కడికక్కడే మరణించారు. 

పెద్ద శబ్దంతో కూలిన పై కప్పు 
    జంక్షన్‌కు 15 మీటర్ల దూరంలో ఉదయం 10:40 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. బండ కూలేటప్పుడు వచ్చిన పెద్ద శబ్దం విని సమీపంలో పని చేస్తున్న కార్మికులు హుటాహుటిన అక్కడికి వచ్చి చూసే సరికి బండ కింద నుంచి ఓ కార్మికుడు ధరించిన క్యాప్‌ల్యాంప్‌ వెలుతురు కనిపించడంతో వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. బెల్లంపల్లి రీజియన్‌ సేఫ్టీ జీఎం బళ్లారి శ్రీనివాస్, ఇన్‌చార్జి ఏజెంట్‌ ఏవీఎన్‌ రెడ్డి, గని మేనేజర్‌ జి.రవికుమార్, ఏరియా సేఫ్టీ అధికారి గోషిక మల్లేశ్, గని సేఫ్టీ అధికారి వెంకటేశ్వర్‌రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. రెస్క్యూ సిబ్బంది ఆరు గంటలపాటు శ్రమించి మృతదేహాలను బయటకు తీశారు. ముందుగా చంద్రశేఖర్‌ మృతదేహాన్ని, ఆ తర్వాత రెండు గంటలకు మిగతావారి మృతదేహాలను బయటకు తెచ్చారు. ఏరియా జీఎం ఎం.సురేశ్‌ ప్రమాద వివరాలతో ఉన్నతాధికారులకు నివేదిక పంపించారు. 

ఐదుగురికి తృటిలో తప్పిన ప్రమాదం 
    ఘటనా స్థలానికి అతి సమీపంలోనే ఐదుగురు కార్మికులు పని చేసి, అటువైపు నుంచి వచ్చిన కొద్ది సేపటికే ప్రమాదం జరగడంతో వారు ప్రాణాలు దక్కించుకున్నారు. కాగా ప్రమాదం ఉందని తెలిసి రక్షణ చర్యలు చేపట్టిన అధికారులు.. అక్కడ మరింత ప్రత్యేక పర్యవేక్షణతో పనులు చేయించాల్సి ఉండగా నిర్లక్ష్యంగా వ్యవహరించారని కార్మికులు ఆరోపిస్తున్నారు. రూఫ్‌ క్రాక్‌ వచ్చిందని తెలిసిన తరువాత చెక్క దిమ్మెలను çసపోర్టుగా పెట్టి మిగతా రక్షణ చర్యలు చేపడితే ప్రమాదం జరిగినా కార్మికుల ప్రాణాలకు కొంత రక్షణ ఉండేదని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. స్టాటా మానిటరింగ్‌ చేయకపోవడం, రూఫ్‌ నుంచి ఎంత ఒత్తిడి ఉంటుందని గమనించకపోవడం వైఫల్యమేనని విమర్శిస్తున్నారు.  

మృతదేహాలతో బైఠాయింపు 
    కార్మికుల మృతదేహాలు బయటికి వచ్చిన తరువాత పోస్టుమార్టానికి పంపించకుండా కార్మికులు, కార్మిక సంఘాల నేతలు అడ్డుకున్నారు. మృతదేహాలను గనిపై ఉంచి నిరసన తెలిపారు. ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వి.సీతారామయ్య, బీఎంఎస్‌ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య, సీఐటీయూ కార్యదర్శి మంద నర్సింహం, ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షుడు జె.శంకర్‌రావు, హెచ్‌ఎమ్మెస్‌ ఉపాధ్యక్షుడు జీవన్‌జోయల్‌ కార్మికుల ఆందోళనలకు మద్దతు తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి నష్టపరిహారం చెల్లించాలని, వారి పిల్లలను ఉన్నత చదువుల వరకు కంòపెనీయే చదివించాలని, కార్పొరేట్‌ వైద్య చికిత్సలు అందించాలని, కంపెనీ నుంచి రావాల్సిన మిగిలిన అన్ని పరిహారాలు సత్వరమే అందించాలని డిమాండ్‌ చేశారు. సంఘటన స్థలానికి సీఎం లేదా మంత్రులు వచ్చి హామీ ఇచ్చేవరకు మృతదేహాలను కదిలించబోమని భీష్మించుకుని కూర్చున్నారు. వీరితో పాటు గుర్తింపు సంఘం టీబీజీకేఎస్‌ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, మాజీ అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య ఘటనను తీవ్రంగా ఖండించారు. ప్రమాదానికి కారకులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.  

బలవంతంగా తరలింపు  
    ఎక్స్‌గ్రేషియా ఇతర డిమాండ్లపై కార్మికులు, కార్మిక సంఘాల నేతలు ఆందోళన చేస్తుండగానే మంచిర్యాల ఏసీపీ అఖిల్‌ మహాజన్, జైపూర్‌ ఏసీపీ నరేందర్‌ ఆధ్వర్యంలో మృతదేహాలను పోస్టుమార్టం కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి బలవంతంగా తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు, నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఎస్సార్పీ 3 గని ప్రమాదంపై ఎమ్మెల్సీ, టీబీజీకేఎస్‌ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. కార్మికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement