సింగరేణి ఎన్నికల్లో దూసుకెళ్తున్న టీబీజీకేఎస్‌ | Singareni Union Elections, 94.93 Polling Recorded In 11 Areas | Sakshi
Sakshi News home page

సింగరేణి ఎన్నికల్లో 94.93 శాతం పోలింగ్‌

Published Thu, Oct 5 2017 8:16 PM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM

Singareni Union Elections, 94.93 Polling Recorded In 11 Areas  - Sakshi

సాక్షి, కొత్తగూడెం : సింగరేణి బొగ్గు గనుల సంస్థ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో 94.93 శాతం పోలింగ్‌ నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్‌ భూపాలపల్లి, ఖమ్మం, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో గల 11 ఏరియాల్లోని 92 పోలింగ్‌ బూత్‌లలో గురువారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరిగింది. అన్ని ఏరియాల్లో కలిపి మొత్తం 52,534 ఓట్లు ఉండగా.. 49,873 ఓట్లు పోల్‌ అయ్యాయి. కార్పొరేట్‌ డివిజన్‌లో మొత్తం 1,475 ఓట్లకు.. 95.93 శాతంతో 1,415 ఓట్లు నమోదయ్యాయి.

కొత్తగూడెం ఏరియాలో 3,712 ఓట్లకు.. 96.77 శాతంతో 3,592 ఓట్లు, ఇల్లెందు ఏరియాలో 1,112 ఓట్లకు.. 98.47 శాతంతో 1,095 ఓట్లు, మణుగూరు ఏరియాలో 2,883 ఓట్లకు.. 97.68 శాతంతో 2,816 ఓట్లు, రామగుండం-1 ఏరియాలో 6,876 ఓట్లకు.. 94.18 శాతంతో 6,476 ఓట్లు, రామగుండం-2 ఏరియాలో 4,221 ఓట్లకు.. 94.76 శాతంతో 4,000 ఓట్లు, రామగుండం-3 ఏరియాలో 5,367 ఓట్లకు.. 93.24 శాతంతో 5,004 ఓట్లు, భూపాలపల్లి ఏరియాలో 6,854 ఓట్లకు.. 94 శాతంతో 6,415 ఓట్లు, బెల్లంపల్లి ఏరియాలో 1,743 ఓట్లకు.. 96.56 శాతంతో 1,683 ఓట్లు, మందమర్రి ఏరియాలో 6,429 ఓట్లకు.. 95.07 శాతంతో 6,112 ఓట్లు, శ్రీరాంపూర్‌ ఏరియాలో 11,862 ఓట్లకు.. 94.97 శాతంతో 11,265 ఓట్లు పోలయ్యాయి. రాత్రి ఏడు గంటల నుంచి ఎన్నికల కౌంటింగ్‌ మొదలవగా,  రాత్రి 12 గంటలకల్లా ఫలితాలు వెలువడనున్నాయి.

సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలను ఈసారి  రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నికల్లో 16 కార్మిక సంఘాలు పోటీ పడుతున్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం తాజా మాజీ గుర్తింపు సంఘమైన టీఆర్‌ఎస్‌ అనుబంధ కార్మిక సంస్థ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్‌)కు, ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ కూటమి మధ్యనే ఉంది. ‘వారసత్వం’ ఎన్నికల ఎజెండాగా మారిన నేపథ్యంలో అధికారంలో ఉన్న తామే ‘ఏదో రకంగా’ వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరిస్తామంటూ గులాబీ దళం సింగరేణి చేజారకుండా శాయశక్తులు ఒడ్డింది.

ఇక ఏఐటీయూసీకి కాంగ్రెస్, టీడీపీ, టీ-జేఏసీ మద్దతిస్తున్నాయి. గతంలో కేవలం సింగరేణి కార్మికులకు, కార్మిక సంఘాలకు మాత్రమే ఆసక్తికరమైన సింగరేణి ఎన్నికలు.. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. అధికార పార్టీ తరఫున స్వయంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, మంత్రులు, ఎంపీలు రంగంలోకి దిగగా.. విపక్షాలు కూడా దీటుగా ప్రచారం చేశాయి. కాగా  తెలంగాణ ఉద్యమం సందర్భంగా గతంలో జరిగిన సింగరేణి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ జయకేతనం ఎగరవేసిన విషయం తెలిసిందే. తెలంగాణ ఏర్పాటయ్యాక కూడా సింగరేణి ప్రభావం ఉన్న అన్ని నియోజకవర్గాల్లో గెలుపొందింది.

ఆరోసారి ఎన్నికలు..
సింగరేణి సంస్థలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరగడం ఇది ఆరోసారి. 1998 సెప్టెంబర్‌ 9న తొలిసారిగా, 2001 ఫిబ్రవరి 19న రెండోసారి, 2003 మే 14న మూడోసారి, 2007 ఆగస్టు 9న నాలుగో సారి, 2012 జూన్‌ 28న ఐదోసారి ఎన్నికలు జరిగాయి.

మూడు సార్లు ఏఐటీయూసీ విజయం
ఇప్పటివరకు జరిగిన సింగరేణి ఎన్నికల్లో మూడుసార్లు సీపీఐ అనుబంధ కార్మిక సంఘం ఏఐటీయూసీ విజయం సాధించింది. కాంగ్రెస్‌ అనుబంధ ఐఎన్‌టీయూసీ, టీఆర్‌ఎస్‌ అనుబంధ టీబీజీకేఎస్‌ ఒక్కోసారి గెలుపొందాయి.

ఫలితాలు

- హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో టీబీజీకేఎస్‌ బోణీ కొట్టింది. మొత్తం 86 ఓట్లలో 84 ఓట్లు పోలయ్యాయి. వాటిలో టీబీజీకేఎస్‌ 77 ఓట్లు, ఏఐసీటీయూకి నాలుగు ఓట్లు, సీఐటీయూకి రెండు ఓట్లు, బీఎంఎస్‌కు ఒక ఓటు పడింది.

- ఇల్లందులో 217 ఓట్ల తేడాతో టీబీజీకేఎస్‌ గెలుపొందింది. టీబీజీకేఎస్‌ 617 ఓట్లు పోల్‌ కాగా.. ఏఐటీయూసీకి 400 ఓట్లు పడ్డాయి.

- కొత్తగూడెం కార్పొరేట్‌లో టీబీజీకేఎస్‌ విజయ పతాకం ఎగురవేసింది. టీబీజీకేఎస్‌కు 980 ఓట్లు పోల్‌ కాగా.. ఏఐటీయూసీకి 400 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. దీంతో 580 ఓట్ల తేడాతో టీబీజీకేఎస్‌ విజయం సాధించింది.

- బెల్లంపల్లిలో టీబీజీకేఎస్‌ గెలుపు. 174 ఓట్ల మెజార్టీతో ఏఐటీయూసీపై టీబీజీకేఎస్‌ విజయం.

- మణుగూరులో టీబీజీకేఎస్‌ విజయం సాధించింది. 629 ఓట్ల తేడాతో టీబీజీకేఎస్‌ గెలుపు.

- శ్రీరాంపూర్‌లో టీబీజీకేఎస్ గెలుపు. 2200 ఓట్ల తేడాతో టీబీజీకేఎస్ ఘనవిజయం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement