ఇదేనా ‘ఒకే కుటుంబం.. ఒకే గమ్యం.. ఒకే లక్ష్యం’ స్ఫూర్తి
యాజమాన్యం తీరుపై కార్మికుల ఆగ్రహం
ఖమ్మం(ఇల్లెందుఅర్బన్): ఒకే కుటుంబం..ఒకే గమ్యం..ఒకే లక్ష్యం నినాదంతో కొనసాగుతున్న సింగరేణి యాజమాన్యం ఆచరణలో మాత్రం విఫలమవుతోందని కార్మిక నేతలు విమర్శిస్తున్నారు. ప్రతి ఏడాది వేసవిలో మండుతున్న ఎండల నుంచి అధికారులు ఉపశమనం పొందేందుకు వీలుగా వారి క్వార్టర్లకు ఏసీలు ఏర్పాటు చేసుకునేందుకు యాజమాన్యం అవకాశం కల్పించింది. కార్మికులను మాత్రం కూలర్లకే పరిమితం చేశారు. ప్రస్తుత ఎండల వేడిమికి కూలర్లు సైతం పని చేయలేని స్థితిలో ఉన్నాయి. కూలర్లు వేసినా కార్మికులు ఉక్కపోత, వేడిమితో క్వార్టర్లల్లో ఉండలేకపోతున్నారు. మొదటి, సెకండ్ షిప్టుల్లో పని చేసి ఇంటికి వచ్చిన కార్మికులకు కంటి నిండా నిద్రలేకుండాపోతోంది. ఇంట్లో ఉన్న వేడిమికి ఒళ్లు మంటతో తల్లడిల్లిపోతున్నారు.
ప్రస్తుతం ఉన్న వేతనాలతో కార్మికులు ఏసీలను సైతం కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. కానీ కార్మికుల క్వార్టర్లకు ఏసీలు ఏర్పాటు చేసుకునేందుకు యాజమాన్యం నుంచి అనుమతిలేదు. దీంతో కార్మికులు నిస్సహాయస్థితిలో ఉండిపోతున్నారు. కార్మిక సంఘాల నేతలు ఈ సమస్యను పలుమార్లు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. ఓపెన్‌కాస్టుల్లో పని చేసే కార్మికులు మాత్రం ఇరుకుగదులు గల క్వార్టర్లలో ఏసీలు వసతి లేకపోవడంతో నరకయాతన అనుభవిస్తున్నారు. కూలర్లు, ఏసీల కింద పని చేసే అధికారుల క్వార్టర్లకు మాత్రం ఏసీలకు అనుమతిస్తున్న యాజమాన్యం అగ్నికుంపటిలో ఎనిమిది గంటలు పని చేసి వచ్చే తమ క్వార్టర్లుకు ఏసీ ఏర్పాటుకు ఎందుకు అనుమంతించడంలేదంటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా యాజమాన్యం పునరాలోచించి కార్మికుల క్వార్టర్లకు కూడా ఏసీలను బిగించుకుని అవకాశం కల్పించాలని కార్మిక నేతలు కోరుతున్నారు.