‘సిరిసిల్ల రాములు’కు ఆర్థిక సాయం
లక్ష రూపాయలను అందజేసిన మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: వేదం సినిమాలో సిరిసిల్ల రాములుగా నటించిన సినీ నటుడు నాగయ్యకు మంత్రి కె.తారకరామారావు రూ.లక్ష సాయం అందించారు. నాగయ్య అనారోగ్యంతో బాధపడుతున్నారని, అతని కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో సతమతమవుతుందని.. తన ట్వీటర్ ఖాతాకు ఒక నెటిజన్ పంపిన సమాచారానికి మంత్రి వెంటనే స్పందించారు.
ప్రస్తుతం ఫిల్మ్‌నగర్‌లోని పీజేఆర్ బస్తీలో ఉంటున్న నాగయ్య(స్వస్థలం గుంటూరు జిల్లా)ను మంత్రి తన క్యాంపు కార్యాలయానికి పిలిపించుకుని రూ.లక్షను అందించారు. ప్రభుత్వ పరంగా సాయం చేయాలని సాంస్కృతిక శాఖ డెరైక్టర్‌ను ఆదేశించారు. ప్రభుత్వం వృద్ధ కళాకారులకు ఇస్తున్న రూ.1,500 పింఛన్ నాగయ్యకు కూడా వచ్చేలా చూస్తామన్నారు.
నాగయ్య కుమారుడు సినీపరిశ్రమలో లైట్‌మేన్‌గా పనిచేస్తున్నందున, సినీ కళాకారులకు ఇచ్చే ఇళ్లలో అతనికి ఒకటి కేటాయిస్తామని హామీ ఇచ్చారు. వృద్ధ కళాకారుల సంక్షేమం కోసం ప్రణాళికలతో రావాలని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌కు మంత్రి సూచించారు.