సాక్షి, హైదరాబాద్: పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) సిబ్బందికి, రిసోర్స్ పర్సన్ల (ఆర్పీ)కు ప్రభుత్వం తీపి కబురు ప్రకటించింది. ఆర్పీలకు ప్రతి నెల రూ.6 వేల గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 6 వేల మంది ఆర్పీలకు మేలు జరగనుంది. పెంచిన వేతనాలతో ప్రభుత్వంపై ఏటా రూ.30 కోట్ల భారం పడనుంది. పట్టణ ప్రాంతాల్లో ప్రస్తుతం 4,800 మంది, కొత్తగా ఏర్పడిన పురపాలిక సంస్థల పరిధిలో మరో 1,200 మంది ఆర్పీలు పని చేస్తున్నారు.
ప్రతి నెల ప్రభుత్వం రూ.4 వేలు, సంఘాలు రూ.2 వేల చొప్పున చెల్లించేలా నిర్ణయం తీసుకున్నారు. మెప్మా ఉద్యోగులు, ఆర్పీలతో సమావేశమైన పురపాలక మంత్రి కేటీఆర్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గౌరవ వేతనాలు పెంచాలని, పట్టణాల్లో విధులు నిర్వహించేటప్పుడు తమకు గుర్తింపు ఉండేలా డ్రెస్ కోడ్, అరోగ్య బీమా కల్పించాలని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. వీరి విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించిన మంత్రి ఆర్పీలకు గౌరవ వేతనాన్ని పెంచుతున్నట్లు ప్రకటించారు. బీమా సౌకర్యంపైనా స్పందించిన ఆయన తదుపరి కార్యాచరణకు పురపాలక శాఖ కమిషనర్‌ను ఆదేశించారు.
వడ్డీలేని రుణాలు విడుదల..
పట్టణాల్లోని మహిళా సంఘాలకు రావాల్సిన వడ్డీ లేని రుణాలు రూ.162 కోట్లను విడుదల చేస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ మొత్తాలను మహిళా సంఘాల పొదుపు ఖాతాల్లో జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్‌ను ఆయన అదేశించారు.
స్వయం సహాయక సంఘాలతో మహిళా సాధికారత జరుగుతుందని, ఆ సంఘాలతో పట్టణా ల్లో గుణాత్మక మార్పు వచ్చిందని తెలిపారు. రాష్ట్రంలోని మహిళా సంఘాల పనితీరు ఇతర రాష్ట్రాలకు అదర్శంగా నిలిచిందన్నారు. మహిళా సంఘాలను బలోపేతం చేస్తూ వారికి సేవలందిస్తున్న రిసో ర్స్ పర్సన్లను ప్రభుత్వం గుర్తిస్తుందని, ఈ మేరకు చాలా కాలంగా వారు కోరుతున్న గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
మెప్మా ఉద్యోగులకు హెచ్‌ఆర్ పాలసీ
మెప్మా ఉద్యోగులకు హెచ్‌ఆర్ పాలసీని ఆమోదిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ఫ్)లో ఎప్పటి నుంచో ఉన్న హెచ్‌ఆర్ పాలసీని తమకూ వర్తింపజేయాలని మెప్మా ఉద్యోగులు కోరుతున్నారు. దీనికి ప్రభుత్వం ఆమోదం తెలపడంతో ఉద్యోగ భద్రత, జీతాల పెంపు, ఏటా ఇంక్రిమెంట్, ఆరోగ్య, జీవిత బీమా సౌకర్యాలు కలుగనున్నాయి. మంత్రి కేటీఆర్ ›నిర్ణయాలు, ప్రకటనలపై ఉద్యోగులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment