దుబ్బాక: ‘మహావృక్షాల కింద పిల్ల మొక్కలకు మనుగడ ఉండద నేది’.. పెద్దలు చెప్పిన మాట. జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గం పరిస్థితి అచ్చూ ఇలాగే ఉంది. మహావృక్షాల్లా అటు సిద్దిపేట.. ఇటు గజ్వేల్ నియోజకవర్గాల నడుమ దుబ్బాక అభివృద్ధి నలిగిపోతోందని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాల ఉత్పత్తికి దుబ్బాక కేంద్ర బిందువు. నాణ్యమైన జున్ను గడ్డి పెరిగే బీడు భూములున్న ప్రాతం. రోజుకు లక్ష లీటర్లకు పైగా పాలను ఉత్పత్తి చేయగల రైతులున్నారు.
పాల ఉత్పత్తిని మెరుగుపరిచే వాతావరణం దుబ్బాక పల్లెల సొంతం. పాల రైతుల కోసం ‘మిల్క్‌గ్రిడ్’ పెడతామని ముఖ్యమంత్రి నోటితో చెప్పినప్పుడు ‘తొలి గ్రిడ్ ఫలం’ ఇక్కడికే తెచ్చి ‘దూద్‌బాక’గా చేస్తారని సంబరపడిపోయారు. కానీ రూ.60 కోట్లతో సిద్దిపేటలో, రూ.30 కోట్లతో గజ్వేల్‌లో మిల్క్‌గ్రిడ్ ఏర్పాటు చేసి దుబ్బాకను విస్మరించడంపై స్థానిక రైతులు, పశుపోషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పాల ఉత్పత్తి సమృద్ధిగా ఉన్న దుబ్బాక నియోజకవర్గం పల్లెల రైతులకు మార్కెటింగ్ చేసే సదుపాయాల్లేక నష్టాలను చవిచూస్తున్నారు. ప్రభుత్వం రైతు సంక్షేమమే లక్ష్యంగా ఎన్నో రకాల పథకాలను ప్రవేశపెట్టి వారి అభివృద్ధి కోసం కృషి చేసినా దుబ్బాక రైతుల నోటికి దుబ్బే దక్కుతోంది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిల్క్‌గ్రిడ్ విధానం ద్వారా పాడి రైతుల కష్టాలు కొంత వరకు తీరే అవకాశం ఉన్నా దుబ్బాక నియోజకవర్గంలో దాని ఊసే లేకపోవడం ప్రజలను బాధిస్తోంది.
వాస్తవానికి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో కలిపి సహజ సిద్ధంగానే రోజుకు లక్ష లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల్లో పట్టణ సంస్కృతి పెరిగి రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా పెరిగిపోయింది. ఊళ్లను ఆనుకొని ఉన్న భూముల ధరలకు రెక్కలొచ్చాయి. రైతులు ధర ఉన్న భూములు అమ్ముకొని ధర లేని చోట భూములు కొనుగోలు చేసి, బోర్లు వేసుకొని మెరుగైన వ్యవసాయం చేసుకుంటున్నారు.
ఇక గజ్వేల్ నియోజకవర్గంలో గడ్డి పెరిగే భూముల కంటే బంగారం పండే భూములే ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ మిల్క్ గ్రిడ్‌లను బలవంతంగా ప్రోత్సహించే బదులు పాల ఉత్పత్తికి అవసరమైన సహజ సిద్ధ వాతావరణం ఉన్న దుబ్బాకలో మిల్క్ గ్రిడ్ ఏర్పాటు చేస్తే ఆశించిన ఫలితాలు వస్తామని పాడిపరిశ్రమ శాఖ అధికారులు చెప్తున్నారు.
ప్రతీ మండలం ఓ ‘పాల’వెల్లి....
దుబ్బాక మండలంలో 12,323 పాడి పశువులు ఉండగా ఒక్కరోజుకు సుమారుగా 35 వేల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. దీంట్లో కేవలం 2 వేల లీటర్లు మాత్రమే విజయ డెయిరీకి అందుతోంది. మిగతావి పల్లెలు, మండల కేంద్రాల్లోని హోటళ్లకు, ఇళ్లకు పాడి రైతులే స్వయంగా తిరిగి విక్రయిస్తున్నారు.
చేగుంట మండలంలో పాలిచ్చే పాడి పశువులు 4,547 ఉండగా సుమారు 12 వేల లీటర్ల పాల ఉత్పత్తి అవుతోంది. దీంట్లో 2 వేల లీటర్లు విజయ డెయిరీ, 800 లీటర్లు హెరిటేజ్, మిగతావి హోటళ్లు, ఇళ్లలో పాడి రైతులు అమ్ముకుంటున్నారు.
దౌల్తాబాద్ మండలంలో 3,347 పాడి పశువులుండగా దాదాపు 10 వేల పాల ఉత్పత్తి జరుగుతోంది. 300 లీటర్ల పాలను విజయ డెయిరీకి అందుతుండగా మిగతావి హోటళ్లకు సరఫరా చేస్తున్నారు.
తొగుట మండలంలో అత్యధికంగా 14,124 పాలిచ్చే పాడి పశువులు ఉన్నాయి. సుమారు 45 వేల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతోంది. 2 వేల పాలను విజయ డెయిరీకి పోస్తున్నారు. మిగతావి హోటళ్లు, ఇళ్లకు, పట్టణ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. తొగుట మండలంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సునందిని పథకం కింద కేవలం 92 దూడలకు మాత్రమే దాణా అందుతుండగా మిగతా వాటికి అందడం లేదు. దీని వల్ల పాడి రైతులు బయట నుంచి దాణాను అధిక ధరకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. నియోజకవర్గంలో మిల్క్‌గ్రిడ్ ఏర్పాటు చేస్తే పాడి రైతుల కష్టాలు కొంత మేరకైనా తీరే అవకాశం ఉంటుంది.
మిల్క్ గ్రిడ్ ఓ వరం....(బాక్స్‌లో వాడగలరు...)
బ్యాంకుల ద్వారా రైతులకు రుణాలిచ్చి పాడిని ప్రోత్సహిస్తారు. ఈ పథకం కింద అర్హులైన ప్రతి రైతుకు రెండు ఆవులు లేదా రెండు గేదెలు ఇస్తారు. దీని విలువ రూ.1.2 లక్షలు ఉంటుంది. సాధారణ రైతులకు 25శాతం, ఎస్సీ, ఎస్టీలకు 33.3శాతం సబ్సిడీ ఉంటుంది. దశల వారీగా పాల ఉత్పత్తిని పెంచుతూ నిర్దేశిత లక్ష్యం చేరుకునేందుకు ప్రయత్నిస్తారు. దీని ద్వారా ఆయా ప్రాంతం వారికి పాలు, పెరుగు పౌష్టికాహారం తక్కువ ధరతోనే అందుబాటులోకి వస్తుంది. ఎదిగే పిల్లలతో పాటు, పాల రైతులకు కూడా మిల్క్ గ్రిడ్ వరంగా మారుతుంది.
దుబ్బాకకు.. దెబ్బే!
Published Fri, Dec 26 2014 10:30 PM | Last Updated on Fri, May 25 2018 5:57 PM
Advertisement