సాక్షి, మహబూబ్‌నగర్ న్యూటౌన్: మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో అందరూ ఊహించినట్లుగానే పోటీ రసవత్తరంగా మారనుంది. పెద్దసంఖ్యలో నామినేషన్లు, దాఖలుకావడం చూస్తుంటే బహుముఖ పోటీ అనివార్యం కానుంది. ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు స్వతంత్రంగా కొందరు టికెట్లు రాని ఆశావాహులు ఆయా పార్టీల నుంచి రెబల్‌గా బరిలో దిగితుండటంతో మహబూబ్‌నగర్ ఎన్నిక ఆసక్తికరంగా మారుతోంది.
జిల్లాలోని 5 నియోజకవర్గాల కంటే అత్యధికంగా మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో 29మంది అభ్యర్థులు, 51సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. పొత్తుల్లో టికెట్లు ఆశించిన వారు ఇతర పార్టీల నుంచి టికెట్లు తెచ్చుకొని నామినేషన్లు దాఖలు చేయగా మరికొందరు స్వతంత్రులుగా బరిలో నిలిచారు. మొదట టీఆర్‌ఎస్ పార్టీ తన అభ్యర్థిని ప్రకటించడంతో ఆ పార్టీ అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్ దాదాపు 60రోజుల నుంచే తన ప్రచారాన్ని కొనసాగించారు.
ప్రజాకూటమిలో భాగంగా ఈ సీటును కాంగ్రెస్, టీడీపీ, తెలంగాణ జనసమితి, తెలంగాణ ఇంటిపార్టీలు పోటాపోటీగా సీటును ఆశించడంతో సమస్య జఠిలంగా మారింది. కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురు అభ్యర్థులు ఒబేదుల్లా కొత్వాల్, టీఆర్‌ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన సయ్యద్ ఇబ్రహీం, టీడీపీ నుంచి వచ్చి చేరిన ఎన్‌పీ వెంకటేశ్, వైఎస్‌ఆర్ పార్టీ నుంచి వచ్చి చేరిన ఎం.సురేందర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఆశించారు.
టీడీపీ నుంచి ఎట్టిపరిస్థితుల్లో తనకే కేటాయించాలని మాజీ ఎమ్మెల్యే ఎం.చంద్రశేఖర్(ఎర్ర శేఖర్) పట్టుబట్టారు. ఆ దిశగా ఆయన మొదటి నుంచే జనాల మధ్యకు దూసుకెళ్లారు. తెలంగాణ జనసమితి నుంచి ఆ పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి పట్టుబట్టారు. దీంతో ఎవరంతట వారు తమకంటే తమకే ఈ సీటు కావాలంటూ కూటమిలో తీవ్ర ఒత్తిడి చేశారు. అదేవిధంగా తెలంగాణ ఇంటిపార్టీ నుంచి యెన్నం శ్రీనివాస్‌రెడ్డి చివరిదాకా ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు ప్రజాకూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎం.చంద్రశేఖర్(ఎర్ర శేఖర్)కు కేటాయించారు.
ఆశావాహుల్లో అసంతృప్తి
దీంతో ఆశావాహుల్లో అసంతృప్తి వెల్లువెత్తింది. కాంగ్రెస్ పార్టీలో సీటు ఆశించిన సురేందర్‌రెడ్డి నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ తరపున, సయ్యద్ ఇబ్ర హీం బహుజన సమాజ్ పార్టీ నుంచి నామినేషన్ వేశారు. యెన్నం శ్రీనివాస్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగితుండగా, ఫ్రెండ్లీ కాంటెస్టింగ్‌లో భాగం గా తెలంగాణ జనసమితి కూడా రాజేందర్‌రెడ్డికి బీ–ఫాం ఇచ్చింది.
దీంతో ఆయన కూడా టీజేఎస్ తరపున సోమవారం నామినేషన్ వేశారు. మొత్తం గా నామినేషన్ల దాఖలు గడువు ముగిసే సమయానికి ఆమ్‌ఆద్మీ పార్టీ తరపున బాబుల్‌రెడ్డి, టీడీపీ నుంచి భవాని, ప్రజాకూటమి నుంచి టీడీపీ అభ్యర్థిగా యం.
చంద్రశేఖర్(ఎర్ర శేఖర్), టీఆర్‌ఎస్ వి.శ్రీనివాస్‌గౌడ్, బీజేపీ జి.పద్మజారెడ్డి, బీజేపీ రెబల్ అభ్యర్థిగా పడాకుల బాల్‌రాజ్, కాంగ్రెస్ టికెట్ ఆశించి పొత్తులో టీడీపీకి కేటాయించడంతో ఎన్‌సీపీ టికెట్‌తో ఎం.సురేందర్‌రెడ్డి, ఫ్రెండ్లీ కాం టెస్టింగ్ టీజేఎస్ అభ్యర్థిగా రాజేందర్‌రెడ్డి, బీఎస్పీ అభ్యర్థిగా సయ్యద్ ఇబ్రహీం, కృష్ణయ్య, బీఎల్‌పీ నుంచి గులాంగౌస్‌తోపాటు స్వతంత్ర అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డితోపాటు మరో 16 మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.
మొత్తంగా మొదటి నుంచి సీట్ల కేటాయింపులో జరిగిన ఉత్కంఠతకు నామినేషన్ల చివరిరోజు వరకు అదే ఉత్కంఠ కొనసాగింది. బహుముఖ పోటీలో పాలమూరు ప్రజలు ఎవరిని ఆదరిస్తారనే విషయం తేలాల్సి ఉంది. పరిశీలన, బుజ్జగింపుల తర్వాత ఎవరెవరు పోరులో ఉంటారనేది తేలాల్సి ఉంది.
ఈ నెల 22న ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత పోటీలో ఉండేదెవరు, ఉపసంహరించుకునేదెవరో తేలాల్సి ఉంది. టికెట్లు ఆశించి భంగపడిన వారు ఇతర పార్టీలను ఆశ్రయించి టికెట్లు తెచ్చుకొని నామినేషన్లు వేయడంతో పోటీ అనివార్యంగా కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment