క్రికెట్‌లో చెలరేగుతున్న బుడతడు
హైదరాబాద్ సిటీ: బ్యాట్ అంత ఎత్తు లేకున్నా క్రికెట్ ఆటలో సంచలనాలు సృష్టిస్తున్నాడు నగరానికి చెందిన బుడతడు. మాటలు రాకముందే బ్యాటింగ్ చేయడం మొదలు పెట్టాడు. ఏడేళ్ల చిన్నోడు క్రికెట్ చూసేవారికి ఔరా అనిపించక మానడు. కొంపల్లిలో అక్టోబర్ 24వ తేదిన నిర్వహించిన అండర్ 14 క్రికెట్ టోర్నమెంట్‌లో యాప్రాల్‌కు చెందిన ఏడేళ్ల విద్యార్థి జశ్వంత్ కు బెస్ట్ ప్లేయర్ సర్టిఫికెట్ సైతం అందుకున్నాడు. 2013లో భవన్స్‌లో నిర్వహించిన అండర్14 క్రికెట్ టోర్నమెంట్‌లో మ్యాన్‌ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచి అందరిని ఆశ్చర్యపరిచాడు.
బుడతడి వివరాల్లొకి వెళ్తే... యాప్రాల్‌కు చెందిన సాయికుమార్ యాదవ్, శ్రీచందనల దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో మొదటి వాడైన జశ్వంత్కుమార్ ఏడాదిన్నరకే నర్సరిలో అడుగెట్టాడు. ఈ చిచ్చరపిడుగు తన రెండవ ఏటనే బ్యాట్ చేత పట్టాడు. జశ్వంత్ ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు అప్పటినుంచే భవన్స్‌లో కోచింగ్ ఇప్పిస్తున్నారు. అదే పాఠశాలలో ఈ చిన్నారి రెండవ తరగతి విద్యార్థి చదువుతున్నాడు. ప్రతిరోజు సాయంత్రం గంటన్నర పాటు క్రికెట్‌లో ఈ బుడతడు తర్ఫీదు పొందుతున్నాడు. ఉదయం వేళల్లో చదువుల బాట, సాయంత్రం వేళల్లో క్రికెట్ బాట పడుతూ ఆటలో చెలరేగిపోతున్నాడు. క్రికెట్‌లో తీసుకోవల్సిన జాగ్రత్తలు.. శిరస్త్రాణం (హెల్మెట్), మొకాళ్లకు ప్యాడ్లు, చేతికి గ్లౌవ్స్ పెట్టుకుని క్రికెట్ ఆడుతుంటాడు. వన్‌డేలు, టెస్ట్ మ్యాచ్‌లు, ట్వంటీ ట్వంటీ మ్యాచ్‌లు ఏకాగ్రతతో చూస్తూ ఆటలోని మెలకువలు నేర్చుకోవడం తన వంతుగా మార్చుకున్నాడు ఈ చిన్నారి. ఈ బుడతడు మున్ముందు క్రికెట్‌లో మరింతగా రాణించాలని ఆశిద్దాం.