
సాక్షి, కేసముద్రం(వరంగల్) : ఎరక్కబోయి ఓ భారీ సర్పం విద్యుత్ స్తంభం ఎక్కింది. జంపర్‌కు తాకడంతో షార్ట్‌సర్క్యూట్ కారణంగా పాము చనిపోవడంతో పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయిన ఘటన గురువారం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. విద్యుత్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని రైల్వేట్రాక్ పక్కనున్న 11 కేవీ విద్యుత్ స్తంభంపై పిట్టలు గూడుకట్టుకున్నాయి.
వాటికోసం పాము స్తంభంపైకి పాకుతూ వెళ్లింది. ఏవీ స్విచ్‌కున్న జంపర్‌ను పాము తగలడంతో షార్ట్ సర్క్యూట్ కారణంగా మృతి చెందింది. మృత్యువాత పడిన పాము జంపర్ వద్ద మెలికలు పడి ఇరుక్కు పోవడంతో సబ్‌సబ్‌స్టేషన్‌లో పవర్ ట్రిప్ అయి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సమస్య ఎక్కడ తలెత్తిందనే విషయం కనుక్కోవడానికి లైన్‌మెన్ శ్రీనివాస్, జేఎల్‌ఎం విజయ్‌కుమార్, లైన్‌ఇన్‌స్పెక్టర్ భాస్కరాచారి చాలా ఇబ్బంది పడ్డారు.
చివరకు స్తంభంపై పాము ఉన్నట్లు గుర్తించి దానిని కర్రతో తొలగించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ఈ ఘటనతో సాయంత్రం 3 నుంచి 3–45 గంటల వరకు కరెంటు నిలిచిపోయింది. మృత్యువాత పడిన పాము సుమారు 6 ఫీట్ల పొడవు ఉందని, జెర్రిగొడ్డుగా గుర్తించినట్లు విద్యుత్ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment