కార్మికులందరికీ సామాజిక భద్రత
కనీస వేతనం కోసం కృషి
డిస్పెన్సరీల పనితీరుపై కమిటీ
కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ
శంభునిపేటలో బీడీ కార్మికుల సదస్సు
కరీమాబాద్/పోచమ్మమైదాన్: కార్మికులందరికీ సామాజిక భద్రత కల్పిస్తామని కేంద్ర కార్మిక, ఉపాధికల్పనా శాఖామంత్రి బండారు ద త్తాత్రేయ అన్నారు. నగరంలోని శంభునిపేట ఆర్‌ఆర్ గార్డెన్స్‌లో సోమవారం సాయంత్రం నిర్వహించిన బీడీ కార్మికుల సదస్సులో మంత్రి మాట్లాడారు. ప్రతి బీడీ కార్మికురాలికి రూ.1000 అందేలా చూస్తానన్నారు. కార్మికుల కోసం లక్ష ఇళ్లు మంజూరు చేస్తామని ఈ సందర్భంగా మంత్రి ప్రకటించారు. బీడీ కార్మికుల కోసం 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు. కార్మికుల పిల్లల చదువుల కోసం రూ.8 కోట్లు మంజూరుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఈఎస్‌ఐ ఆస్పత్రి పని తీరు, మౌలిక సదుపాయూలపై ఓ కమిటీ వేస్తామని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. కార్యక్రమంలో నగర బీజేపీ అధ్యక్షుడు చింతాకుల సునీల్, మాజీ ఎమ్మెల్యేలు ఎం.ధర్మారెడ్డి, మందాడి సత్యనారాయణరెడ్డి, మాజీ మేయర్ టి.రాజేశ్వర్‌రావు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రావు పద్మ, చాడా శ్రీనివాస్‌రెడ్డి, పుప్పాల రాజేందర్, జలగం రంజిత్, దేవేందర్‌రెడ్డి, మండల పరశురాములు, సురేష్, రాంరెడ్డి, గందె నవీన్ పాల్గొన్నారు.
కేంద్రానికి అన్ని రాష్ట్రాలు సమానమే..
కేంద్రం దేశంలోని అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తోందని.. అందులోభాగంగా తెలంగాణ అని బండారు దత్తాత్రేయ అన్నారు. వరంగల్‌లోని ములుగు రోడ్డులోని బీజేపీ నాయకుడు వంగాల సమ్మిరెడ్డి స్వగృహంలో సోమవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం సామాజిక భద్రతకు పెద్దపీట వేస్తోందన్నారు. 40 కోట్ల అసంఘటిత కార్మికులకు యూవిన్ స్మార్ట్ కార్డులను అందజేసి సామాజిక భద్రత కల్పిస్తామన్నారు. తెలంగాణలో ఈసారి పంటలకు గడ్డు పరిస్థితి ఎదురైందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రధానమంత్రి త్వరలో పంటల బీమా పతకాన్ని ప్రవేశపెట్టి.. రైతులు, వారి కుటుంబ సభ్యులను పరిధిలోకి తీసుకవస్తామన్నారు. కేంద్రం వరంగల్‌ను స్మార్ట్ సిటీగా ఎంపిక చేసి తొలి విడతగా రూ. 2 కోట్లు మంజూరు చేసిందన్నారు. 2020 నాటికి అందరికి సొంత ఇళ్లు ఉండాలని లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా హృదయ్ పతకాన్ని తీసుకవచ్చిందని.. అందులో వరంగల్‌ను ఎంపిక చేశారని తెలిపారు. యాదగిరి గుట్ట నుంచి హన్మకొండ వరకు ఫోర్‌లేన్ నేషనల్ హైవే రోడ్‌కు కేంద్ర ప్రభుత్వం రూ. 1900 కోట్టు మంజూరు చేసిందన్నారు. వరంగల్ పార్లమెంట్ స్థానాన్ని బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందన్నారు. వరంగల్‌లోని ఈఎస్‌ఐ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామన్నారు. సమావేశంలో మాజీ మేయర్ డాక్టర్ టి.రాజేశ్వర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు మార్తినేని ధర్మారావు, మందాడి సత్యనారయణ రెడ్డి, బీజేపీ నగర అధ్యక్షుడు చింతాకుల సునిల్, బీజేపీ నాయకులు రావు పద్మ, కనుకుంట్ల రంజిత్ కుమార్, కోమాకుల నాగరాజు, రఘునారెడ్డి, మార్టిన్ లూథర్, జగదీశ్వర్‌లు పాల్గొన్నారు.
సాక్షి కథనానికి స్పందన...
ఈఎస్‌ఐ ఆసుపత్రిలో కానరాని వైద్య సేవలు అనే శీర్షిక ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన కథనంపై కేంద్ర మంత్రి స్పందించారు. ఆస్పత్రిపై సాక్షిలో వచ్చిన కథనం విషయం బీజేపీ నాయకులు తన దృష్టి తీసుకవచ్చారని దీంతో వెంటనే ఆసుపత్రిని సందర్శించాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. కార్యక్రమాలు ఆలస్యం కావడంతో రద్దు చేసుకున్నానని వివరించారు. త్వరలో ఈఎస్‌ఐ ఆసుపత్రిని సందర్శిస్తానని వెల్లడించారు. బయోమెట్రిక్ విధానంతో డాక్టర్‌లు, సిబ్బంది హాజరు నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.