
ఘొల్లుమన్న గద్వాల
సాఫ్ట్‌వేర్ ఉద్యోగి హష్మీ (24) అదృశ్యం విషాదాంతంగా ముగి సింది. ఈ యువకుడు హత్యకు గురయ్యాడని తెలియగానే.....
► సాఫ్ట్‌వేర్ ఉద్యోగి హష్మీ హత్యోదంతం
► అలుముకున్న విషాదఛాయలు శోకసంద్రంలో కుటుంబసభ్యులు
► పరామర్శించిన నాయకులు కంటతడి పెట్టిన స్నేహితులు
తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు.. అల్లారుముద్దుగా పెంచి.. ఉన్నత చదువులు చదివించారు. ఆ యువకుడు అమ్మానాన్న కలలు కన్నట్టుగానే ఉన్నతోద్యోగం సంపాదించాడు. హైదరాబాద్‌లో ఉంటున్నా.. ఇంటికి ఫోన్‌చేయకుండా ఏరోజూ ఉండలేదు. ఉన్నట్టుండి రెండు రోజులుగా ఫోన్ మూగబోయింది. ఇంతలో కొడుకు ఏమయ్యాడోనని తల్లిదండ్రుల్లో కలవరం. బంధువులు, అతడి స్నేహితుల వద్ద ఆరాతీసే క్రమంలో ఓ చేదునిజం.. తమ కుమారుడు ఇక లేడని.. హైదరాబాద్‌లో దారుణహత్యకు గురయ్యాడని తెలుసుకుని తల్లడిల్లిపోయారు. ఇదీ గద్వాలకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి హష్మీ విషాదాంతం..
గద్వాల : సాఫ్ట్‌వేర్ ఉద్యోగి హష్మీ (24) అదృశ్యం విషాదాంతంగా ముగి సింది. ఈ యువకుడు హత్యకు గురయ్యాడని తెలియగానే గద్వాల పట్ట ణం ఘొల్లుమంది. తోటి స్నేహితులు ఉద్వేగానికి లోనయ్యారు. స్థానిక లిం గంబాగ్‌కాలనీలో నివాసముంటున్న పద్మశ్రీ, గగారిన్ దంపతుల ఏకైక కుమారుడు హష్మీ హైదరాబాద్ నగరంలోని టీసీఎస్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఇక తల్లిదండ్రులు గద్వాల పట్టణంలో షూమార్ట్ దుకాణం ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు.
నివాళులర్పించిన నాయకులు
అనంతరం బాధిత కుటుంబ సభ్యులను వివిధ రాజకీయ నాయకులు పరామర్శించారు. మొదట హష్మీ మృతదేహంపై మేనమామ, సీపీఎం నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు మధుపూలమాలలు వేసి నివాళులర్పిం చా రు. జెడ్పీచైర్మన్ బండారి భాస్కర్, మున్సిపల్ చైర్‌పర్సన్ పద్మావతి, సీపీఎం జిల్లా కార్యదర్శి జబ్బార్, టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి కృష్ణమోహన్‌రెడ్డి, వివిధ పార్టీలు, సంఘాల నాయకులు ప్రభాకర్, వెంకటస్వామి, రామన్‌గౌడ్, స్వామిరెడ్డి పూలమాలలు వేశారు. రాత్రి కృష్ణానది ఒడ్డున అంత్యక్రియలు నిర్వహించారు.
జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న స్థానికులు
హష్మీ మరణ వార్త విన్న వెంటనే స్థానికులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో లింగంబాగ్‌కాలనీకి చేరుకున్నారు. సౌమ్యుడిగా అందరితో కలగలుపుగా ఉండేవాడని, వారు తమ జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. బుధవారం సాయంత్రం హష్మీ మృతదేహాన్ని తీసుకుని తల్లిదండ్రు లతోపాటు కుటుంబ సభ్యులు గద్వాలకు చేరుకున్నారు. ‘ఉన్న ఒక్కగానొక్క కుమారుడు మమ్మల్ని విడిచి వెళ్లిపోయాడమ్మా.. అంటూ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. వారంరోజుల క్రితమే సీసీఎల్ కంపెనీ నుంచి మారి టీసీఎస్‌లో ఉద్యోగం చేరాడన్నారు. ఈ సంఘటన స్థానికులను కలచి వేసింది.