పది వేల కోసం చంపేశాడు
► ఏపీ సీపీఎం కార్యదర్శి మధు మేనల్లుడి దారుణహత్య
► డబ్బు కోసం హష్మీని హత్య చేసిన స్నేహితుడు నరేశ్
► చందానగర్ రైల్వే స్టేషన్ అండర్ బ్రిడ్జి వద్ద ఘటన
సాక్షి, హైదరాబాద్: సీపీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి పి.మధు మేనల్లుడు వల్లిపల్లి హష్మీ దారుణహత్యకు గురయ్యాడు. డబ్బుల కోసం స్నేహితుడే అతడిని పాశవికంగా హత్య చేశాడు. మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల్‌కు చెందిన గగరిన్, పద్మశ్రీల కుమారుడు హష్మీ(26) ఎంటెక్ పూర్తి చేశాడు. హెచ్‌సీఎల్‌లో ఉద్యోగం రావడంతో హైదరాబాద్‌కు మకాం మార్చి బల్కంపేటలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. ఈ నెల 19న నానక్‌రాంగూడ వేవ్‌రాక్‌లోని టీసీఎస్ కంపెనీలో ఉద్యోగం రావడంతో చేరాడు. అయితే హష్మీ అద్దెకుంటున్న ఇంటి పక్కనే 20 రోజుల క్రితం ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన పల్నాడు నరేశ్‌కుమార్‌రెడ్డి అద్దెకు దిగాడు. ఐటీఐ చేసి ఎలక్ట్రీషియన్‌గా కొంతకాలం పనిచేసిన నరేశ్ ఆ తర్వాత పని మానేసి జులాయిగా తిరుగుతున్నాడు. అప్పులపాలైన నరేశ్ ఇంటి పక్కనే ఉన్న హష్మీతో పరిచయం పెంచుకున్నాడు.
అసలేం జరిగింది..
సోమవారం సాయంత్రం సైబర్టవర్కు వచ్చిన నరేశ్, హష్మీకి ఫోన్ చేసి ఎక్కడున్నావనగా కూక ట్పల్లి దాటానని చెప్పడంతో వెనక్కి వస్తే ఇద్దరం కలసి వెళదామన్నాడు. దీంతో తిరిగి వచ్చిన హష్మీతో లింగంపల్లిలో స్నేహితుడిని కలసి వెళ్దామని చెప్పాడు. చందానగర్ ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ సమీపంలోని అండర్ బ్రిడ్జికి రాత్రి 8.15 గంటల సమయంలో చేరుకున్న వీళ్లు బైక్ పార్క్ చేసి అవతలివైపు వెళ్లారు. తన స్నేహితుడు రాలేదని నరేశ్ చెప్పడంతో బ్రిడ్జి వద్ద పార్క్ చేసిన బైక్ దగ్గరకు హష్మీ బయలుదేరాడు. అండర్ బ్రిడ్జి కింది నుంచి వెళితే తొందరగా వెళ్తామని నమ్మించి, లోపలికి వెళ్లగానే రూ.పది వేలు ఇవ్వాలని అడిగాడు. అంత డబ్బు లే దని, రూమ్‌కు వెళ్లి మాట్లాడదామన్నాడు. అయినా వినకుండా కిందకు తోసేసి బండరాయితో తలపై బలంగా మోదాడు.
చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత హష్మీ బ్యాగ్, పర్సు, ఏటీఎం కార్డులు, గోల్డ్ చైన్, రూ.600 నగదు, బైక్ తీసుకుని ప్రకాశ్‌నగర్‌లోని స్నేహితుల ఇంటికి వెళ్లాడు. రక్తపు మరకలు చూసి ఇదేంటని స్నేహితులు అడగగా బైక్‌పై నుంచి పడ్డానని చెప్పాడు. డ్రెస్‌ను బీకే బార్ వీధిలోనూ.. పర్సు, బ్యాగ్‌ను మెట్రో వెనకాల పడేశాడు. హష్మీ కాల్‌డేటా ఆధారంగా నిందితుడు నరేశ్ ఆచూకీ తెలుసుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారించారు. రైల్వే అండర్ బ్రిడ్జి కింద మృతదేహాన్ని నిందితుడు చూపించడంతో ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. బుధవారం హష్మీ మృతదేహాన్ని గద్వాలకు తరలించి అంత్యక్రియల్ని పూర్తి చేశారు.
అమ్మ అంటే ఇష్టం.
ఏపీ సీపీఎం కార్యదర్శి మధు బావమరిది కొడుకైన హష్మీకి తల్లి పద్మశ్రీ అంటే ఎనలేని ప్రేమ. ప్రతిరోజు 3, 4 గంటలకోసారి తల్లికి ఫోన్ చేస్తుంటాడని బంధువులు తెలిపారు. 23న మధ్యాహ్నం తల్లితో మాట్లాడిన హష్మీ రాత్రి ఫోన్ చేయలేదు. అతని ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉండటంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు మంగళవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. స్నేహితులు, బంధువుల వద్ద వాకబు చేసినా ఆచూకీ లభించలేదు. హష్మీ హత్యకు గురయ్యాడని బుధవారం ఉదయం తెలుసుకున్న అతని తల్లి షాక్‌కు గురైంది. మరోవైపు హష్మీ హత్యోదంతంతో గద్వాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా, సీపీఎం నేత మధు మాట్లాడుతూ.. హష్మీ హత్య ఎంతో బాధ కలిగించిందని, ఐటీ కారిడార్‌లో ఎంతో మంది ఉద్యోగులు ఉన్నారని, వారికి భద్రత పెంచాలని పోలీసులకు సూచించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.