భర్త చంద్రకాంత్‌తో అక్షిత (ఫైల్)
సాక్షి, కర్ణాటక(జయనగర) : కుటుంబ కలహాలతో సాఫ్ట్‌వేర్ ఇంజినీరు భార్యని దారుణంగా హత్య చేశాడు. ఈ ఘోరం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో భర్త చంద్రకాంత్, అతని స్నేహితుడు రాజ్‌వీర్‌సింగ్‌ను శనివారం సంపంగి రామనగర పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.... శాంతినగరలో సి ల్వర్‌స్టోన్ హోటల్ నిర్వహిస్తున్న చంద్రకాంత్ అనే వ్యక్తి, అక్షిత (30)ను పదేళ్ల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. తరువాత ఆమె ఉద్యోగం మానేసింది. హెబ్బాల సమీపంలోని అపార్టుమెంటులో నివాసముంటున్నారు. వీరికి నాలుగేళ్ల కొడుకు. దంపతులు అప్పుడప్పుడు గొడవపడుతుండేవారు. జనవరి 6వ తేదీన ఇలాగే గొడవ పడగా, చంద్రకాంత్ భార్య గొంతు పిసికి చంపేశాడు. స్నేహితుడు రాజ్‌వీర్‌సింగ్‌ను పిలిపించి రాత్రివేళ ఆమె మృతదేహాన్ని కారులో వేసుకుని తమిళనాడు సరిహద్దులో సూలగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కామనదొడ్డి అటవీప్రాంతంలో మృతదేహాన్ని పడేసి డీజిల్ పోసి దహనం చేశారు. ఆమె ఫోన్‌ను తీసుకుని చంద్రకాంత్ పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లకు వెళ్లాడు.
తల్లిదండ్రుల ఫిర్యాదుతో కదిలిన డొంక
గత కొద్దిరోజులుగా కుమార్తె అక్షితకు ఆమె తల్లిదండ్రులు పలుమార్లు పోన్ చేసినప్పటికీ రీచ్ కాకపోవడంతో అనుమానం వచ్చి జనవరి 23 తేదీన సంపంగిరామనగర పోలీస్‌స్టేషన్‌లో తమ కుమార్తె అదృశ్యమైనట్లు పిర్యాదు చేశారు. అక్షిత, చంద్రకాంత్ ఇద్దరూ అప్పుడప్పుడు గొడవపడే విషయాన్ని పోలీసులకు మృతురాలి తల్లిదండ్రులు తెలిపారు. పోలీసులు ఆమె ఫోన్ ఎక్కడ ఉందోనని చూడగా పంజాబ్, యూపీ, రాజస్థాన్‌లలో సంచరించినట్లు తేలింది. చంద్రకాంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. భార్యకు మరొకరితో అక్రమ సంబంధం ఉండేదని, ఆమె విపరీతంగా మద్యం సేవించేదని, భరించలేక తాను ఆమె ను హత్యచేసినట్లు నిందితుడు విచారణలో చెప్పాడు. అతని మిత్రుడు రాజ్‌వీర్‌సింగ్‌ను కూడా అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment