సూర్యుడికి స్విచ్ వేసినట్లే..!
సోలార్ ప్యానెళ్లు పెట్టుకుంటే.. కరెంటు కోతల్లేకుండా చేసుకోవచ్చుగానీ.. ఏర్పాటుతోనే వస్తుంది చిక్కు. ఉన్న ప్యానెళ్లేమో బోలెడంత బరువున్నాయి. ప్యానెళ్లతోపాటు బ్యాటరీ, ఇన్వర్టర్ వంటివీ అవసరమవుతాయి. ఖరీదు కూడా ఎక్కువే. ఈ ఇబ్బందులన్నింటి వల్లే కాబోలు.. ఇళ్లపై సోలార్ ప్యానెళ్లు తక్కువగా కనిపిస్తున్నాయి. ఇకపై ఈ చికాకులేవీ ఉండవులెండి! ఎందుకంటే.. ఫొటోల్లో కనిపిస్తున్న సోల్‌ప్యాడ్ ప్యానెళ్లు వచ్చేస్తున్నాయి మరి! ఈ ప్యానెల్ ప్రత్యేకతలు ఏమిటంటే.. ఇది ఆల్ ఇన్ వన్! ఇన్వర్టర్, బ్యాటరీ, ప్యానెళ్లు అన్నీ కలగలిపి వస్తాయి.
అలాగే అవసరానికి తగినంత విద్యుత్తును మాత్ర మే సరఫరా చేయడం మిగిలినదాన్ని బ్యాటరీల్లో నిల్వ చేయడం ఆటోమేటిక్‌గా ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్ సాయంతో జరిగిపోతుంటుంది. ఇంట్లోని ఏయే ఎలక్ట్రిక్ పరికరాలకు సోలార్ విద్యుత్తు వాడాలన్నదాన్ని కూడా మనమే స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ సాయంతో నిర్ణయించుకోవచ్చు. కావాల్సినప్పుడు మార్చుకోవచ్చు. ఇది కాకుంటే.. సోల్ కంట్రోల్ పేరుతో ఈ కంపెనీ తయారు చేసిన ఒక్కో స్మార్ట్ గాడ్జెట్‌ను వాడుకోవచ్చు. ఇది మనం తరచూ ఆన్/ఆఫ్ చేసే పరికరాలను పరిగణనలోకి తీసుకుని వేటికి సోలార్ ఎనర్జీ అందించాలో నిర్ణయిస్తుంది.
ప్యానెల్ వెనుకన ఉండే యూఎస్‌బీ పోర్ట్స్ ద్వారా ల్యాప్‌టాప్‌లు, మొబైళ్లకు నేరుగా చార్జ్ చేసుకునే అవకాశముంది. ఒక్కో ప్యానెల్‌ను కావాల్సిన చోటికి తీసుకెళ్లవచ్చు. బరువు 12 కిలోలు మాత్రమే. ఎక్కువ విద్యుత్తు అవసరమైతే.. ఒకటి కంటే ఎక్కువ ప్యానెళ్లను జత చేసుకునే ఏర్పాట్లున్నాయి. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన కంపెనీ తయారు చేస్తున్న ఈ ప్యానెళ్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తు కూడా ఎక్కువేనని అంచనా.