Inverter
-
సూర్యుడికి స్విచ్ వేసినట్లే..!
సోలార్ ప్యానెళ్లు పెట్టుకుంటే.. కరెంటు కోతల్లేకుండా చేసుకోవచ్చుగానీ.. ఏర్పాటుతోనే వస్తుంది చిక్కు. ఉన్న ప్యానెళ్లేమో బోలెడంత బరువున్నాయి. ప్యానెళ్లతోపాటు బ్యాటరీ, ఇన్వర్టర్ వంటివీ అవసరమవుతాయి. ఖరీదు కూడా ఎక్కువే. ఈ ఇబ్బందులన్నింటి వల్లే కాబోలు.. ఇళ్లపై సోలార్ ప్యానెళ్లు తక్కువగా కనిపిస్తున్నాయి. ఇకపై ఈ చికాకులేవీ ఉండవులెండి! ఎందుకంటే.. ఫొటోల్లో కనిపిస్తున్న సోల్ప్యాడ్ ప్యానెళ్లు వచ్చేస్తున్నాయి మరి! ఈ ప్యానెల్ ప్రత్యేకతలు ఏమిటంటే.. ఇది ఆల్ ఇన్ వన్! ఇన్వర్టర్, బ్యాటరీ, ప్యానెళ్లు అన్నీ కలగలిపి వస్తాయి. అలాగే అవసరానికి తగినంత విద్యుత్తును మాత్ర మే సరఫరా చేయడం మిగిలినదాన్ని బ్యాటరీల్లో నిల్వ చేయడం ఆటోమేటిక్‌గా ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ సాయంతో జరిగిపోతుంటుంది. ఇంట్లోని ఏయే ఎలక్ట్రిక్ పరికరాలకు సోలార్ విద్యుత్తు వాడాలన్నదాన్ని కూడా మనమే స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ సాయంతో నిర్ణయించుకోవచ్చు. కావాల్సినప్పుడు మార్చుకోవచ్చు. ఇది కాకుంటే.. సోల్ కంట్రోల్ పేరుతో ఈ కంపెనీ తయారు చేసిన ఒక్కో స్మార్ట్ గాడ్జెట్‌ను వాడుకోవచ్చు. ఇది మనం తరచూ ఆన్/ఆఫ్ చేసే పరికరాలను పరిగణనలోకి తీసుకుని వేటికి సోలార్ ఎనర్జీ అందించాలో నిర్ణయిస్తుంది. ప్యానెల్ వెనుకన ఉండే యూఎస్బీ పోర్ట్స్ ద్వారా ల్యాప్‌టాప్‌లు, మొబైళ్లకు నేరుగా చార్జ్ చేసుకునే అవకాశముంది. ఒక్కో ప్యానెల్‌ను కావాల్సిన చోటికి తీసుకెళ్లవచ్చు. బరువు 12 కిలోలు మాత్రమే. ఎక్కువ విద్యుత్తు అవసరమైతే.. ఒకటి కంటే ఎక్కువ ప్యానెళ్లను జత చేసుకునే ఏర్పాట్లున్నాయి. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన కంపెనీ తయారు చేస్తున్న ఈ ప్యానెళ్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తు కూడా ఎక్కువేనని అంచనా. -
మానసిక వికలాంగుల కేంద్రానికి చేయూత
స్వర్ణభారత్ మేనేజింగ్ డైరెక్టర్ ఐ.దీపావెంకట్ వెంకటాచలం : మానసిక వికలాంగుల కేంద్రానికి స్వర్ణభారత్ ట్రస్ట్ చేయూతనిస్తుందని ఆ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ ఐ.దీపావెంకట్ అన్నారు. దీపావెంకట్ కుమారుడు విష్ణు జన్మదినం సందర్భంగా వెంకటాచలంలోని సెయింట్ జ్యూడ్స్ మానసిక వికలాంగుల కేంద్రాన్ని మంగళవారం సందర్శించారు. రూ.25వేల విలువ చేసే ఇన్వర్టర్ను, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు కేంద్రానికి బహూకరించారు. మానసిక వికలాంగులకు అరటి పండ్లు, తినుబండరాలను పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ స్వర్ణభారత్ ట్రస్ట్ పక్కనే ఉన్న మానసిక వికలాంగుల కేంద్రంలో నా కుమారుడు విష్ణు జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. మానసిక వికలాంగుల కేంద్రానికి స్వర్ణభారత్ ట్రస్ట్ తరపున చేయూత నిస్తామని తెలియజేశారు. స్వర్ణభారత్ ట్రస్ట్ డైరెక్టర్ కోటేశ్వరరావు, కోఆర్డినేటర్ జనార్దన్‌రాజు, బీజేపీ ఎస్సీసెల్ రాష్ట్ర నాయకులు ఆరుముళ్ల మురళి పాల్గొన్నారు. -
ఇన్వర్టర్తో ఏసీ అవుతుంది డీసీ!
హౌ ఇట్ వర్క్స్ ఇన్వర్టర్ల గురించి మీరు వినే ఉంటారు. కరెంటు కోతల కాలంలో మనల్ని వేసవి తాపం నుంచి ఎంతో కొంత ఆదుకునేవి ఇవే. బాగానే ఉంది కానీ... ఇవి ఏ కరెంటు వాడతాయో మీకు తెలుసా? డీసీ లేదా డెరైక్ట్ కరెంట్. మరి ఇళ్లల్లోని ఇతర పరికరాలన్నీ వాడే కరెంటు ఏది? ఆల్టర్నేటింగ్ కరెంట్ అలియాస్ ఏసీ! ఈ రెంటికీ తేడా ఏమిటన్నదేనా మీ సందేహం. సాంతం చదివేయండి. మీకే అర్థమై పోతుంది. ఏసీ, డీసీల గురించి తెలుసుకునే ముందు కరెంటును అర్థం చేసుకుందాం. చిట్టి చీమలు ఒకే వరుసలో కదులుతూంటాయి చూశారా? పరమాణువుల్లోని ఎలక్ట్రాన్లు ఇలా ఒక దిశలో కదిలే ప్రవాహాన్ని కరెంటు అంటారు. దీన్నే డెరైక్ట్ కరెంట్ అని కూడా పిలుస్తారు. ఇలా కాకుండా ఈ ఎలక్ట్రాన్ల ప్రవాహం సెకనుకు యాభై, అరవైసార్లు తన దిశను మార్చుకుంటూ ఉందనుకుందాం. దాన్ని ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటారు. డీసీ కరెంట్‌ను సుప్రసిద్ద శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్ ఆవిష్కరిస్తే... నికోలా టెస్లా ఏసీ కరెంట్‌ను కనుక్కున్నారు. ప్రపంచం మొత్తానికి విద్యుత్తును ఏ పద్ధతిలో ప్రసారం చేయాలన్న విషయం వచ్చినప్పుడు వీరిద్దరూ పోటీపడినా చివరకు బ్యాటరీల వంటి చిన్నస్థాయి పరికరాల్లో డీసీ... ఇళ్లు, భవంతులు, సుదూర ప్రాంతాల ప్రసారానికి ఏసీ కరెంట్ వాడటం మొదలైంది. రెండు రకాల కరెంట్ల మధ్య వ్యత్యాసం ఇదీ. ఇక ఏసీని డీసీగా, డీసీని ఏసీగా మార్చే ఇన్వర్టర్లు ఎలా పనిచేస్తాయో చూద్దాం... ఏసీ కరెంట్‌లో ఎలక్ట్రాన్లు సెకనుకు యాభై అరవైసార్లు దిశ మార్చుకుంటాయని చెప్పుకున్నాం కదా... ఈ మార్పులను మళ్లీ దాని వ్యతిరేక దిశలోకి మారిస్తే అది డీసీ అవుతుందన్నమాట. ఇంకోలా చెప్పాలంటే మీరు ప్రతిసెకనులో కుడి, ఎడమలకు 50 - 10 అడుగులు వేయగలరనుకుందాం. ఇన్వర్టర్ ఏం చేస్తుందంటే కుడివైపు వేసిన అడుగును మళ్లీ వ్యతిరేకదిశలోకి మారుస్తుంది. అలాగే ఎడమవైపు అడుగును కూడా. దీనివల్ల ఏసీ కరెంట్‌లో దిశమార్పిడి అన్నది లేకుండాపోయి ఎలక్ట్రాన్లన్నీ ఒకవైపునకు ప్రవహించడం మొదలవుతుంది. ఈ పనిచేసేందుకు ఇన్వర్టర్లలో విద్యుదుయస్కాంత స్విచ్‌లు ఉంటాయి. కరెంట్పోయినప్పుడు మనం ఇంట్లో వాడే పరికరంలో ఒక ఇన్వర్టర్తోపాటు ఒక బ్యాటరీ కూడా ఉంటుంది. కరెంట్ ఉన్నప్పుడు ఏసీని డీసీగా మార్చుతూ బ్యాటరీలోకి చేరుతూ ఉంటుంది. కరెంట్ పోయినప్పుడు బ్యాటరీలోని డీసీ కరెంట్ ఏసీగా మారిపోయి ఇంట్లో వెలుగులు పంచుతుంది. -
అన్ని పరీక్ష కేంద్రాల్లో జనరేటర్లు కోర్టుకు తెలిపిన విద్యామండలి
ముంబై: మార్చిలో జరగనున్న పదో తరగతి పరీక్షల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 231 పరీక్ష కేంద్రాలకు పవర్ జనరేటర్లను, ఇన్వర్టర్లను అందించిందని రాష్ట్ర మాధ్యమిక, ఉన్నత విద్యా మండలి హైకోర్టుకు తెలిపింది. బోర్డుకు చెందిన అధికారులు ఇటీవల అన్ని పరీక్ష కేంద్రాలను సందర్శించి, జనరేటర్లు, ఇన్వర్టర్లును తనిఖీ చేశారని పేర్కొంది. విద్యుత్ కోతల వల్ల విద్యార్థులు చీకట్లో పరీక్షలు రాయాల్సి వస్తోందని విష్ణు గవలి అనే సామాజిక కార్యకర్త హైకోర్టులో ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. దీంతో పరీక్షలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపథ్యంలో శుక్రవారం జస్టిస్ అభయ్ నేత ృత్వంలోని ధర్మాసనానికి బోర్డు ఈ విషయం తెలిపింది. విద్యుత్ కోతల వల్ల విద్యార్థులు చీకటిలో పరీక్షలు రాయాల్సివస్తోందని, అన్ని పరీక్ష కేంద్రాల్లో యుద్ధ ప్రాతిపదికన జనరేటర్లు ఏర్పాటు చేయాలని కోర్టు జులైలో ఆదేశించడంతో ప్రభుత్వంలో చలనం మొదలైంది. అయితే 18 పరీక్షా కేంద్రాల్లో వాటిని ఏర్పాటు చేయలేద ని విద్యామండలి కోర్టుకు విన్నవించింది. దీంతో పరీక్ష కేంద్రాల్లో విద్యుత్ పరికరాలు ఏర్పాటు చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని కోర్టు హెచ్చరించింది. కేంద్రాల్లో విద్యుత్ కోతల సమస్యను 2008లో కోర్టుకు విన్నవించానని, కోర్టు దాన్ని పిల్‌గా స్వీకరించిందని విష్ణు గవలి తెలిపారు. 2009 ఫిబ్రవరిలో హైకోర్టు ప్రభుత్వానికి అన్ని కేంద్రాల్లో 40వేలకు పైగా జనరేటర్లు ఏర్పాటుచేయాలని నిర్దేశించిందని తెలిపారు. అలాగే పరీక్షల సమయంలో విద్యుత్ కోతలు విధించొద్దంటూ రాష్ట్ర విద్యుత్ బోర్డుకు ఆదేశించింది. -
ఆరోపణలున్న వ్యక్తికే అందలమా..?
సాక్షి, హన్మకొండ : అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తినే విచారణ అధికారి పోస్టులో నియమించేందుకు పైరవీలు సాగుతున్నాయి. తెలంగాణ ఉపముఖ్యమంత్రి డాక్టర్ టి.రాజయ్య నిర్వహిస్తున్న వైద్య, ఆరోగ్య శాఖలోనే ఇలాంటి పోస్టింగ్ పైరవీలు తీవ్రంగా జరుగుతుండడం చర్చనీయాంశమైంది. వైద్య ఆరోగ్యశాఖ వరంగల్ రీజనల్ డెరైక్టర్(ఆర్డీహెచ్)గా ప్రస్తుతం కొనసాగుతున్న డాక్టర్ మాణిక్యరావు ఈ నెల 30న ఉద్యోగ విరమణ చేయబోతున్నారు. మరో రెండు రోజుల్లో ఖాళీ కానున్న ఈ కీలకమైన పోస్టులో ప్రభుత్వం ఎవరిని నియమిస్తుందనేది ఇప్పుడు వైద్య శాఖలో ఆసక్తికరంగా మారింది. వరంగల్ వైద్య ఆరో గ్య శాఖ రీజినల్ డెరైక్టర్ పరిధిలో వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలు ఉంటాయి. కీలకమైన ఈ పోస్టు కోసం జిల్లా వైద్య శాఖ అధికారిగా పనిచేస్తున్న డాక్టర్ పి. సాంబశివరావు ప్రయత్నిస్తున్నారు. గత ఐదేళ్లు గా ప్రజాప్రతినిధిగా ఉన్న ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి రాజయ్యతో ఉన్న పరిచయాలతో ఈ ప్రయత్నా లు ఊపందుకున్నాయని వైద్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. డాక్టర్ పి.సాంబశివరావుపై పలు అవినీతి ఆరోపణలు విచారణ దశలో ఉండడంతో ఈ పోస్టు విషయంలో ఉప ముఖ్యమంత్రి నిర్ణయం ఎలా ఉంటుందనేది మరో మూడు రోజుల్లో తేలనుంది. ఆరోపణలపై విచారణ.. మన జిల్లాలో 62 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. 2012 డిసెంబరులో ప్రతి ఆరోగ్య కేంద్రానికి రెండు చొప్పున ఇన్వర్టర్లు కొనుగోలు చేశారు. ఒక్కో ఇన్వర్టర్కు రూ.40 వేలు చెల్లించారు. ఇన్వర్టర్ల కొనుగోలు విషయంలో అక్రమాలు జరిగాయని, ప్రభుత్వ నిధులు దు ర్వినియోగమయ్యాయని ఆరోపణలు వచ్చా యి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా డాక్టర్ పి.సాంబశివరావు ఉన్నప్పుడే ఇన్వర్టర్ల కొనుగోలు ప్రక్రియ అంతా జరిగింది. ఎస్సీ, ఎస్టీ జిల్లా అసోసియేషన్‌తోపాటు పలువురు వ్యక్తులు ఈ అంశంపై 2013లో ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై విచారణ చేపట్టాలంటూ ఆందోళనలు జరిగాయి. 2013 జులైలో అప్పటి ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి జిల్లాకు వచ్చి దీనిపై విచారణకు ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ రీజనల్ డెరైక్టర్ మాణిక్యరావును విచారణ అధికారిగా నియమించారు. ఇందుకు సంబంధించిన విచారణ సైతం పూర్తయింది. రెండు రోజుల్లో ఈయన ఉద్యోగ విరమణ చేస్తున్నా.. విచారణ నివేదికను వెల్లడించకపోవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో ప్రస్తుత జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిగా ఉన్న డాక్టర్ పి.సాంబశివరావు రీజినల్ డెరైక్టర్ పోస్టు కోసం ప్రయత్నిస్తున్నారు. సాంబశివరావును రీజినల్ డెరైక్టర్ పోస్టులో నియమిస్తే... అక్రమాలపై విచారణ అంశాన్ని పక్కనబెట్టినట్లే అవుతుందని వైద్య శాఖలో చర్చ జరుగుతోంది. రీజినల్ డెరైక్టర్ పోస్టు కోసం ప్రయత్నిస్తున్న ప్రస్తుత జిల్లా వైద్య అధికారి... విచారణ నివేదిక వెలుగుచూడకుండా చేస్తున్నారని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కీలకమైన రీజినల్ డెరైక్టర్ పోస్టులో ప్రభుత్వం ఎవరిని నియమిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. -
షార్ట్‌సర్క్యూట్‌తో షాపు దగ్ధం
జగిత్యాల, న్యూస్‌లైన్ : జగిత్యాల యావర్‌రోడ్డు క్లబ్ కాంప్లెక్స్‌లో నిర్వహిస్తున్న స్నేహ వీడియో మిక్సింగ్ దుకాణంలో షార్ట్‌సర్క్యూట్ జరిగి సామగ్రి కాలిపోయింది. రూ.8.50లక్షల నష్టం వాటిల్లింది. మిక్సింగ్ యూనిట్ యజమాని లింగం సత్యనారాయణ హైదరాబాద్‌లో ఉంటున్నాడు. దుకాణాన్ని పెంట సత్యనారాయణ నిర్వహిస్తున్నారు. ఎప్పటిలాగే పెంట సత్యనారాయణ ఆదివారం రాత్రి షాపు మూసి ఇంటికెళ్లాడు. మిక్సింగ్ యూనిట్లో ఉన్న ఇన్వర్టర్తో షార్ట్‌సర్క్యూట్ జరిగి నాలుగు కంప్యూటర్లు, మూడు వీడియో కెమెరాలు, రెండు ఫొటో కెమెరాలు, కలర్, బ్లాక్ అండ్‌వైట్ జిరాక్స్ మిషన్లు, పెళ్లి అల్బమ్లు, 70-80 పెళ్లి సీడీలతోపాటు మిక్సింగ్ చేసే ఇతర సామగ్రి, ఫర్నిచర్ పూర్తిగా కాలిపోయింది. సోమవారం వేకువజామున షాపు శుభ్రం చేసే వ్యక్తి రాగా, పొగరావడం గమనించి పక్కనే ఉన్న మరోషాపు యజమాని జాన్సన్‌కు చెప్పాడు. ఆయన వచ్చి చూసి అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ ద్వారా సమాచారం చేరవేశాడు. కానీ అప్పటికే సామగ్రి బుగ్గిపాలయ్యింది. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు నిర్వాహకుడు తెలిపారు.