సాక్షి, హన్మకొండ : అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తినే విచారణ అధికారి పోస్టులో నియమించేందుకు పైరవీలు సాగుతున్నాయి. తెలంగాణ ఉపముఖ్యమంత్రి డాక్టర్ టి.రాజయ్య నిర్వహిస్తున్న వైద్య, ఆరోగ్య శాఖలోనే ఇలాంటి పోస్టింగ్ పైరవీలు తీవ్రంగా జరుగుతుండడం చర్చనీయాంశమైంది. వైద్య ఆరోగ్యశాఖ వరంగల్ రీజనల్ డెరైక్టర్(ఆర్‌డీహెచ్)గా ప్రస్తుతం కొనసాగుతున్న డాక్టర్ మాణిక్యరావు ఈ నెల 30న ఉద్యోగ విరమణ చేయబోతున్నారు.
మరో రెండు రోజుల్లో ఖాళీ కానున్న ఈ కీలకమైన పోస్టులో ప్రభుత్వం ఎవరిని నియమిస్తుందనేది ఇప్పుడు వైద్య శాఖలో ఆసక్తికరంగా మారింది. వరంగల్ వైద్య ఆరో గ్య శాఖ రీజినల్ డెరైక్టర్ పరిధిలో వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలు ఉంటాయి. కీలకమైన ఈ పోస్టు కోసం జిల్లా వైద్య శాఖ అధికారిగా పనిచేస్తున్న డాక్టర్ పి. సాంబశివరావు ప్రయత్నిస్తున్నారు.
గత ఐదేళ్లు గా ప్రజాప్రతినిధిగా ఉన్న ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి రాజయ్యతో ఉన్న పరిచయాలతో ఈ ప్రయత్నా లు ఊపందుకున్నాయని వైద్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. డాక్టర్ పి.సాంబశివరావుపై పలు అవినీతి ఆరోపణలు విచారణ దశలో ఉండడంతో ఈ పోస్టు విషయంలో ఉప ముఖ్యమంత్రి నిర్ణయం ఎలా ఉంటుందనేది మరో మూడు రోజుల్లో తేలనుంది.
ఆరోపణలపై విచారణ..
మన జిల్లాలో 62 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. 2012 డిసెంబరులో ప్రతి ఆరోగ్య కేంద్రానికి రెండు చొప్పున ఇన్వర్టర్లు కొనుగోలు చేశారు. ఒక్కో ఇన్వర్టర్‌కు రూ.40 వేలు చెల్లించారు. ఇన్వర్టర్ల కొనుగోలు విషయంలో అక్రమాలు జరిగాయని, ప్రభుత్వ నిధులు దు ర్వినియోగమయ్యాయని ఆరోపణలు వచ్చా యి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా డాక్టర్ పి.సాంబశివరావు ఉన్నప్పుడే ఇన్వర్టర్ల కొనుగోలు ప్రక్రియ అంతా జరిగింది. ఎస్సీ, ఎస్టీ జిల్లా అసోసియేషన్‌తోపాటు పలువురు వ్యక్తులు ఈ అంశంపై 2013లో ఫిర్యాదు చేశారు.
ఈ అంశంపై విచారణ చేపట్టాలంటూ ఆందోళనలు జరిగాయి. 2013 జులైలో అప్పటి ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి జిల్లాకు వచ్చి దీనిపై విచారణకు ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ రీజనల్ డెరైక్టర్ మాణిక్యరావును విచారణ అధికారిగా నియమించారు. ఇందుకు సంబంధించిన విచారణ సైతం పూర్తయింది. రెండు రోజుల్లో ఈయన ఉద్యోగ విరమణ చేస్తున్నా.. విచారణ నివేదికను వెల్లడించకపోవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదే సమయంలో ప్రస్తుత జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిగా ఉన్న డాక్టర్ పి.సాంబశివరావు రీజినల్ డెరైక్టర్ పోస్టు కోసం ప్రయత్నిస్తున్నారు. సాంబశివరావును రీజినల్ డెరైక్టర్ పోస్టులో నియమిస్తే... అక్రమాలపై విచారణ అంశాన్ని పక్కనబెట్టినట్లే అవుతుందని వైద్య శాఖలో చర్చ జరుగుతోంది. రీజినల్ డెరైక్టర్ పోస్టు కోసం ప్రయత్నిస్తున్న ప్రస్తుత జిల్లా వైద్య అధికారి... విచారణ నివేదిక వెలుగుచూడకుండా చేస్తున్నారని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కీలకమైన రీజినల్ డెరైక్టర్ పోస్టులో ప్రభుత్వం ఎవరిని నియమిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
ఆరోపణలున్న వ్యక్తికే అందలమా..?
Published Sat, Jun 28 2014 5:48 AM | Last Updated on Tue, Oct 9 2018 7:11 PM
Advertisement