T.rajayya
-
అన్నం చూసేందుకు మెతుకును ఒత్తారు
మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య హన్మకొండ: ‘టీఆర్ఎస్ పాలన పారదర్శకంగా సాగుతోందని చెప్పే పరీక్షలో నేను అన్నం మెతుకును అయ్యాను. అన్నం ఎలా ఉందో పరీక్షించేందుకు మెతుకును ఒత్తుతారు’ అని మాజీ డిప్యూటీ సీఎం టి.రాజయ్య వ్యాఖ్యానించారు. వరంగల్ జిల్లా హన్మకొండలోని తన నివాసంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘అన్నం ఉడికిందీ.. లేనిదీ.. తెలుసుకోవడానికి ఒక మెతుకును ఒత్తి చూస్తారు. ఆ మెతుకును నేను అయినందుకు గర్వపడుతున్నా’ అని అన్నారు. సీఎం కేసీఆర్ కలలుగన్న ఆరోగ్య తెలంగాణ కోసం వైద్య మంత్రిగా శ్రమించానని పేర్కొన్నారు. ఏజెన్సీ ప్రాంతాలు, ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, ఆస్పత్రుల ద్వారా మేలైన వైద్య సేవలందించి ఆరోగ్య తెలంగాణ ఏర్పాటుకు కృషి చేశానన్నారు.‘కేసీఆర్ కల్పించిన అవకాశంతో ఉద్యమంలో 87 నియోజకవర్గాలు పర్యటించాను. వారి అంచనా మేరకు పని చేయడంతో గుర్తించి తెలంగాణ తొలి డిప్యూటీ సీఎంగా అవకాశం కల్పించారు. నా వ్యక్తిత్వంపై, దళితుల ఆత్మగౌరవం దెబ్బతినేలా విమర్శలు రావడం వల్ల తీవ్ర మనస్తాపానికి గురయ్యాను. తెలంగాణ పునర్నిర్మాణంలో, బంగారు తెలంగాణలో భాగస్వామినవుతాను’ అని అన్నారు. -
ఆరోగ్య శాఖలో అవినీతిపై విచారణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖను ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల వెలుగుచూసిన పలు అక్రమాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపితే ఎవరి భాగస్వామ్యం ఎంత ఉందన్న విషయం బయటకు వస్తుందని ప్రభుత్వ పెద్దలు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి టి.రాజయ్యను బర్తరఫ్ చేయడం రాజకీయంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో, ఈ అంశంపై విపక్షాలు చేస్తున్న విమర్శలకు సరైన సమాధానం ఇవ్వాలని, ఈ విషయాన్ని రాజకీయం చేస్తున్నవాళ్ల నోళ్లు మూయించాలని భావిస్తున్న ప్రభుత్వ పెద్దలు విచారణకు ఓ కమిటీని వేసి దాని బాధ్యతలను ఓ సీనియర్ ఐఏఎస్‌కు అప్పగించాలని యోచిస్తోంది. రాజయ్య ఏం తప్పు చేశారో చెప్పకుండా ఏకపక్షంగా ఎలా బర్తరఫ్ చేస్తారన్న టీడీపీ, కాంగ్రెస్ నేతల విమర్శల నేపథ్యంలో విచారణ కమిటీ ఏర్పాటుకు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. పదవి నుంచి ఉద్వాసనకు గురైన రాజయ్య సైతం తనను తొలగించిన మొదటిరోజు రాత్రే మీడియాతో మాట్లాడుతూ ఎలాంటి విచారణకైనా సిద్ధమేనని, తప్పు తేలితే ఏ శిక్షకైనా వెనుకాడనని ప్రకటించారు. మంగళవారం గుండెనొప్పితో అస్వస్థతకు గురైన రాజయ్య, ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక కూడా విలేకరుల వద్ద ఇదే అంశాన్ని మళ్లీ ప్రకటించారు. ప్రభుత్వం అవినీతికి వ్యతిరేకంగా ఎంత నిక్కచ్చిగా ఉం దో తేల్చి చెప్పాలన్న వ్యూహంలో భాగంగానే కమిటీ ఆలోచనకు వచ్చినట్లు చెబుతున్నారు. -
నేనెలాంటి తప్పూ చేయలేదు
దేవుడి సాక్షిగా చెబుతున్నా: రాజయ్య తప్పు చేసినట్లు నిరూపణ అయితే ఏ శిక్షకైనా సిద్ధం.. సాక్షి, హైదరాబాద్: ‘ఏసు ప్రభువును నమ్మిన బిడ్డగా.. నేను ఎలాంటి తప్పూ చేయలేదు. తప్పు చేసినట్లు నిరూపణ అయితే ఏ శిక్ష కైనా సిద్ధం. ముఖ్యమంత్రిగా, టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కె.చంద్రశేఖర్‌రావు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నాను’’ అని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన టి.రాజయ్య పేర్కొన్నారు. ఆదివారం రాజయ్యను కేబినెట్ నుంచి తప్పించి, ఆ స్థానంలో కడియం శ్రీహరిని డిప్యూటీ సీఎంగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తర్వాత హైదరాబాద్‌లోని తన క్వార్టర్ నుంచి బయటకు రాని రాజయ్య... రాత్రి పది గంటల సమయంలో అత్యవసరంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, ఈ అంశంపై మాట్లాడారు. ‘‘సీఎం కే సీఆర్ తండ్రిలా ప్రోత్సహించారు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్‌తో మాత్రమే సాధ్యమని కాంగ్రెస్‌ను వదులుకుని వచ్చి ఆయన నాయకత్వంలో పనిచేశాను. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను. నేను ఊహించని రీతిలో ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. ఈ ఏడు నెలల కాలంలో ఎంతో సహకారం అందించారు..’’ అని చెప్పారు. వైద్య, ఆరోగ్యశాఖ ప్రక్షాళన, క్షేత్ర స్థాయిలో ప్రజలతో మమేకం కావడం కోసం ఎంతో కృషి చేశానన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో హాస్పిటల్ బేస్డ్ బడ్జెట్ కేటాయించారన్నారు. కేసీఆర్ లక్ష్యం, ఆరోగ్య తెలంగాణకు అనుగుణంగా ఆసుపత్రుల రూపురేఖలు మారేలా కృషి చేశానని, వీటి ఫలితాలు త్వరలోనే అందుతాయని తెలిపారు.వైద్య, ఆరోగ్య శాఖకు వన్నె తెచ్చేందుకు ప్రయత్నించానని, తనకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాన ని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో తప్పులు.. వైద్య ఆరోగ్య శాఖలో క్షేత్రస్థాయిలో తప్పులు జరిగాయని.. అధికారులు తప్పులు చేస్తున్నారని పసిగట్టి సీఎం ఒక నిర్ణయం తీసుకున్నారని రాజయ్య వ్యాఖ్యానించారు. మరో పెద్ద పొరపాటు జరగకుండా బంగారు తెలంగాణ కోసం పారదర్శకంగా ఉండాలని సీఎం నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని.. తెలంగాణ పున ర్నిర్మాణంలో కూలీగా, పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా పనిచేస్తానని తెలిపారు. వైద్య, ఆరోగ్య శాఖకు చెందిన అన్ని స్థాయిల ఉద్యోగులను ఏమైనా బాధపెట్టి ఉంటే క్షమించాలని కోరారు. -
చావు బతుకుల్లో..!
కేర్‌లో ఉపముఖ్యమంత్రి ఎస్కార్ట్ ప్రమాద బాధితుల దైన్యం ఒకరి పరిస్థితి విషమం..కదల్లేని పరిస్థితుల్లో మరొకరు రూ.1.90 లక్షల బిల్లు చెల్లించాలని ఆస్పత్రి వర్గాల ఒత్తిడి సాక్షి, హైదరాబాద్: ఇటీవల జనగాం సమీపంలో తెలంగాణ ఉపముఖ్యమంత్రి టి.రాజయ్య ఎస్కార్ట్‌లోని వాహనం ప్రమాదవశాత్తు కారును ఢీకొన్న ఘటనలో గాయపడిన బాధితులు బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. చికిత్స ఖర్చంతా తామే భరిస్తామని హామీ ఇచ్చిన మంత్రి వారి వైపు కన్నెత్తి చూడకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఇప్పటి వరకు అయిన ఖర్చులన్నీ బాధితులే చెల్లించాలని, లేదంటే వైద్య సేవలు నిలిపివేస్తామని ఆస్పత్రి వర్గాలు ఒత్తిడి తెస్తుండటంతో తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నల్లగొండ జిల్లాకు చెందిన నయిముల్లాఖాన్(58) కుటుంబ సభ్యులతో నవంబర్ 30న వరంగల్ నుంచి నల్లగొండవైపు వస్తున్నారు. రఘునాధ్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని యశ్వంత్‌పూర్ వద్దకు రాగానే మంత్రి ఎస్కార్ట్‌లోని ఓ వాహనం అదుపు తప్పి వీరి కారును ఢీ కొట్టింది. ఈఘటనలో నయిముల్లాఖాన్ కుడికాలు తొడ ఎముక విరిగిపోయింది. ఛాతిలో బలమైన దెబ్బలు తగిలాయి. దీనికి తోడు ఆయనకు హార్ట్ఎటాక్ కూడా వ చ్చింది. ఇదే వాహనంలో ప్రయాణిస్తున్న గులాంగౌస్(59)కు స్వల్పగాయాలు కాగా, ఆయన సతీమణి సాదీక్ ఉన్నీసాబేగం(48) కుడి మోకాలి చిప్ప పగిలింది. మెహమీన్(7) కుడికాలి పాదం దెబ్బతింది. వెంటనే మంత్రి రాజయ్య బాధితులను జనగాం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి వచ్చి పరామర్శించి, వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. మెరుగైనవైద్యం కోసం బాధితులను అదే రోజు బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో న యిముల్లాఖాన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. సాదీక్ ఉన్సీసాబేగం వైద్య ఖర్చు రూ.1.90 లక్షలు దాటింది. ఇప్పటికే రూ.90 వేలు చెల్లించగా, మిగిలిన మొత్తం చెల్లిస్తేనే వైద్యం చేస్తామని, లేదంటే సేవలు నిలిపివేస్తామని ఆస్పత్రి వర్గాలు తెలియజేయడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఈ అంశంపై మంత్రిని వివరణ కోరేందుకు‘సాక్షి’ ప్రయత్నించగా ఆయన కానీ, సంబంధిత అధికారులు కానీ అందుబాటులోకి రాలేదు. -
నేడు ‘ప్రధానమంత్రి జన ధన’ ప్రారంభం
సుబేదారి : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి జన ధన యోజన పథకాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్(ఎస్బీహెచ్) శాఖ ఆధ్వర్యంలో గురువారం హన్మకొండలోని ఆర్ట్స్‌అండ్‌సైన్స్ కాలే జీ ఆడిటోరియంలో సాయంత్రం 4 గంటలకు ప్రారంభించనున్నారు. ముఖ్యఅతిథిగా డిప్యూటీ సీఎం డాక్టర్ టి.రాజయ్య, రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి, వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి, కలెక్టర్ జి.కిషన్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్, తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ, ఎస్బీహెచ్ వరంగల్ జోనల్ ఆఫీసర్ వీఏ మాథ్యూకుట్టి, జనరల్ మేనేజర్ ఎస్.మానికందన్, జనరల్మేనేజర్ వి.శ్రీహరి పాల్గొంటారు. ఈ సందర్భంగా అతిథులు బ్యాంక్ అకౌంటింగ్ ఓపెనింగ్ కిట్స్‌ను పంపిణీ చేయనున్నారు. -
ఆరోపణలున్న వ్యక్తికే అందలమా..?
సాక్షి, హన్మకొండ : అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తినే విచారణ అధికారి పోస్టులో నియమించేందుకు పైరవీలు సాగుతున్నాయి. తెలంగాణ ఉపముఖ్యమంత్రి డాక్టర్ టి.రాజయ్య నిర్వహిస్తున్న వైద్య, ఆరోగ్య శాఖలోనే ఇలాంటి పోస్టింగ్ పైరవీలు తీవ్రంగా జరుగుతుండడం చర్చనీయాంశమైంది. వైద్య ఆరోగ్యశాఖ వరంగల్ రీజనల్ డెరైక్టర్(ఆర్డీహెచ్)గా ప్రస్తుతం కొనసాగుతున్న డాక్టర్ మాణిక్యరావు ఈ నెల 30న ఉద్యోగ విరమణ చేయబోతున్నారు. మరో రెండు రోజుల్లో ఖాళీ కానున్న ఈ కీలకమైన పోస్టులో ప్రభుత్వం ఎవరిని నియమిస్తుందనేది ఇప్పుడు వైద్య శాఖలో ఆసక్తికరంగా మారింది. వరంగల్ వైద్య ఆరో గ్య శాఖ రీజినల్ డెరైక్టర్ పరిధిలో వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలు ఉంటాయి. కీలకమైన ఈ పోస్టు కోసం జిల్లా వైద్య శాఖ అధికారిగా పనిచేస్తున్న డాక్టర్ పి. సాంబశివరావు ప్రయత్నిస్తున్నారు. గత ఐదేళ్లు గా ప్రజాప్రతినిధిగా ఉన్న ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి రాజయ్యతో ఉన్న పరిచయాలతో ఈ ప్రయత్నా లు ఊపందుకున్నాయని వైద్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. డాక్టర్ పి.సాంబశివరావుపై పలు అవినీతి ఆరోపణలు విచారణ దశలో ఉండడంతో ఈ పోస్టు విషయంలో ఉప ముఖ్యమంత్రి నిర్ణయం ఎలా ఉంటుందనేది మరో మూడు రోజుల్లో తేలనుంది. ఆరోపణలపై విచారణ.. మన జిల్లాలో 62 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. 2012 డిసెంబరులో ప్రతి ఆరోగ్య కేంద్రానికి రెండు చొప్పున ఇన్వర్టర్లు కొనుగోలు చేశారు. ఒక్కో ఇన్వర్టర్కు రూ.40 వేలు చెల్లించారు. ఇన్వర్టర్ల కొనుగోలు విషయంలో అక్రమాలు జరిగాయని, ప్రభుత్వ నిధులు దు ర్వినియోగమయ్యాయని ఆరోపణలు వచ్చా యి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా డాక్టర్ పి.సాంబశివరావు ఉన్నప్పుడే ఇన్వర్టర్ల కొనుగోలు ప్రక్రియ అంతా జరిగింది. ఎస్సీ, ఎస్టీ జిల్లా అసోసియేషన్‌తోపాటు పలువురు వ్యక్తులు ఈ అంశంపై 2013లో ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై విచారణ చేపట్టాలంటూ ఆందోళనలు జరిగాయి. 2013 జులైలో అప్పటి ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి జిల్లాకు వచ్చి దీనిపై విచారణకు ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ రీజనల్ డెరైక్టర్ మాణిక్యరావును విచారణ అధికారిగా నియమించారు. ఇందుకు సంబంధించిన విచారణ సైతం పూర్తయింది. రెండు రోజుల్లో ఈయన ఉద్యోగ విరమణ చేస్తున్నా.. విచారణ నివేదికను వెల్లడించకపోవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో ప్రస్తుత జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిగా ఉన్న డాక్టర్ పి.సాంబశివరావు రీజినల్ డెరైక్టర్ పోస్టు కోసం ప్రయత్నిస్తున్నారు. సాంబశివరావును రీజినల్ డెరైక్టర్ పోస్టులో నియమిస్తే... అక్రమాలపై విచారణ అంశాన్ని పక్కనబెట్టినట్లే అవుతుందని వైద్య శాఖలో చర్చ జరుగుతోంది. రీజినల్ డెరైక్టర్ పోస్టు కోసం ప్రయత్నిస్తున్న ప్రస్తుత జిల్లా వైద్య అధికారి... విచారణ నివేదిక వెలుగుచూడకుండా చేస్తున్నారని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కీలకమైన రీజినల్ డెరైక్టర్ పోస్టులో ప్రభుత్వం ఎవరిని నియమిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. -
ఒక్కరితోనే సరి
డిప్యూటీ సీఎంగా తాటికొండ తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వంలో జిల్లాకు కీలక పదవి ‘స్టేషన్’ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్యకు దక్కిన వైద్య, ఆరోగ్య శాఖ మలివిడతలో మరొక్కరికి చాన్స్! సాక్షి ప్రతినిధి, వరంగల్ : తెలంగాణ తొలి ప్రభుత్వంలో జిల్లాకు కీలక పదవి దక్కింది. స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఉప ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తోపాటు టి.రాజయ్య సోమవారం ఉదయం మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. టి.రాజయ్యకు కీలకమైన శాఖను కేటాయించారు. స్వయంగా డాక్టర్ అయిన టి.రాజయ్య వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోనూ ఉప ముఖ్యమంత్రి పదవి ఉన్నా... మన జిల్లా ప్రజాప్రతినిధులకు ఎప్పుడూ అవకాశం రాలేదు. తెలంగాణ తొలి ప్రభుత్వంలోనే రాజయ్యకు ఈ పదవి వచ్చింది. రాజయ్యకు ఉప ముఖ్యమంత్రి పదవి రావడంపై జిల్లాలో టీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర వహించడంతోపాటు 2001లో టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీకి మద్దతుగా నిలిచిన జిల్లాకు తెలంగాణ తొలి ప్రభుత్వంలో ఒకే మంత్రి పదవి ఇవ్వడంపై కొంత అసంతృప్తి నెలకొంది. తగిన నాయ్యం చేయనట్లేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణలో ముఖ్యమంత్రితోపాటు గరిష్టంగా 18 మంత్రులు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం కేసీఆర్‌తో కలిపి 11 మంది ఉన్నారు. మరో ఏడుగురిని మంత్రులుగా నియమించుకునేందుకు అవకాశం ఉంది. రెండో విడతలో జిల్లాకు మరో మంత్రి పదవి దక్కుతుందని టీఆర్ఎస్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. ప్రస్తుతం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఎస్టీ వర్గానికి, మహిళలకు చోటు దక్కలేదు. ఈ కోటాలో రెండో విడతతో ఒక్క పదవి వస్తుందని గులాబీ వర్గాలు భావిస్తున్నారుు. ప్రస్తుతం ప్రాతినిథ్యం లేని ఎస్టీ కోటాలో జిల్లాకు మరో మంత్రి పదవి వస్తుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఎస్టీ వర్గానికి చెందిన వారిని మంత్రులుగా నియమిస్తే... ఇది జిల్లాకే రావడం అనవాయితీగా వస్తోంది. జిల్లాలో ప్రస్తుతం ఇద్దరు ఎస్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. మాజీ మంత్రి, సీనియర్ నేత అజ్మీరా చందూలాల్ ఎస్టీ కోటాపై ఆశలు పెట్టుకున్నారు. తెలంగాణ ప్రస్తుత సర్కారులో మహిళలకు చోటు దక్కలేదు. టీఆర్ఎస్ తరఫున గెలిచిన వారిలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ సీనియర్‌గా ఉన్నారు. గతంలో మంత్రిగా పనిచేసిన సురేఖకు మహిళా కోటాలో అవకాశం వస్తుందని ఈమె వర్గీయులు ఆశిస్తున్నారు. హోదా పరంగా ముఖ్యమంత్రి తర్వాత కీలకంగా ఉండే ఉప ముఖ్యమంత్రి పదవి జిల్లాకు దక్కడంతో.... ఇక్కడి నుంచి మరొక్కరికి మంత్రి వర్గంలో బెర్త్ దక్కకపోవచ్చని టీఆర్ఎస్లోని కొందరు నేతలు అంటున్నారు. స్టేషన్ల గెలిస్తే మంత్రే... మంత్రి పదవి విషయంలో స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గానికి ప్రత్యేకత ఉంది.1994 నుంచి ఒకసారి మినహా స్టేషన్‌ఘన్‌పూర్‌లో గెలిచిన వారు వరుసగా మంత్రులయ్యారు. 1994 ఎన్నికల్లో ఇక్కడి నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన కడియం శ్రీహరికి అప్పటి ఎన్టీఆర్ మంత్రివర్గంలో చోటు దక్కింది. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన తర్వాత ఏర్పడిన చంద్రబాబు ప్రభుత్వంలోనూ కడియం శ్రీహరి మంత్రి అయ్యారు. 1999లోనూ ఇదే జరిగింది. 2004లో స్టేషన్‌ఘన్‌పూర్‌లో కడియం శ్రీహరిని ఓడించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే జి.విజయరామారావు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. విజయరామారావు రాజీనామా తర్వాత... ఇక్కడ 2008లో ఉప ఎన్నిక జరిగింది. టీడీపీ అభ్యర్థి కడియం శ్రీహరి విజయం సాధించారు. 2009లో టి.రాజయ్య కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యే కావడంతో రాజయ్యకు అప్పుడు మంత్రి పదవి దక్కలేదు. తాజా ఎన్నికలతో టి.రాజయ్య స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన రాజయ్య... తెలంగాణ ఉద్యమ సమయంలో పార్టీకి, పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు. 2012లో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తాజా ఎన్నికల్లో భారీ మెజార్టీతో మరోసారి విజయం సాధించారు. కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ విలీనమవుతుందనే ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు కేసీఆర్ వ్యూహాలు పన్నుతున్న సమయంలో రాజయ్య హస్తానికి షాక్ ఇచ్చి... గులాబీ దళంలో చేరారు. ఇదే సమయంలో రాజయ్యతోపాటు మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరారు. టీఆర్ఎస్లో మాదిగ వర్గం నుంచి కీలకమైన నేతలు లేకపోవడం రాజయ్యకు కలిసొచ్చింది. స్పల్ప కాలంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు దగ్గరయ్యారు. విద్యార్హతలు సైతం అతడికి అనుకూలంగా మారారుు. తెలంగాణ దళిత ముఖ్యమంత్రి హామీ విషయంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై విమర్శలు చేస్తున్న మహాజన సోషలిస్టు పార్టీ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ జిల్లాకు చెందిన వారే. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి మంద కృష్ణమాదిగ వ్యాఖ్యలపై రాజయ్య స్పందిస్తున్నారు. రాజకీయంగా భవిష్యత్ వ్యూహాలను దృష్టిలో పెట్టుకుని రాజయ్యకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక పదవి ఇచ్చారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.