ఒక్కరితోనే సరి | Deputy Chief THATIKONDA | Sakshi
Sakshi News home page

ఒక్కరితోనే సరి

Published Tue, Jun 3 2014 1:44 AM | Last Updated on Sun, Apr 7 2019 4:30 PM

Deputy Chief THATIKONDA

  •      డిప్యూటీ సీఎంగా తాటికొండ
  •      తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వంలో జిల్లాకు కీలక పదవి
  •      ‘స్టేషన్’ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్యకు దక్కిన వైద్య, ఆరోగ్య శాఖ
  •      మలివిడతలో మరొక్కరికి చాన్స్!
  •  సాక్షి ప్రతినిధి, వరంగల్ :  తెలంగాణ తొలి ప్రభుత్వంలో జిల్లాకు కీలక పదవి దక్కింది. స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఉప ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తోపాటు టి.రాజయ్య సోమవారం ఉదయం మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. టి.రాజయ్యకు కీలకమైన శాఖను కేటాయించారు. స్వయంగా డాక్టర్ అయిన టి.రాజయ్య వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోనూ ఉప ముఖ్యమంత్రి పదవి ఉన్నా... మన జిల్లా ప్రజాప్రతినిధులకు ఎప్పుడూ అవకాశం రాలేదు. తెలంగాణ తొలి ప్రభుత్వంలోనే రాజయ్యకు ఈ పదవి వచ్చింది. రాజయ్యకు ఉప ముఖ్యమంత్రి పదవి రావడంపై జిల్లాలో టీఆర్‌ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర వహించడంతోపాటు 2001లో టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీకి మద్దతుగా నిలిచిన జిల్లాకు తెలంగాణ తొలి ప్రభుత్వంలో ఒకే మంత్రి పదవి ఇవ్వడంపై కొంత అసంతృప్తి నెలకొంది. తగిన నాయ్యం చేయనట్లేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

    తెలంగాణలో ముఖ్యమంత్రితోపాటు గరిష్టంగా 18 మంత్రులు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం కేసీఆర్‌తో కలిపి 11 మంది ఉన్నారు. మరో ఏడుగురిని మంత్రులుగా నియమించుకునేందుకు అవకాశం ఉంది. రెండో విడతలో జిల్లాకు మరో మంత్రి పదవి దక్కుతుందని టీఆర్‌ఎస్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. ప్రస్తుతం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఎస్టీ వర్గానికి, మహిళలకు చోటు దక్కలేదు.

    ఈ కోటాలో రెండో విడతతో ఒక్క పదవి వస్తుందని గులాబీ వర్గాలు భావిస్తున్నారుు. ప్రస్తుతం ప్రాతినిథ్యం లేని ఎస్టీ కోటాలో జిల్లాకు మరో మంత్రి పదవి వస్తుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఎస్టీ వర్గానికి చెందిన వారిని మంత్రులుగా నియమిస్తే... ఇది జిల్లాకే రావడం అనవాయితీగా వస్తోంది. జిల్లాలో ప్రస్తుతం ఇద్దరు ఎస్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. మాజీ మంత్రి, సీనియర్ నేత అజ్మీరా చందూలాల్ ఎస్టీ కోటాపై ఆశలు పెట్టుకున్నారు.

    తెలంగాణ ప్రస్తుత సర్కారులో మహిళలకు చోటు దక్కలేదు. టీఆర్‌ఎస్ తరఫున గెలిచిన వారిలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ సీనియర్‌గా ఉన్నారు. గతంలో మంత్రిగా పనిచేసిన సురేఖకు మహిళా కోటాలో అవకాశం వస్తుందని ఈమె వర్గీయులు ఆశిస్తున్నారు. హోదా పరంగా ముఖ్యమంత్రి తర్వాత కీలకంగా ఉండే ఉప ముఖ్యమంత్రి పదవి జిల్లాకు దక్కడంతో.... ఇక్కడి నుంచి మరొక్కరికి మంత్రి వర్గంలో బెర్త్ దక్కకపోవచ్చని టీఆర్‌ఎస్‌లోని కొందరు నేతలు అంటున్నారు.
     
    స్టేషన్ల గెలిస్తే మంత్రే...

    మంత్రి పదవి విషయంలో స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గానికి ప్రత్యేకత ఉంది.1994 నుంచి ఒకసారి మినహా స్టేషన్‌ఘన్‌పూర్‌లో గెలిచిన వారు వరుసగా మంత్రులయ్యారు. 1994 ఎన్నికల్లో ఇక్కడి నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన కడియం శ్రీహరికి అప్పటి ఎన్టీఆర్ మంత్రివర్గంలో చోటు దక్కింది. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన తర్వాత ఏర్పడిన చంద్రబాబు ప్రభుత్వంలోనూ కడియం శ్రీహరి మంత్రి అయ్యారు. 1999లోనూ ఇదే జరిగింది. 2004లో స్టేషన్‌ఘన్‌పూర్‌లో కడియం శ్రీహరిని ఓడించిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జి.విజయరామారావు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు.

    విజయరామారావు రాజీనామా తర్వాత... ఇక్కడ 2008లో ఉప ఎన్నిక జరిగింది. టీడీపీ అభ్యర్థి కడియం శ్రీహరి విజయం సాధించారు. 2009లో టి.రాజయ్య కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యే కావడంతో రాజయ్యకు అప్పుడు మంత్రి పదవి దక్కలేదు. తాజా ఎన్నికలతో టి.రాజయ్య స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన రాజయ్య... తెలంగాణ ఉద్యమ సమయంలో పార్టీకి, పదవికి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరారు. 2012లో టీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తాజా ఎన్నికల్లో భారీ మెజార్టీతో మరోసారి విజయం సాధించారు. కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనమవుతుందనే ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు కేసీఆర్ వ్యూహాలు పన్నుతున్న సమయంలో రాజయ్య హస్తానికి షాక్ ఇచ్చి... గులాబీ దళంలో చేరారు.
     
    ఇదే సమయంలో రాజయ్యతోపాటు మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరారు. టీఆర్‌ఎస్‌లో మాదిగ వర్గం నుంచి కీలకమైన నేతలు లేకపోవడం రాజయ్యకు కలిసొచ్చింది. స్పల్ప కాలంలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు దగ్గరయ్యారు. విద్యార్హతలు సైతం అతడికి అనుకూలంగా మారారుు. తెలంగాణ దళిత ముఖ్యమంత్రి హామీ విషయంలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై విమర్శలు చేస్తున్న మహాజన సోషలిస్టు పార్టీ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ జిల్లాకు చెందిన వారే. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి మంద కృష్ణమాదిగ వ్యాఖ్యలపై రాజయ్య స్పందిస్తున్నారు. రాజకీయంగా భవిష్యత్ వ్యూహాలను దృష్టిలో పెట్టుకుని రాజయ్యకు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కీలక పదవి ఇచ్చారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement