వరంగల్ : తెలంగాణ ఆడబిడ్డలకు మేనమామలా ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలిచారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. వరంగల్‌లో జరుగుతున్న టీఆర్‌ఎస్ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడుతూ పేద యువతులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా రూ.75వేలు అందించి, వారి కుటుంబాలకు అండగా నిలుస్తున్నారన్నారు. అలాగే ఆడపడచులందరికీ కేసీఆర్ అన్నగా భరోసా ఇస్తున్నారని, ఆయన మనసున్న మారాజుగా అభివర్ణించారు.
తెలంగాణలో ఆడబిడ్డలకు ఏదో ఒక పథకంతో ఆదుకుంటున్నారని ఆయన అన్నారు. గర్భిణి స్త్రీల నుంచి, ప్రసవం అయిన మహిళల వరకూ ప్రోత్సాకాలు ఇస్తూ ఆదుకుంటున్నారని కడియం పేర్కొన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో సంక్షేమానికి రూ.40వేల కోట్లు కేటాయించి దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు. కేసీఆర్ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను నూటికి నూరు శాతం అమలు చేస్తున్నారని తెలిపారు. అలాగే హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యం అందిస్తున్నారని, మిషన్ భగీరథలో ఇంటింటికి నల్లా నీరు అందిస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ పేదవాడి ఆకలి గురించి ఎప్పుడు ఆలోచించలేదన్నారు.