చావు బతుకుల్లో..! | Until death ..! | Sakshi
Sakshi News home page

చావు బతుకుల్లో..!

Published Sat, Dec 6 2014 1:46 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

చావు బతుకుల్లో..! - Sakshi

చావు బతుకుల్లో..!

  • కేర్‌లో ఉపముఖ్యమంత్రి ఎస్కార్ట్ ప్రమాద బాధితుల దైన్యం
  •  ఒకరి పరిస్థితి విషమం..కదల్లేని పరిస్థితుల్లో మరొకరు
  •  రూ.1.90 లక్షల బిల్లు చెల్లించాలని ఆస్పత్రి వర్గాల ఒత్తిడి
  • సాక్షి, హైదరాబాద్: ఇటీవల జనగాం సమీపంలో తెలంగాణ ఉపముఖ్యమంత్రి టి.రాజయ్య ఎస్కార్ట్‌లోని వాహనం ప్రమాదవశాత్తు కారును ఢీకొన్న ఘటనలో గాయపడిన బాధితులు బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. చికిత్స ఖర్చంతా తామే భరిస్తామని హామీ ఇచ్చిన మంత్రి వారి వైపు కన్నెత్తి చూడకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

    కాగా ఇప్పటి వరకు అయిన ఖర్చులన్నీ బాధితులే చెల్లించాలని, లేదంటే వైద్య సేవలు నిలిపివేస్తామని ఆస్పత్రి వర్గాలు ఒత్తిడి తెస్తుండటంతో తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నల్లగొండ జిల్లాకు చెందిన నయిముల్లాఖాన్(58) కుటుంబ సభ్యులతో నవంబర్ 30న వరంగల్ నుంచి నల్లగొండవైపు వస్తున్నారు. రఘునాధ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని యశ్వంత్‌పూర్ వద్దకు రాగానే మంత్రి ఎస్కార్ట్‌లోని ఓ వాహనం అదుపు తప్పి వీరి కారును ఢీ కొట్టింది.

    ఈఘటనలో నయిముల్లాఖాన్ కుడికాలు తొడ ఎముక విరిగిపోయింది. ఛాతిలో బలమైన దెబ్బలు తగిలాయి. దీనికి తోడు ఆయనకు హార్ట్‌ఎటాక్ కూడా వ చ్చింది. ఇదే వాహనంలో ప్రయాణిస్తున్న గులాంగౌస్(59)కు స్వల్పగాయాలు కాగా, ఆయన సతీమణి సాదీక్ ఉన్నీసాబేగం(48) కుడి మోకాలి చిప్ప పగిలింది. మెహమీన్(7) కుడికాలి పాదం దెబ్బతింది. వెంటనే మంత్రి రాజయ్య బాధితులను జనగాం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

    ఆస్పత్రికి వచ్చి పరామర్శించి, వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. మెరుగైనవైద్యం కోసం బాధితులను అదే రోజు బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో న యిముల్లాఖాన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. సాదీక్ ఉన్సీసాబేగం వైద్య ఖర్చు రూ.1.90 లక్షలు దాటింది. ఇప్పటికే రూ.90 వేలు చెల్లించగా, మిగిలిన మొత్తం చెల్లిస్తేనే వైద్యం చేస్తామని, లేదంటే సేవలు నిలిపివేస్తామని ఆస్పత్రి వర్గాలు తెలియజేయడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఈ అంశంపై మంత్రిని వివరణ కోరేందుకు‘సాక్షి’ ప్రయత్నించగా ఆయన కానీ, సంబంధిత అధికారులు కానీ అందుబాటులోకి రాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement