- మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య
హన్మకొండ: ‘టీఆర్‌ఎస్ పాలన పారదర్శకంగా సాగుతోందని చెప్పే పరీక్షలో నేను అన్నం మెతుకును అయ్యాను. అన్నం ఎలా ఉందో పరీక్షించేందుకు మెతుకును ఒత్తుతారు’ అని మాజీ డిప్యూటీ సీఎం టి.రాజయ్య వ్యాఖ్యానించారు. వరంగల్ జిల్లా హన్మకొండలోని తన నివాసంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘అన్నం ఉడికిందీ.. లేనిదీ.. తెలుసుకోవడానికి ఒక మెతుకును ఒత్తి చూస్తారు. ఆ మెతుకును నేను అయినందుకు గర్వపడుతున్నా’ అని అన్నారు.
సీఎం కేసీఆర్ కలలుగన్న ఆరోగ్య తెలంగాణ కోసం వైద్య మంత్రిగా శ్రమించానని పేర్కొన్నారు. ఏజెన్సీ ప్రాంతాలు, ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, ఆస్పత్రుల ద్వారా మేలైన వైద్య సేవలందించి ఆరోగ్య తెలంగాణ ఏర్పాటుకు కృషి చేశానన్నారు.‘కేసీఆర్ కల్పించిన అవకాశంతో ఉద్యమంలో 87 నియోజకవర్గాలు పర్యటించాను. వారి అంచనా మేరకు పని చేయడంతో గుర్తించి తెలంగాణ తొలి డిప్యూటీ సీఎంగా అవకాశం కల్పించారు. నా వ్యక్తిత్వంపై, దళితుల ఆత్మగౌరవం దెబ్బతినేలా విమర్శలు రావడం వల్ల తీవ్ర మనస్తాపానికి గురయ్యాను. తెలంగాణ పునర్నిర్మాణంలో, బంగారు తెలంగాణలో భాగస్వామినవుతాను’ అని అన్నారు.