ఇన్వర్టర్‌తో ఏసీ అవుతుంది డీసీ!
హౌ ఇట్ వర్క్స్
ఇన్వర్టర్ల గురించి మీరు వినే ఉంటారు. కరెంటు కోతల కాలంలో మనల్ని వేసవి తాపం నుంచి ఎంతో కొంత ఆదుకునేవి ఇవే. బాగానే ఉంది కానీ... ఇవి ఏ కరెంటు వాడతాయో మీకు తెలుసా? డీసీ లేదా డెరైక్ట్ కరెంట్. మరి ఇళ్లల్లోని ఇతర పరికరాలన్నీ వాడే కరెంటు ఏది? ఆల్టర్నేటింగ్ కరెంట్ అలియాస్ ఏసీ! ఈ రెంటికీ తేడా ఏమిటన్నదేనా మీ సందేహం. సాంతం చదివేయండి. మీకే అర్థమై పోతుంది.
ఏసీ, డీసీల గురించి తెలుసుకునే ముందు కరెంటును అర్థం చేసుకుందాం. చిట్టి చీమలు ఒకే వరుసలో కదులుతూంటాయి చూశారా? పరమాణువుల్లోని ఎలక్ట్రాన్లు ఇలా ఒక దిశలో కదిలే ప్రవాహాన్ని కరెంటు అంటారు. దీన్నే డెరైక్ట్ కరెంట్ అని కూడా పిలుస్తారు. ఇలా కాకుండా ఈ ఎలక్ట్రాన్ల ప్రవాహం సెకనుకు యాభై, అరవైసార్లు తన దిశను మార్చుకుంటూ ఉందనుకుందాం.
దాన్ని ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటారు. డీసీ కరెంట్‌ను సుప్రసిద్ద శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్ ఆవిష్కరిస్తే... నికోలా టెస్లా ఏసీ కరెంట్‌ను కనుక్కున్నారు. ప్రపంచం మొత్తానికి విద్యుత్తును ఏ పద్ధతిలో ప్రసారం చేయాలన్న విషయం వచ్చినప్పుడు వీరిద్దరూ పోటీపడినా చివరకు బ్యాటరీల వంటి చిన్నస్థాయి పరికరాల్లో డీసీ... ఇళ్లు, భవంతులు, సుదూర ప్రాంతాల ప్రసారానికి ఏసీ కరెంట్ వాడటం మొదలైంది. రెండు రకాల కరెంట్‌ల మధ్య వ్యత్యాసం ఇదీ. ఇక ఏసీని డీసీగా, డీసీని ఏసీగా మార్చే ఇన్వర్టర్లు ఎలా పనిచేస్తాయో చూద్దాం...
ఏసీ కరెంట్‌లో ఎలక్ట్రాన్లు సెకనుకు యాభై అరవైసార్లు దిశ మార్చుకుంటాయని చెప్పుకున్నాం కదా... ఈ మార్పులను మళ్లీ దాని వ్యతిరేక దిశలోకి మారిస్తే అది డీసీ అవుతుందన్నమాట. ఇంకోలా చెప్పాలంటే మీరు ప్రతిసెకనులో కుడి, ఎడమలకు 50 - 10 అడుగులు వేయగలరనుకుందాం. ఇన్వర్టర్ ఏం చేస్తుందంటే కుడివైపు వేసిన అడుగును మళ్లీ వ్యతిరేకదిశలోకి మారుస్తుంది. అలాగే ఎడమవైపు అడుగును కూడా. దీనివల్ల ఏసీ కరెంట్‌లో దిశమార్పిడి అన్నది లేకుండాపోయి ఎలక్ట్రాన్లన్నీ ఒకవైపునకు ప్రవహించడం మొదలవుతుంది. ఈ పనిచేసేందుకు ఇన్వర్టర్లలో విద్యుదుయస్కాంత స్విచ్‌లు ఉంటాయి.
కరెంట్‌పోయినప్పుడు మనం ఇంట్లో వాడే పరికరంలో ఒక ఇన్వర్టర్‌తోపాటు ఒక బ్యాటరీ కూడా ఉంటుంది. కరెంట్ ఉన్నప్పుడు ఏసీని డీసీగా మార్చుతూ బ్యాటరీలోకి చేరుతూ ఉంటుంది. కరెంట్ పోయినప్పుడు బ్యాటరీలోని డీసీ కరెంట్ ఏసీగా మారిపోయి ఇంట్లో వెలుగులు పంచుతుంది.