సోలార్ విద్యుత్
మద్దూరు: రైతులకు త్వరలో సోలార్ విద్యుత్ అందుబాటులోకి రానుంది. మద్దూరు మండలం సలాక్‌పూర్‌లో ఇస్సెల్ మైనింగ్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో రూ.60 కోట్లతో ఎల్ అండ్ టీ కంపెనీ నిర్మిస్తున్న సోలార్ ప్లాంట్ ఈనెల 15న ప్రారంభం కానున్నది. ఈ ప్లాంట్‌లో ఉత్పత్తి అయ్యే 10 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్) కొనుగోలు చేసి చేర్యాల మండలం ముస్త్యాలలోని 133కేవీ సబ్‌స్టేష న్‌కు అందజేస్తుంది. ఆ సబ్‌స్టేషన్ నుంచి చేర్యాల, మద్దూరు, బచ్చన్నపేట, నర్మెట మండలాలకు విద్యుత్ సరఫరా చేస్తారు. సలాక్‌పూర్‌లో సోలార్ విద్యుత్ ప్లాంట్ 47 ఎకరాల్లో రూపుదిద్దుకుంది.
శుక్రవారం సోలార్ ప్లాంట్‌ను సందర్శించిన ట్రాన్స్‌కో ఎస్‌ఈ ప్రసాదరావు, ఈఈ నాగరాజు మాట్లాడుతూ పగటి పూట ఉత్పత్తి అయ్యే పది మెగావాట్ల సోలార్ విద్యుత్ నాలుగు మండలాలకు సరిపోతుందన్నారు. ఈ విద్యుత్‌ను ముస్త్యాల సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్ అవసరం ఉన్న మండలాలకు సరఫరాచేస్తామని చెప్పారు. ఎల్ అండ్ టీ కంపెనీ ప్రాజెక్టు మేనేజర్ దీపక్ కత్యాల్ మాట్లాడుతూ ఈనెల 15న సోలార్ విద్యుత్‌ను ముస్త్యాల సబ్‌స్టేషన్‌కు సరఫరా చేసేందుకు ప్లాంట్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. ఈ సోలార్ ప్లాంట్‌ను దశలవారీగా 50మెగావాట్ల విద్యుత్ కేంద్రంగా మారుస్తామని చెప్పారు.