పరిగి: ఇక సోలార్ వెలుగులు విరజిమ్మనున్నాయి. ఎన్నాళ్లుగానో ఊరిస్తున్న ప్రాజెక్టు రూపుదిద్దుకుని ఫలితాలనివ్వబోతోంది. పరిగి ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా అయ్యే రోజు అతి సమీపంలో ఉంది. పరిగి మండలం కాళ్లాపూర్ శివారులో రెండు నెలల క్రితం ప్రారంభమైన సోలార్ పవర్ జనరేటింగ్ ప్లాంట్ పనులు ఊపందుకున్నాయి. ఇప్పటికే కావాల్సిన సామగ్రిని ప్లాంటు వద్దకు చేర్చారు.
ప్రస్తుతం సాంకేతిక నిపుణులు ఫ్రేంలపై సోలార్ పలకలు (ప్లేట్లు), ట్రాన్స్ ఫార్మర్లు, జనరేటింగ్ సిస్టం తదితర పరికరాలు బిగించే పనిలో నిమగ్నమయ్యారు. పనులు వేగం పుంజుకున్న నేపథ్యంలో మరో నెల రోజుల్లో పవర్ జనరేట్ కానుందని తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో అనుమతులు పొందిన ఎస్‌జే పవర్ కంపెనీ ప్రతినిధులు కాళ్లాపూర్ రెవెన్యూ పరిధిలోని 24వ, సర్వే నెంబర్‌లో ఈ ప్లాంటు నిర్మిస్తున్నారు.
నిజానికి ఇప్పటికే పవర్ జనరేటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా పవర్ ప్లాంటు ఏర్పాటుచేస్తున్న భూమిలో రెండు మూడు చోట్ల విద్యుత్ వైర్లు ఉండడంతో పనులను కొ న్నాళ్లు నిలిపేయాల్సి వచ్చింది. ఇదే స మయంలో హనుమాన్ దేవాలయం భూమిని కొంత మేర కబ్జాచేసి, పక్కనే ఉన్న అసైన్డ్ భూమిని కొంతమేర ఆక్రమించుకుని ప్రాజెక్టును నిర్మిస్తున్నారని గ్రామస్తులు, పూజారులు ఆరోపిస్తున్నారు.
ఆదిలోనే అడ్డంకులు..
కొందరు స్థానిక రెవెన్యూ అధికారులు, నాయకులు సృష్టించిన గందరగోళంతో ప్రాజెక్టుకు ఆదిలోనే అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ప్రాజెక్టు నిర్వాహకులు ప్లాంటుకోసం కొనుగోలు చేసిన భూమి చుట్టూ అసైన్డ్ భూమి ఉండడం, ప్రాజెక్టుకు కేటాయించిన భూమిలోంచే రెండు దేవాలయాలకు వెళ్లేందుకు దారిఉండడం, భూమి సరిహద్దు విషయంలో రెవెన్యూ సిబ్బంది, సర్వేయర్ స్పష్టత ఇవ్వకపోవడం వంటి సమస్యలు ఏర్పడ్డాయి. దీంతో ప్లాంటు నిర్వాహణను అడ్డుకునేందుకు స్థానికులు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇందులో భాగంగానే గత వారం నిర్వాహకులు కొనుగోలు చేసిన పొలంలో పాతిన ఫెన్సింగ్ కడీలు విరగ్గొట్టారు. ఇప్పటికైనా పూర్తిస్థాయిలో సర్వే నిర్వహించి పనులు నిర్వహించుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. దేవాలయం భూమిని ఆక్రమించి ప్లాంటు వేస్తే ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు.
5.8 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం
46 ఎకరాల్లో రూ. 40 కోట్లతో ఏర్పాటు అవుతున్న ఈ సోలార్ పవర్ ప్రాజెక్టు ద్వారా 5.8 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఉత్పత్తిచేసిన విద్యుత్తును నేరుగా ప్రభుత్వానికి విక్రయిస్తారు. ఇందుకోసం ముందుగానే ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేయించుకుని పవర్ ప్రాజెక్టు పనులు చేస్తున్నారు. ఉత్పత్తి అయిన ఒక్కో యూనిట్ విద్యుత్‌ను రూ.6.49 లెక్కన ప్రభుత్వానికి విక్రయించనున్నట్టు తెలిసింది. ఇక్కడ ఉత్పత్తి అయిన విద్యుత్ 33 కేవీ విద్యుత్ లైన్ ద్వారా పరిగి సమీపంలో ఉన్న 133 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌కు సరఫరా కానుంది. అక్కడినుంచి మిగతా ప్రాంతాలకు సరఫరా చేయనున్నారు.
పరిగికి నిరంతర కరెంట్..
కాళ్లాపూర్ సమీపంలోని లొంక హనుమాన్ దేవాలయం వెనకాల నిర్మిస్తున్న సోలార్ పవర్ ప్రాజెక్టు పనులు పూర్తయితే పరిగి ప్రజలకు కరెంటు కష్టాలు తీరుతాయి. పవర్ ప్రాజెక్టులో తయారైన విద్యుత్‌ను నిలువ చేయడం వీలుకాదు. దీంతో తయారయ్యే విద్యుత్ ఎప్పటికప్పుడు విద్యుత్ ఫీడర్లతో అనుసందానం చేయాల్సి ఉంటుంది. ఉత్పత్తి అయిన కరెంటును మిగతా కరెంటుతో అనుసంధానం చేసేందుకైనా సరే పరిగిలో నిరంతర విద్యుత్ సరఫరా ఉండాల్సి ఉంటుంది.
ఇక వెలుగుల ‘సౌర’భం
Published Tue, Aug 12 2014 11:40 PM | Last Updated on Mon, Oct 22 2018 8:31 PM
Advertisement
Advertisement