
సాక్షి, రాజాపేట(ఆలేరు): ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడడంతో తండ్రీ కుమారుడు దుర్మరణం చెందారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని కుర్రారం శివారులో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కుర్రారం గ్రామానికి ముక్కెర రవీందర్‌రెడ్డి తన కుటుంబ సభ్యులు భార్య విజయ, ఇద్దరు కుమారులు జీవన్‌రెడ్డి, క్రాంతికుమార్ రెడ్డిలతో కలిసి కొంత కాలంగా ఉప్పల్‌లోని బీరప్పగడ్డకు నివాసం ఉంటున్నాడు. ఆర్‌ఎంపీగా వృత్తి నిర్వహిస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. పెద్ద కుమారుడు జీవన్ రెడ్డి మెహందీపట్నంలోని గురునాణక్ కలాశాలలో బీటెక్ ఫైనలియర్ చేస్తున్నాడు. చిన్నకుమారుడు క్రాంతికుమార్ రెడ్డి ఇంటర్ పూర్తిచేశాడు.
కాగా స్వగ్రామంలోని తనకున్న భూమిలో వ్యవసాయం సేద్యం చేయడానికి అప్పుడప్పుడు రవీందర్‌రెడ్డి వస్తూంటాడు. ఈ క్రమంలోనే ఆదివారం సాయంంత్రం వ్యవసాయ పనుల నిమిత్తం హైదరాబాద్ నుంచి రవిందర్‌రెడ్డి (48), పెద్ద కుమారుడు జీవన్‌రెడ్డి (21)తో కలిసి సాయంత్రం 5 గంటలకు కుర్రారం గ్రామానికి వచ్చాడు. కాగా గ్రామం శివారులోని తన వ్యవసాయ పొలంలో ఉన్న ట్రాక్టర్‌ను కొడుకు జీవన్‌రెడ్డి డ్రైవింగ్ చేస్తుండగా తండ్రి పక్కనే ఇంజన్‌పై కుర్చున్నాడు.
పొలం నుంచి రోడ్డు పైకి ఎక్కే క్రమంలో రోడ్డుపైనుంచి వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి సడన్ బ్రేక్ వేయడంతో ట్రాక్టర్ బోల్తాపడింది. ట్రాక్టర్‌పై ఉన్న రవీందర్‌రెడ్డి, జీవన్‌రెడ్డిలు కిందపడటంతో వీరిపై ట్రాక్టర్ ఇంజన్ పడింది. ఈ దుర్ఘటనలో తండ్రి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. బాటసారులు గమనించి కొన ఊపిరితో ఉన్న జీవన్‌రెడ్డిని చికిత్స నిమిత్తం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. తండ్రీ కొడుకులు ఒకేసారి మృతి చెందడంతో కుర్రారంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుంటుంబసభ్యులు, బంధువుల రోదనలు గ్రామస్తులను కంటతడిపెట్టించాయి.మృతులను చూడటానికి పరిసర గ్రామస్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.