
భర్తతో కలిసి తల్లిని చంపేసింది
తాడూరు (మహబూబ్‌నగర్ జిల్లా) : ఆస్తి కోసం కన్నతల్లినే చంపేసింది ఓ కూతురు. 6 ఎకరాల భూమి తన పేరు మీద రాయలేదని భర్తతో కలిసి తల్లిని హత్య చేసిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా తాడూరు మండలపరిధిలోని కుమ్మెర గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించిన ఎస్సై పురుషోత్తం తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన తిరుపతమ్మ(55), బచ్చన్నలు దంపతులు. వీరికి ఇద్దరు ఆడ సంతానం. దాంతో పెద్ద కూతురు నాగమణికి అదే గ్రామానికి చెందిన ఆంజనేయులుతో వివాహం జరిపి ఇల్లరికం కుదుర్చుకున్నారు. చిన్న కూతురుని అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. కాగా తిరుపతమ్మ భర్త బచ్చన్న అనారోగ్యంతో జనవరి నెలలో మృతి చెందాడు. ఇక అప్పటి నుంచి ఇంట్లో ఆస్తి తగాదాలతో అత్తకి అల్లుడి వేధింపులు మొదలయ్యాయి.
తండ్రి బచ్చన్న పేరుతో ఉన్న ఆరెకరాల భూమి తమ పేరున రాయాలని బిడ్డ నాగమణి, అల్లుడు ఆంజనేయులు తరుచూ పట్టుబట్టి వేధించసాగారు. దీంతో తిరుపతమ్మ తాను ఉన్నంత వరకు భూమి ఎవరి పేరునా రాసేది లేదని తెగేసి చెప్పడంతో అల్లుడు ఆంజనేయులు, కూతురు నాగమణి కలిసి పథకం ప్రకారం శుక్రవారం అర్థరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న తిరుపతమ్మ తల, ముఖంపై బాదడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. శనివారం తెల్లవారుజామున విషయం తెలియడంతో గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటన స్థలాన్ని పరిశీలించి చిన్న కూతురు పద్మమ్మ ఫిర్యాదు మేరకు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించి హత్యకు పాల్పడిన కూతురు, అల్లునిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.