ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధురాలు దుర్గమ్మ
కోల్‌సిటీ(రామగుండం): అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని ఆమె కొడుకు వారంరోజుల క్రితం ప్రభుత్వాస్పత్రిలో వదిలేసి వెళ్లాడు. దీంతో ఆ తల్లి నరకయాతన పడుతోంది. చివరికి ఆస్పత్రి వైద్యులు గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో మంగళవారం ఆ కొడుకు తల్లిదగ్గరికి వచ్చాడు. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరిగింది. మంథని మండలం మల్లేపల్లి గ్రామానికి చెందిన కొవ్వూరి దుర్గమ్మ (70) అనారోగ్యంతో బాధపడుతోంది. వారం రోజుల క్రితం అర్ధరాత్రి వృద్ధురాలిని కొడుకు రాయలింగు గోదావరిఖనిలోని ప్రభుత్వాస్పత్రిలో చేర్పించాడు. వైద్యులు పరీక్షించేంత వరకు ఉండి తర్వాత కనిపించకుండా పోయాడు. తీవ్ర రక్తహీనతతో బాధపడుతున్న వృద్ధురాలి కాలుకు పుండు కావడంతో అది ఇన్‌ఫెక్షన్ అయ్యింది.
కేవలం మూడు గ్రాముల రక్తం మాత్రమే ఉండడంతో ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రీనివాసరెడ్డి వృద్ధురాలికి చికిత్స అందిస్తున్నాడు. మెరుగైన చికిత్స అందించానికి వెంటనే వరంగల్‌లోని ఎంజీఎంకు తరలించాలని సూచించారు. నడవలేని స్థితిలో ఉన్న వృద్ధురాలిని చూసుకోవడానికి కుటుంబ సభ్యులు, బంధువులు ఎవరూ తోడు లేకపోవడంతో వైద్యసిబ్బందే సేవలందిస్తున్నారు. ఆస్పత్రిలో రక్తం కొరత ఉండడంతో స్పందించిన డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి స్వచ్ఛందంగా వృద్ధురాలికి రక్తం దానం చేయడానికి ముందుకు వచ్చారు. అయితే వృద్ధురాలి కొడుకు అందుబాటులో లేకపోవడంతో విషయాన్ని గ్రామస్తులకు డాక్టర్ శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. గ్రామస్తుల కౌన్సెలింగ్‌తో మంగళవారం తిరిగి కొడుకు ఆస్పత్రికి వచ్చాడు. డబ్బులు ఖర్చు అవుతుందని ఆందోళనకు గురికావద్దని, అవసరమైనంత వరకు తమ వంతుగా సహాయం చేస్తామని డాక్టర్ హామీ ఇచ్చారు. తల్లిని వదిలిపెట్టి పోయిన కొడుకు చర్యలకు, మానసింగా కృంగిపోతున్న వృద్ధురాలి దీనస్థితికి స్థానికులు చలించిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment