
నాన్నను ‘చంపేశారు’
కాల్వశ్రీరాంపూర్ (పెద్దపల్లి): కన్న కొడుకులు ఆదరించడంలేదని మనస్తాపం చెందిన ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లిలో ఆదివారం జరిగింది. వెన్నంపల్లి గ్రామానికి చెందిన మేడి లింగయ్య(80), లస్మమ్మలకు నలుగురు కుమారులు, ముగ్గురు కూతుళ్లు. అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. ఆరెకరాల భూమిని కుమారులు పంచుకున్నారు. వృద్ధాప్యంలోకి చేరిన తల్లిదండ్రులు లింగయ్య, లస్మమ్మ పోషణను పట్టించుకోలేదు.
వారిని లింగయ్య సోదరుడు చేరదీయగా.. కుమారులు వారించారు. మూడో కుమారుడు వీరి పోషణకు ముందుకు రాగా మిగతా ముగ్గురు దుర్భాషలాడారు. దీంతో పెద్దమనుషుల సమక్షంలో పలుమార్లు పంచాయతీలు కూడా జరిగాయి. అయినా తీరుమారని కుమారులు తండ్రికి తిండిపెట్టడం లేదు. ఈ క్రమంలో పలుమార్లు ఆత్మహత్యాయత్నం చేసిన లింగయ్య సోమవారం దూలానికి ఉరి వేసుకున్నాడు. దీంతో పోలీసులు నలుగురు కొడుకులపై కేసు నమోదు చేశారు.