త్వరలో హైసెక్యూరిటీ పాస్‌పోర్ట్‌లు | Soon the High Security Passports | Sakshi
Sakshi News home page

త్వరలో హైసెక్యూరిటీ పాస్‌పోర్ట్‌లు

Published Fri, Feb 8 2019 12:00 AM | Last Updated on Fri, Feb 8 2019 10:18 AM

Soon the High Security Passports - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ వాసులు మరో 3 నెలల్లో అత్యంత భద్రతా ఫీచర్లున్న హై సెక్యూరిటీ పాస్‌పోర్ట్‌లు అందుకోనున్నారు. ఉన్నత విద్య, వైద్యం, పర్యాటకం, తాత్కాలిక నివాసం తదితర అవసరాల నిమిత్తం విదేశీ పర్యటనలు చేసేందుకు పాస్‌పోర్ట్‌లు తప్పనిసరి. దీంతో మహానగరం పరిధిలో నెలకు లక్షకు పైగా నూతన పాస్‌పోర్ట్‌ల జారీ, పాతవాటి రెన్యువల్స్‌ జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో హైసెక్యూరిటీ గల ఈ–చిప్‌లు ఉండే పాస్‌పోర్ట్‌లను అందజేసేందుకు హైదరాబాద్‌లోని ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ కార్యాలయం అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ అనుమతితో దేశవ్యాప్తంగా పాస్‌పోర్ట్‌ల డిమాండ్‌ అధికంగా ఉన్న నగరాలకు అత్యంత భద్రతా ఫీచర్లతో పాస్‌పోర్ట్‌లను ముద్రించే ప్రింటింగ్‌ యంత్రాలను సరఫరా చేయనున్నట్లు పాస్‌పోర్ట్‌ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ యంత్రాలను నాసిక్‌లోని సెక్యూరిటీ ప్రింటింగ్‌ ప్రెస్‌ ఆధ్వర్యంలో నిపుణుల పర్యవేక్షణలో తయారు చేస్తున్నట్లు వివరించారు. మరో 3 నెలల తర్వాత నూతనంగా పాస్‌పోర్ట్‌ దరఖాస్తు చేసుకున్నవారికి, పాతవాటిని రెన్యువల్‌ చేసుకునేవారికి ఈ–చిప్‌లు ఉన్న అత్యంత భద్రమైన పాస్‌పోర్ట్‌లను అందజేయనున్నారు. 

నో ట్యాంపరింగ్‌..: పాస్‌పోర్ట్‌లో అత్యంత కీలకమైన పుట్టినతేదీ, తండ్రి, భార్య, భర్త పేరు, ఆధార్‌ నంబర్, ప్రస్తుత, శాశ్వత చిరునామా వంటి వ్యక్తిగత వివరాలకు అత్యంత భద్రత కల్పించేందుకే ఈ హైసెక్యూరిటీ పాస్‌పోర్ట్‌లు జారీ చేయాలని విదేశాంగ శాఖ సంకల్పించింది. ప్రస్తుతం జారీ చేస్తున్న 36 పేజీలు లేదా 60 పేజీల బుక్‌లెట్‌లా ఉండే హైసెక్యూరిటీ పాస్‌పోర్ట్‌లో అత్యంత నాణ్యత ఉండే కాగితాన్ని వినియోగించడంతోపాటు పేజీల్లో అంతర్లీనంగా ఈ–చిప్‌లను పొందుపరచనున్నారు. ఒకవేళ ఇతరుల ఫొటో పెట్టి ట్యాంపరింగ్‌కు ప్రయత్నిస్తే ఈ–చిప్‌ల ద్వారా పాస్‌పోర్ట్‌ కార్యాలయానికి సందేశం అందుతుందని పాస్‌పోర్ట్‌ కార్యాలయ వర్గాలు తెలిపాయి. భద్రత పరంగా ఇవి అత్యంత సురక్షితమని తెలిపారు. ఇక ఈ–చిప్‌ ఉన్న పాస్‌పోర్ట్‌ల జారీకి ప్రస్తుతమున్న చార్జీలే వర్తిస్తాయని చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement