త్వరలో కార్మిక విధానాల సరళీకరణ
సీఐఐ సదస్సులో ‘డిప్’ సంయుక్త కార్యదర్శి
సాక్షి, హైదరాబాద్: స్టార్టప్ ఇండియా విధానం ద్వారా దేశంలోకి మరిన్ని పెట్టుబడులు వస్తాయని కేంద్ర పారిశ్రామిక పెట్టుబడులు, ప్రోత్సాహక సంస్థ(డిప్) సంయుక్త కార్యదర్శి మహేంద్ర బలరాజ్ అన్నారు. కార్మిక విధానాలను సరళీకరించడం ద్వారా పరిశ్రమల యజ మానులు, కార్మికులకు లాభదాయకంగా ఉండే లా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. భారత వాణిజ్య మండలి(సీఐఐ) తెలంగాణ శాఖ చైర్మన్ వనిత దాట్ల అధ్యక్షతన హైదరాబాద్‌లో బుధవారం పారిశ్రామికవేత్తలతో జరిగిన ముఖాముఖిలో బలరాజ్ మాట్లాడారు. రక్షణ రంగ ఉత్పత్తుల పరిశోధనల్లో ప్రైవేటు రంగానికి కూడా అవకాశం కల్పించాలనే సూచనను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు. వేగంగా అమ్ముడయ్యే ఉత్పత్తుల(ఎఫ్‌ఎంసీజీ) కోసం ప్రత్యేక విధానం రూపొందించే యోచనలో ఉన్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్ మాణిక్కరాజ్ వెల్లడించారు.
ఏరోస్పేస్ విధానంపై అధ్యయనం కోసం నిపుణులు, పారిశ్రామికవేత్తలతో ఇప్పటికే ప్రత్యేక కమిటీ వేశామన్నారు. పరిశ్రమల తనిఖీల విషయంలోనూ పలు మార్పులు చేస్తున్నామని.. స్వయం ధృవీకరణ ఇచ్చే పరిశ్రమల్లో ఐదేళ్లకోమారు మాత్రమే తనిఖీ చేస్తామన్నారు. గతంలో వివిధ నిబంధనల కింద చేయాల్సిన తనిఖీల న్నింటినీ ఒకే పర్యాయం జరిపి.. ఆన్‌లైన్‌లో ఆ వివరాలు నమోదు చేస్తామన్నారు. రాష్ట్రంలో పెద్ద పరిశ్రమలతో పాటు చిన్న, సూక్ష్మ పరిశ్రమలకు ప్రోత్సాహం అందిస్తామన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీ-హబ్‌లో 300కు పైగా స్టార్టప్‌లు పురుడు పోసుకుంటున్నాయన్నారు. లాభాలు లేని పరిశ్రమలను మూసివేసేందుకు అనువైన విధానం ప్రవేశ పెట్టాలని.. మూసివేత సందర్భంగా ఉద్యోగులకు నష్టం జరగకుండా ప్రభుత్వం పాలసీ రూపొందించాలని పలువురు పారిశ్రామికవేత్తలు సూచించారు. చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమల ఉత్పత్తులను కొనుగోలు చేసే వ్యాపారులు 15 రోజుల్లోగా డబ్బు చెల్లించని పక్షంలో న్యాయపరమైన అధికారాలు ఉన్న ప్రత్యేక కమిటీకి పిర్యాదు చేయాల్సిందిగా కమిషనర్ సూచించారు. ముంబైలో ఫిబ్రవరి 13 -18 తేదీల నడుమ డిప్, సీఐఐ సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘మేకిన్ ఇండియా వీక్’ను విజయవంతం చేయాలని వనిత పిలుపునిచ్చారు.