త్వరలో రైతులకు తీపి కబురు అందిస్తాం
జనగామలో రైతులతో కేంద్రమంత్రి జేపీ నడ్డా ముఖాముఖి
జనగామ: ‘రైతులు పాలను సేకరిస్తారు. ఆ పాలతో మిఠాయిని తయారు చేస్తారు.. అలాగే, మీరిచ్చిన అమూల్యమైన సూచనలను మిఠాయిగా తయారు చేసి తీపి కబురును అందిస్తామని, ఇందుకోసం రైతు సమస్యలపై సమగ్ర నివేదికను ప్రధాని నరేంద్రమోదీకి అందజేస్తాను.’ అని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా అన్నారు. వరంగల్ జిల్లా జనగామలో బుధవారం ఆయన ‘రైతులతో ముఖాముఖి’ నిర్వహించారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడం వల్లే నేడు దేశంలో దుర్భర పరిస్థితులు ఎదురవుతున్నాయని ఆరోపించారు. గరీబీ హఠావో అన్న కాంగ్రెస్ 45 ఏళ్ల పాలనలో రైతులకు కేవలం 3 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరిచిందని, 17 నెలల మోదీ హయూంలో జన్‌ధన్ యోజన పథకం కింద 20 కోట్ల ఖాతాలు అందించామని చెప్పారు. వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న ఆటుపోట్లపై రాష్ట్ర ప్రభుత్వం కూడా సమగ్ర నివేదికలను కేంద్రానికి పంపించాలని సూచించారు.
వసతులు సమకూరిస్తే తెలంగాణకు ఎయిమ్స్
భువనగిరి: తెలంగాణకు కేంద్రం లక్ష కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. నల్లగొండ జిల్లా భువనగిరి, ఆలేరులో బుధవారం నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి వచ్చి రూ.లక్ష కోట్లు ప్రకటించనున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి సహకారం అందితే మరిన్ని నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితం కావాలని సూచించారు. మూసీ ప్రక్షాళన కోసం ఇండియన్ మెడికల్ కౌన్సిల్ రీసెర్చ్ బృందాన్ని పంపుతామని, వారి నివేదిక ఆధారంగా నిధులు కేటాయిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం భూమి, నీటి వసతి ఇతర మౌలిక సదుపాయాలు సమకూరిస్తే తెలంగాణకు ఎయిమ్స్ మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్రమంత్రి చెప్పారు.
జికా మహమ్మరిని తరిమేద్దాం
మోత్కూరు: జికా మహమ్మారిని తరిమేద్దాం అని కేంద్రమంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా పిలుపునిచ్చారు. ఇండియన్ రెడ్‌క్రాస్ మోత్కూ రు శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన కరపత్రాలను భువనగిరిలో బుధవారం ఆయన ఆవిష్కరించారు. జికా వ్యాధి నివారణ కోసం ప్రజల్లో అవగాహన తెచ్చేలా స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాలన్నారు. ఈ వ్యాధి సోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు.