Union Minister JP Nadda
-
‘కేంద్రం నిధులతో చంద్రబాబు అవినీతి’
సాక్షి, గుంటూరు : సీఎం చంద్రబాబు నాయుడి తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు గుప్పించారు. బీజేపీ కార్యకర్తల సమావేశం శుక్రవారం గుంటూరులో జరిగింది. ఈ సమావేశానికి కేంద్రమంత్రి జేపీ నడ్డా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, మాజీ మంత్రులు కామినేని, మాణిక్యాలరావు, గోకరాజు గంగరాజు, పురందేశ్వరి, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ఏపీలో కుక్కను మేక అని నమ్మించే ప్రయత్నం చంద్రబాబు, ఆయన భజన మీడియా చేస్తోందన్నారు. రాష్ట్రంలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరుగుతున్న అది కేంద్రం సహకారంతోనే అని కన్నా అన్నారు. ‘అంతేకాక దేశంలో ఉన్న అన్ని ఎయిమ్స్‌లలో ఏపీకే అత్యధిక నిధులు కేటాయించారు. ఏపీకి అన్ని రంగాల్లో సింహాభాగం నిధులు కేటాయించారు. నాలుగేళ్ళుగా చంద్రబాబు కేంద్రం నిధులు తీసుకుంటూ అవినీతికి పాల్పడుతున్నారు. చంద్రబాబు చేసే అవినీతిని ప్రజలందరికి తెలియజేయాలి. బాబు తాను బురద పూసుకుంటూ.. దానిని మనకి పూయాలని చూస్తున్నాడు. అంతేకాక ఏపీలో బాబు మోసం చేయని కులం అంటూ ఉందా? వెనక్కి తిరిగి చూసుకుంటే బాబుదంతా అవినీతి చరిత్ర. త్వరలో ఇంటింటికి బీజేపీలో భాగంగా బాబు అవినీతిని ప్రజలందరికి వివరించాలని’ కన్నా లక్ష్మీనారాయణ సమావేశంలో పేర్కొన్నారు. మోదీ చరిష్మా ప్రపంచ వ్యాప్తంగా.. సమావేశంలో కేంద్రమంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రంగాలలో సమూలమైన మార్పులు తెచ్చారు. ‘దేశంలో అభివృద్ధి జరుగుతుందని ప్రతిపక్షం కూడా చెప్పక తప్పలేదు. ప్రధాని మోదీ వచ్చాక అవినీతి, లంచాలు కనుమరుగై పోయాయి. గత పాలనలో అవినీతి, లంచగొండితనం ప్రపంచ వ్యాప్తంగా మారుమోగింది. ప్రధాని చరిష్మా ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతుంది. మోదీ పని తీరుపై ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూస్తున్నాయి. రైతులకు ఆదాయం పెంచడం కోసం వ్యవసాయంలో అనేక మార్పులు తెచ్చారు. మోదీ పాలనలో దేశం త్వరితగతిన ఎదుగుతుంది. మొదటి క్యాబినెట్లో పోలవరంకు నిధులు కేటాయించాం. ఏపీ అభివృద్ధిలో మా చిత్తశుద్దికి అదో నిదర్శనం’ కేంద్ర మంత్రి జేపి నడ్డా తెలిపారు. -
కేంద్ర ఉద్యోగులకు 2% డీఏ పెంపు
జనవరి 1, 2017 నుంచి అమలు న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం కరువు భత్యాన్ని (డీఏ) పెంచే నిర్ణయానికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. జనవరి 1, 2017 నుంచి అమల్లోకి రానున్న డీఏ పెంపుతో మొత్తం డీఏ 4 శాతానికి చేరింది. ‘ఏడవ వేతన సవరణ సంఘం సిఫారసులకు అనుగుణంగా ధరల పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని మూల వేతనం/పింఛనుపై 2% డీఏ పెంచుతున్నాం. దీనిద్వారా 48.85 లక్షల మంది ఉద్యోగులకు, 55.51 లక్షల మంది పింఛనుదారులకు లాభం చేకూరనుంది’ అని ప్రభుత్వం తెలిపింది. ఈ పెంపు ద్వారా ఖజానాపై రూ.5,857.28 కోట్ల భారం (2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.6,833 .50 కోట్లు) పడుతుందని ప్రకటనలో పేర్కొంది. మరిన్ని కేబినెట్ నిర్ణయాలు: రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న జాతీయ వైద్య విధానానికి కేంద్ర కేబినెట్ ఆమోదం. దేశంలో ప్రతి ఒక్కరికీ ఆరోగ్యసేవలందించటం ఈ విధానం ఉద్దేశం. దీనిపై కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా గురువారం పార్లమెంటులో ప్రకటన చేసే అవకాశం. ► దేశంలోని 15 ట్రిపుల్ ఐటీలకు (పీపీపీ కింద ఏర్పాటుచేసిన) డిగ్రీలు ప్రదానం చేసే అధికారాన్ని కట్టబెడుతూ కేబినెట్ నిర్ణయం. ఐఐటీ–పీపీపీ బిల్లులు–2017కు కేబినెట్ ఆమోదం. ఈ 15 సంస్థలను జాతీయ ప్రాధాన్య సంస్థలుగా గుర్తింపు. ఇందులో ఏపీ నుంచి చిత్తూరు, కర్నూలు ఐఐఐటీలున్నాయి. ► ఉత్తరప్రదేశ్‌లో రూ.2,147.33 కోట్లతో హందియా–వారణాసి మధ్య 73 కి.మీ. హైవే విస్తరణకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ అంగీకారం. ఎన్‌హెచ్‌డీపీ–5వ దశలో భాగంగా ఈ ప్రాజెక్టుకు ఆమోదం. దీనిద్వారా స్థానికంగా ఉపాధి కల్పనకూ అవకాశం ఉంటుంది. ► కోల్–బెడ్ మిథేన్ (సీబీఎం) ఉత్పత్తిదారులు తాము ఉత్పత్తి చేసిన దానికి ధరను నిర్ణయించి మార్కెటింగ్ చేసుకునే అవకాశం కల్పిస్తూ కేబినెట్ నిర్ణయం. దీని ద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్, ఓఎన్జీసీ వంటి సంస్థలు ధరలపై పారదర్శకంగా బిడ్డింగ్ వేసుకునే అవకాశం. -
జేపీ నడ్డాతో తెలంగాణ ఎంపీల భేటీ
ఢిల్లీ: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో తెలంగాణ ఎంపీలు భేటీ అయ్యారు. ఎంపీలు వినోద్‌కుమార్, కొత్త ప్రభాకర్‌రెడ్డిలు ఆయనను కలిశారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు త్వరితగతిన ఎయిమ్స్‌ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణలో ఎయిమ్స్ ఏర్పాటు చేస్తే కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు కూడా ఉపయోగం ఉంటుందని చెప్పారు. తెలంగాణ సరిహద్దుగా ఉన్న ఆ మూడు రాష్ర్టాల్లోని వెనకబడిన జిల్లాలకు వైద్య సేవలు అందుతాయని చెప్పారు. ఎయిమ్స్ ఏర్పాటుకు నిధులు కేటాయిస్తామని కేంద్ర మంత్రి హామి ఇచ్చినట్లు ఎంపీలు తెలిపారు. -
అమ్మ ఆరోగ్యంపై కేంద్ర మంత్రి కీలక ప్రకటన
న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్టు వార్తలు వస్తున్న తరుణంలో కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఓ ప్రకటన చేశారు. జయలలితకు ప్రాణాపాయం తప్పిందని, అయితే ఐసీయూ సేవలు అవసరమని ఆయన ప్రకటించారు. ‘జయలలిత ఆరోగ్య పరిస్థితిపై చెన్నైలోని అపోలో ఆస్పత్రి వర్గాలతో, తమిళనాడు ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నాం. ఢిల్లీ ఎయిమ్స్ నుంచి వైద్యుల బృందాన్ని చెన్నైకు పంపాం. జయలలిత ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నాం. ఆదివారం ఆమెకు గుండె సంబంధిత సమస్య ఏర్పడటంతో ఐసీయూకు తరలించారు. ప్రస్తుతం ఆమెకు ప్రాణాపాయం తప్పింది. అయితే ఐసీయూ సేవలు అవసరం. జయలలిత చికిత్స కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తాం. ఎయిమ్స్ వైద్యులు చెన్నైకు వెళ్లిన తర్వాత ఆమె ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తారు. ఆ తర్వాత తదుపరి చర్యలు ఏం తీసుకోవాలన్నది నిర్ణయిస్తాం’ అని జేపీ నడ్డా చెప్పారు. -
కేంద్ర మంత్రిపై ఇంక్ చల్లిన విద్యార్థులు
-
కేంద్ర మంత్రిపై ఇంక్ చల్లిన విద్యార్థులు
భోపాల్: కేంద్ర మంత్రికి సమస్యలు విన్నవించుకోవాలనుకున్న విద్యార్థులు.. ఆగకుండా వెళ్లిపోతున్న ఆయనను ఆపేందుకు పరిధిదాటి ప్రవర్తించారు. మంత్రిగారిపైనే ఇంక్ చల్లారు. శనివారం భోపాల్ ఎయిమ్స్ లో చోటుచేసుకుందీ సంఘటన. అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు భోపాల్ ఎయిమ్స్ కు వచ్చిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను అదే కళాశాల మెడిసిన్ విద్యార్థులు చుట్టుముట్టారు. ఎయిమ్స్ లో నెలకొన్న సమస్యలను మంత్రికి విన్నవించుకోవాలనుకున్నారు. కానీ ఎంతకూ వినిపించుకోకపోవడంతో ఆయనపై ఇంక్ చల్లారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వెంటనే పోలీసులు రక్షణ వలయంగా ఏర్పడి మంత్రి నడ్డాను కారు వద్దకు తీసుకెళ్లి పంపించేశారు. 'మా కాలేజీలో అనేక సమస్యలున్నాయి. సరైన అధ్యాపకులు లేరు. వసతి కూడా దారుణంగా ఉంది. ఈ విషయాలను మంత్రిగారి దృష్టికి తీసుకెళ్లాలనుకున్నాం. కానీ ఆయన ఆగకుండా వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. ఆయన్ని ఎలాగైనా ఆపాలనే ఇంక్ చల్లాం తప్ప మరో ఉద్దేశం కాదు'అని విద్యార్థులు పేర్కొన్నారు. ఈ ఘటనపై ఇప్పటివరకు పోలీసు ఫిర్యాదు దాఖలుకాలేదు. -
త్వరలో రైతులకు తీపి కబురు అందిస్తాం
జనగామలో రైతులతో కేంద్రమంత్రి జేపీ నడ్డా ముఖాముఖి జనగామ: ‘రైతులు పాలను సేకరిస్తారు. ఆ పాలతో మిఠాయిని తయారు చేస్తారు.. అలాగే, మీరిచ్చిన అమూల్యమైన సూచనలను మిఠాయిగా తయారు చేసి తీపి కబురును అందిస్తామని, ఇందుకోసం రైతు సమస్యలపై సమగ్ర నివేదికను ప్రధాని నరేంద్రమోదీకి అందజేస్తాను.’ అని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా అన్నారు. వరంగల్ జిల్లా జనగామలో బుధవారం ఆయన ‘రైతులతో ముఖాముఖి’ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడం వల్లే నేడు దేశంలో దుర్భర పరిస్థితులు ఎదురవుతున్నాయని ఆరోపించారు. గరీబీ హఠావో అన్న కాంగ్రెస్ 45 ఏళ్ల పాలనలో రైతులకు కేవలం 3 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరిచిందని, 17 నెలల మోదీ హయూంలో జన్‌ధన్ యోజన పథకం కింద 20 కోట్ల ఖాతాలు అందించామని చెప్పారు. వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న ఆటుపోట్లపై రాష్ట్ర ప్రభుత్వం కూడా సమగ్ర నివేదికలను కేంద్రానికి పంపించాలని సూచించారు. వసతులు సమకూరిస్తే తెలంగాణకు ఎయిమ్స్ భువనగిరి: తెలంగాణకు కేంద్రం లక్ష కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. నల్లగొండ జిల్లా భువనగిరి, ఆలేరులో బుధవారం నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి వచ్చి రూ.లక్ష కోట్లు ప్రకటించనున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి సహకారం అందితే మరిన్ని నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితం కావాలని సూచించారు. మూసీ ప్రక్షాళన కోసం ఇండియన్ మెడికల్ కౌన్సిల్ రీసెర్చ్ బృందాన్ని పంపుతామని, వారి నివేదిక ఆధారంగా నిధులు కేటాయిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం భూమి, నీటి వసతి ఇతర మౌలిక సదుపాయాలు సమకూరిస్తే తెలంగాణకు ఎయిమ్స్ మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్రమంత్రి చెప్పారు. జికా మహమ్మరిని తరిమేద్దాం మోత్కూరు: జికా మహమ్మారిని తరిమేద్దాం అని కేంద్రమంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా పిలుపునిచ్చారు. ఇండియన్ రెడ్‌క్రాస్ మోత్కూ రు శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన కరపత్రాలను భువనగిరిలో బుధవారం ఆయన ఆవిష్కరించారు. జికా వ్యాధి నివారణ కోసం ప్రజల్లో అవగాహన తెచ్చేలా స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాలన్నారు. ఈ వ్యాధి సోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. -
'దేశంలో 5 కోట్ల మంది మానసిక రోగులు'
మన దేశంలో దాదాపు 5 కోట్ల మంది డిప్రెషన్, యాంగ్జయిటీ లాంటి మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. గత సంవత్సరం ఏడు వేల మందికి పైగా ఇలాంటి సమస్యలతోనే ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. 2005లో అయితే కోటి - రెండు కోట్ల మంది మాత్రమే స్కిజోఫ్రేనియా, బైపోలార్ డిజార్డర్ లాంటి మానసిక సమస్యలతో బాధపడేవారని జాతీయ మాక్రో ఎకనమిక్స్ కమిషన్ తెలిపింది. ఈ విషయాలను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నద్దా లోక్‌సభకు తెలిపారు. మానసిక సమస్యలతో ఆత్మహత్యలు చేసుకున్నవాళ్లు 2012లో 7,769 మంది, 2013లో 8,006 మంది, 2014లో 7,104 మంది ఉన్నారు. దేశంలో మొత్తం 3,800 మంది సైకియాట్రిస్టులు, 898 మంది క్లినికల్ సైకాలజిస్టులు, 850 మంది సైకియాట్రిక్ సోషల్ వర్కర్లు, 1,500 మంది సైకియాట్రిక్ నర్సులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే 3 ఆరోగ్య సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వరంలో నడిచేవి 40 ఆస్పత్రులు, వివిధ వైద్యకళాశాలల్లో 398 మానసిక వైద్య విభాగాలు ఉన్నాయి. వీటన్నింటిలో మానసిక రోగులకు చికిత్సలు అందిస్తున్నారు.