జనవరి 1, 2017 నుంచి అమలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం కరువు భత్యాన్ని (డీఏ) పెంచే నిర్ణయానికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. జనవరి 1, 2017 నుంచి అమల్లోకి రానున్న డీఏ పెంపుతో మొత్తం డీఏ 4 శాతానికి చేరింది. ‘ఏడవ వేతన సవరణ సంఘం సిఫారసులకు అనుగుణంగా ధరల పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని మూల వేతనం/పింఛనుపై 2% డీఏ పెంచుతున్నాం. దీనిద్వారా 48.85 లక్షల మంది ఉద్యోగులకు, 55.51 లక్షల మంది పింఛనుదారులకు లాభం చేకూరనుంది’ అని ప్రభుత్వం తెలిపింది. ఈ పెంపు ద్వారా ఖజానాపై రూ.5,857.28 కోట్ల భారం (2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.6,833 .50 కోట్లు) పడుతుందని ప్రకటనలో పేర్కొంది.
మరిన్ని కేబినెట్ నిర్ణయాలు: రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న జాతీయ వైద్య విధానానికి కేంద్ర కేబినెట్ ఆమోదం. దేశంలో ప్రతి ఒక్కరికీ ఆరోగ్యసేవలందించటం ఈ విధానం ఉద్దేశం. దీనిపై కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా గురువారం పార్లమెంటులో ప్రకటన చేసే అవకాశం.
► దేశంలోని 15 ట్రిపుల్ ఐటీలకు (పీపీపీ కింద ఏర్పాటుచేసిన) డిగ్రీలు ప్రదానం చేసే అధికారాన్ని కట్టబెడుతూ కేబినెట్ నిర్ణయం. ఐఐటీ–పీపీపీ బిల్లులు–2017కు కేబినెట్ ఆమోదం. ఈ 15 సంస్థలను జాతీయ ప్రాధాన్య సంస్థలుగా గుర్తింపు. ఇందులో ఏపీ నుంచి చిత్తూరు, కర్నూలు ఐఐఐటీలున్నాయి.
► ఉత్తరప్రదేశ్‌లో రూ.2,147.33 కోట్లతో హందియా–వారణాసి మధ్య 73 కి.మీ. హైవే విస్తరణకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ అంగీకారం. ఎన్‌హెచ్‌డీపీ–5వ దశలో భాగంగా ఈ ప్రాజెక్టుకు ఆమోదం. దీనిద్వారా స్థానికంగా ఉపాధి కల్పనకూ అవకాశం ఉంటుంది.
► కోల్–బెడ్ మిథేన్ (సీబీఎం) ఉత్పత్తిదారులు తాము ఉత్పత్తి చేసిన దానికి ధరను నిర్ణయించి మార్కెటింగ్ చేసుకునే అవకాశం కల్పిస్తూ కేబినెట్ నిర్ణయం. దీని ద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్, ఓఎన్‌జీసీ వంటి సంస్థలు ధరలపై పారదర్శకంగా బిడ్డింగ్ వేసుకునే అవకాశం.
కేంద్ర ఉద్యోగులకు 2% డీఏ పెంపు
Published Thu, Mar 16 2017 2:07 AM | Last Updated on Mon, Aug 20 2018 9:18 PM
Advertisement